Telugu Global
Sports

ఐపీఎల్ -16లో పాండ్యా బ్రదర్స్ సరికొత్త చరిత్ర!

బరోడా డైనమైట్స్ కమ్ పాండ్యా బ్రదర్స్ కృణాల్, హార్థిక్..ఐపీఎల్ లో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నారు. రెండు వేర్వేరుజట్లకు నాయకత్వం వహించడం ద్వారా ముఖాముఖీ తలపడిన తొలి బ్రదర్స్ జోడీగా రికార్డుల్లో చేరారు.

Pandya Brothers
X

Pandya Brothers

బరోడా డైనమైట్స్ కమ్ పాండ్యా బ్రదర్స్ కృణాల్, హార్థిక్..ఐపీఎల్ లో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నారు. రెండు వేర్వేరుజట్లకు నాయకత్వం వహించడం ద్వారా ముఖాముఖీ తలపడిన తొలి బ్రదర్స్ జోడీగా రికార్డుల్లో చేరారు.

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను గత 16 సంవత్సరాలుగా అలరిస్తూ వస్తున్న ఐపీఎల్ అంటేనే ఎన్నో అరుదైన ఘనతలు, అసాధారణ రికార్డుల ఖజానా.

పరుగులు, వికెట్లు, సిక్సర్లు, బౌండ్రీలు, విజయాలు, క్యాచ్ లు..ఇలా, ఒకటేమిటి..ఎన్నో రికార్డుల సమాహారం. ఆటగాళ్ల వేలం నుంచి వ్యక్తిగత అంశాల వరకూ ఎన్నో వింతలు , విశేషాలు.

ప్రస్తుత 16వ సీజన్లో ఒకే ఫ్రాంచైజీకి ఆడిన తండ్రి కొడుకుగా మాస్టర్ సచిన్ టెండుల్కర్, అర్జున్ టెండుల్కర్ కొద్ది రోజుల క్రితమే రికార్డు నెలకొల్పిన నేపథ్యంలో..

రెండు వేర్వేరు జట్లకు నాయకత్వం వహిస్తూ ముఖాముఖీ తలపడిన సోదరులుగా కృణాల్ పాండ్యా, హార్థిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించారు.

2015 నుంచి 2020 సీజన్ వరకూ ముంబై ఫ్రాంచైజీకి ఆడుతూ వచ్చిన పాండ్యా బ్రదర్స్..2021 సీజన్ నుంచి రెండు వేర్వేరు ఫ్రాంచైజీలలో చేరారు.

పెద్దోడికి 8 కోట్లు..చిన్నోడికి 15కోట్లు...

బరోడాలోని ఓ దిగువమధ్య తరగతి కుటుంబానికి చెందిన పాండ్యా సోదరులు చిన్నతనంలో ఎన్నోకష్టాలను ఎదుర్కొన్నారు. తగిన ఆర్థికస్థోమతు లేకపోడంతో కడుపు నింపుకోడానికే నానాపాట్లు పడాల్సి వచ్చింది. అయితే..ఈ సోదరులు ఇద్దరిలో అపారక్రికెట్ నైపుణ్యం ఉండటం, ఐపీఎల్ పుణ్యమా అంటూ వారి ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

32 సంవత్సరాల కృణాల్ పాండ్యా, 29 సంవత్సరాల హార్ధిక్ పాండ్యా 2015లో ముంబై ఫ్రాంచైజీ సభ్యులు కావడంతో దశ తిరిగిపోయింది. ఈ సోదరుల్లో పెద్దోడు కృణాల్ పాండ్యా ఎడమచేతి వాటం స్పిన్ ఆల్ రౌండర్ కాగా...చిన్నోడు హార్థిక్ పాండ్యా మీడియం పేస్ ఆల్ రౌండర్. ముంబై ఇండియన్స్ ఐపీఎల్ విజేతగా పలు టైటిల్స్ గెలుచుకోడంలో పాండ్యా బ్రదర్స్ పాత్ర సైతం ఉంది.

2015 నుంచి 2020 వరకూ ముంబై ఫ్రాంచైజీ నుంచి కృణాల్ పాండ్యా సీజన్ కు 8 కోట్ల 80లక్షల రూపాయలు, హార్థిక్ పాండ్యా 11 కోట్ల రూపాయలు చొప్పున వేతనం అందుకొంటూ వచ్చారు.

లక్నోకి కృణాల్...అహ్మదాబాద్ కి హార్థిక్...

2021 సీజన్ వేలంలో కృణాల్ పాండ్యాను లక్నో ఫ్రాంచైజీ 8 కోట్ల 25 లక్షల రూపాయల ధరకు సొంతం చేసుకొంటే..హార్థిక్ పాండ్యా 15 కోట్ల రూపాయల కాంట్రాక్టుపై అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు.

లక్నో తరపున కృణాల్, అహ్మదాబాద్ తరపున హార్థిక్ ఆల్ రౌండర్లుగా రాణించడం ద్వారా సత్తా చాటుకొన్నారు. హార్ధిక్ పాండ్యా కెప్టెన్ గా తన తొలిసీజన్లోనే

గుజరాత్ టైటాన్స్ ను ఐపీఎల్ విజేతగా నిలపడం విశేషం.

గత సీజన్ వరకూ ప్రత్యర్థులుగా తమతమ జట్ల తలపడిన పాండ్యా బ్రదర్స్ ..ప్రస్తుత 2023 సీజన్ రెండో అంచెపోటీలో మాత్రం ప్రత్యర్థి కెప్టెన్లుగా పోటీకి దిగటం ఓ అరుదైన ఘటనగా మిగిలింది.

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన రెండో అంచెమ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడిన సమయంలో..

పాండ్యా బ్రదర్స్ తమతమ జట్లకు నాయకత్వం వహించారు. లక్నో కెప్టెన్ రాహుల్ గాయంతో జట్టుకు అందుబాటులో లేకపోడంతో కృణాల్ పాండ్యాకి కెప్టెన్సీ బాధ్యతల్ని అప్పగించారు.

ఏకపక్షంగా సాగిన ఈపోరులో చిన్నోడిజట్టే 56 పరుగుల తేడాతో పెద్దోడి జట్టును చిత్తు చేయడం ద్వారా విజేతగా నిలిచింది.

భారతజట్టు సభ్యులుగా...

కృణాల్ పాండ్యాకి భారత్ తరపున 5వన్డేలు, 19 టీ-20 మ్యాచ్ లు ఆడిన రికార్డు ఉంది. భారత్ తరపున తన చివరి మ్యాచ్ 2021 సీజన్లో ఆడాడు.

ఇక.. హార్థిక్ పాండ్యాకి భారత్ తరపున 11 టెస్టులు, 74 వన్డేలు, 87 టీ-20 మ్యాచ్ లు ఆడిన రికార్డు ఉంది. టీ-20లో భారత్ కు ప్రస్తుతం కెప్టెన్ గా కూడా వ్యవహరిస్తున్నాడు.

ఐపీఎల్ లో సీజన్ కు 23 కోట్ల రూపాయలు చొప్పున తమ ఇంటికి పట్టుకుపోతున్న సోదరుల జోడీగా కృణాల్- హార్థిక్ మరో రికార్డును తమపేరుతో లిఖించుకొన్నారు.

గతంలో యూసుఫ్ పఠాన్- ఇర్ఫాన్ పఠాన్ ఐపీఎల్ లో రెండు వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడిన బరోడా సోదరులుగా నిలిస్తే..ఆ పరంపరను బరోడాకే చెందిన మరో జోడీ పాండ్యా బ్రదర్స్ కొనసాగించడం విశేషం.



First Published:  8 May 2023 7:20 AM GMT
Next Story