Telugu Global
Sports

గాల్లో దీపంలా పాక్ ప్రపంచకప్ సెమీస్ బెర్త్!

వన్డే ప్రపంచకప్ లో మాజీ చాంపియన్ పాకిస్థాన్ సెమీఫైనల్స్ బెర్త్ గాల్లో దీపంలా మారింది. నాకౌట్ రౌండ్ చేరాలంటే ఇంగ్లండ్ తో జరిగే ఆఖరిరౌండ్ పోరులో అతిపెద్ద భారీవిజయం సాధించి తీరాల్సి ఉంది.

గాల్లో దీపంలా పాక్ ప్రపంచకప్ సెమీస్ బెర్త్!
X

వన్డే ప్రపంచకప్ లో మాజీ చాంపియన్ పాకిస్థాన్ సెమీఫైనల్స్ బెర్త్ గాల్లో దీపంలా మారింది. నాకౌట్ రౌండ్ చేరాలంటే ఇంగ్లండ్ తో జరిగే ఆఖరిరౌండ్ పోరులో అతిపెద్ద భారీవిజయం సాధించి తీరాల్సి ఉంది.

ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ 9వ రౌండ్లో శ్రీలంకపై న్యూజిలాండ్ భారీవిజయం సాధించడంతో మాజీ చాంపియన్ పాకిస్థాన్, సంచలనాల అప్ఘనిస్థాన్ సెమీఫైనల్స్ ఆశలు దాదాపుగా మూసుకుపోయాయి.

ఇప్పటి వరకూ జరిగిన 8 రౌండ్లలో ఇటు పాకిస్థాన్, అటు అప్ఘన్ జట్లు చెరో నాలుగు విజయాలతో 8 పాయింట్ల చొప్పున సాధించడం ద్వారా 10 జట్ల లీగ్ టేబుల్ 5, 6 స్థానాలలో కొనసాగుతున్నాయి.

న్యూజిలాండ్ ఆఖరిరౌండ్ విజయంతో....

శ్రీలంకతో ముగిసిన ఆఖరి రౌండ్ పోరులో న్యూజిలాండ్ 5 వికెట్లతో శ్రీలంకను చిత్తు చేయడం ద్వారా 9 రౌండ్లలో 5 విజయాలు, 4 పరాజయాలతో 10 పాయింట్లు సాధించడం ద్వారా సెమీస్ ఆఖరి బెర్త్ ను ఖాయం చేసుకోగలిగింది. అయితే..ఇంగ్లండ్ తో పాకిస్థాన్, దక్షిణాఫ్రికాతో అప్ఘనిస్థాన్ జట్లు ఆడే ఆఖరి రౌండ్ మ్యాచ్ ల ఫలితాల తరువాతే కివీస్ సెమీస్ బెర్త్ ఖరారు కానుంది.

ఒక విధంగా చెప్పాలంటే..పాకిస్థాన్ సెమీస్ దారులు దాదాపుగా మూసుకుపోయినట్లే. అయితే..దింపుడుకల్లం ఆశలతో ఆఖరిరౌండ్ మ్యాచ్ కు బాబర్ అజమ్ నాయకత్వంలోని పాక్ జట్టు ఎదురుచూస్తోంది.

సెమీఫైనల్స్ చేరాలంటే....?

పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్స్ చేరాలంటే కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తో జరిగే ఆఖరిరౌండ్ మ్యాచ్ లో అతిపెద్ద విజయం సాధించాల్సి ఉంది.

పాక్ జట్టు ముందుగా బ్యాటింగ్ కు దిగితే 300 పరుగుల స్కోరు నమోదు చేయడంతో పాటు..ఇంగ్లండ్ ను 13 పరుగులకే పరిమితం చేయాల్సి ఉంది.

పాక్ జట్టు 400 పరుగుల స్కోరు సాధించగలిగితే ఇంగ్లండ్ ను 112 పరుగులకు, 450 స్కోరు నమోదు చేయగలిగితే 162 పరుగులకు, 500 స్కోరు సాధించగలిగితే 211 పరుగులకు ప్రత్యర్థి ఇంగ్లండ్ ను కట్టడి చేయాల్సి ఉంది.

పాక్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకొంటే 287 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పై విజయం సాధించాల్సి ఉంది. అదే పాక్ జట్టు చేజింగ్ కు దిగితే 284 బంతులు మిగిలి ఉండగానే ప్రత్యర్థిని పరిమితం చేయాల్సి ఉంది.

ఏదిఏమైనా ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందన్న సామెత ప్రస్తుతం పాక్ క్రికెట్ జట్టుకు వర్తిస్తుంది. సెమీఫైనల్స్ చేరాలంటే ఆఖరి రౌండ్లో ఏదైనా అద్భుతం జరిగితేనే సాధ్యపడే లక్ష్యాలను అందుకోవాల్సి ఉంది.

ఒకవేళ పాకిస్థాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకొంటే 300 స్కోరు సాధించడం సాధ్యపడినా..ఆ తరువాత ఇంగ్లండ్ ను 13 పరుగులకే పరిమితం చేయడం కలలో కూడా సాధ్యంకాని పని.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్స్ బెర్త్ అవకాశాలు గాల్లో దీపంలా మారిపోయాయి.

ఆతిథ్య భారత్, దక్షిణాఫ్రికా, ఐదుసార్లు విజేత ఆస్ట్ర్రేలియా ఇప్పటికే లీగ్ టేబుల్ మొదటి మూడుస్థానాలలో నిలవడం ద్వారా సెమీస్ బెర్త్ లు ఖాయం చేసుకోగలిగాయి.

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఈనెల 15న జరిగే తొలి సెమీఫైనల్లో లీగ్ టేబుల్ 4వ స్థానంలో నిలిచిన జట్టుతో టేబుల్ టాపర్ భారత్ తలపడనుంది.

రెండో సెమీఫైనల్లో ఆస్ట్ర్రేలియా, దక్షిణాఫ్రికాజట్లు నవంబర్ 16న అమీతుమీ తేల్చుకోనున్నాయి.

ప్రస్తుత చాంపియన్ ఇంగ్లండ్, మాజీచాంపియన్ శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ నాకౌట్ రేస్ కు దూరం కాగా..పాకిస్థాన్, అప్ఘనిస్థాన్ జట్లు సైతం నిష్క్ర్రమించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

First Published:  10 Nov 2023 7:41 AM GMT
Next Story