Telugu Global
Sports

భారత్ చేతిలో ఓటమితో పాక్ టీమ్ డైరెక్టర్ వితండవాదం!

భారత్ చేతిలో వరుసగా ఎనిమిదోసారి ఎదురైన ఓటమిని పాక్ క్రికెట్ టీమ్ మేనేజ్ మెంట్ జీర్ణించుకోలేకపోతోంది. వితండవాదంతో సమర్థించుకోడానికి ప్రయత్నిస్తోంది.

భారత్ చేతిలో ఓటమితో పాక్ టీమ్ డైరెక్టర్ వితండవాదం!
X

భారత్ చేతిలో వరుసగా ఎనిమిదోసారి ఎదురైన ఓటమిని పాక్ క్రికెట్ టీమ్ మేనేజ్ మెంట్ జీర్ణించుకోలేకపోతోంది. వితండవాదంతో సమర్థించుకోడానికి ప్రయత్నిస్తోంది...

వన్డే ప్రపంచకప్ లో భారత్ చేతిలో వరుసగా ఎనిమిదో ఓటమి చవిచూసిన పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మేనేజ్ మెంట్ కు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. పొంతన లేని సాకులతో తమ ఘోరపరాజయాన్ని మసిపూసి మారేడు కాయ చేయాలని చూస్తోంది.

ఇది ఐసీసీ టోర్నీనా..బీసీసీఐ హంగామానా?

అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్- పాకిస్థాన్ జట్ల నడుమ జరిగిన ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ కు రికార్డుస్థాయిలో లక్షా 30 వేల మంది హాజరయ్యారు. టీవీ ప్రసారాల ద్వారా ఈ భూఖండంలోని కోట్లాదిమంది అభిమానులు మ్యాచ్ ను వీక్షించారు. పైగా ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా స్టేడియంలో కూర్చుని చూడటం కోసం 57 దేశాలలోని భారత్, పాక్ సంతతి అభిమానులు వేలాదిగా అహ్మదాబాద్ కు తరలి వచ్చారు.

చిరకాల ప్రత్యర్థుల ఈ సమరం హోరాహోరీగా సాగుతుందని అందరూ భావించారు. అయితే..అందరి అంచనాలు, ఊహాగానాలను తలకిందులు చేస్తూ ఈ పోరును భారత్ ఏకపక్షంగా ముగించింది. పాకిస్థాన్ ను 191 పరుగులకే కుప్పకూల్చడం ద్వారా 7 వికెట్ల అలవోక విజయం సాధించింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సర్ల వర్షంతో పరుగుల మోత మోగించాడు. ఏ విధంగా చూసినా ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టు భారత్ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించగలిగింది.

రగిలిపోతున్న పాక్ టీమ్ మేనేజ్ మెంట్...

వేలాదిమంది అభిమానుల సమక్షంలో ..కోట్లాదిమంది అభిమానులు చూస్తుండగా భారత్ చేతిలో తమ జట్టుకు ఎదురైన ఓటమిని పాకిస్థాన్ ఆటగాళ్లు స్వీకరించినా..పాక్ టీమ్ మేనేజ్ మెంట్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. భారత్ కు తాము ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయామన్న వాస్తవాన్ని పక్కనపెట్టి..ఓటమికి లేనిపోని కుంటిసాకులు వెదుకుతోంది.

అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ తనకు ఐసీసీ నిర్వహిస్తున్న టోర్నీలా అనిపించలేదని, కేవలం బీసీసీఐ హంగామా, షోగా కనిపించిందని పాకిస్థాన్ క్రికెట్ టీమ్ డైరెక్టర్ మికీ ఆర్థర్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

మ్యాచ్ జరిగే సమయంలో స్టేడియంలోని వాతావరణం ఏకపక్షంగా ఉందని, ఐసీసీ నిర్వహిస్తున్న మ్యాచ్ లో ఆడుతున్నామన్న స్పృహ తమజట్టు ఆటగాళ్లలో లేకుండా పోయిందని ఆర్థర్ వాపోయారు.

మ్యాచ్ జరిగిన, మ్యాచ్ ను నిర్వహించిన తీరు గురించి తాను ఉన్నది ఉన్నట్లుగా చెప్పకపోతే ఘోరమైన తప్పు చేసినవాడిగా మిగిలిపోతానని ప్రకటించారు. తనకు ' దిల్ దిల్ పాకిస్థాన్ ' అన్నమాట, పాటే వినిపించలేదంటూ చెప్పుకొచ్చారు. అయితే..స్టేడియంలోని వేలాదిమంది అభిమానుల మద్దతు లేకపోడమే తమ ఓటమికి కారణమని చెప్పడం లేదని స్పష్టం చేశారు.

తమజట్టు స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయిందని, మరింత మెరుగైన ఆటతీరు ప్రదర్శించి ఉండాల్సిందని పాక్ టీమ్ డైరెక్టర్ అన్నారు.

ఐసీసీ ఘాటైన సమాధానం...

అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ నిర్వహించిన తీరును పాకిస్థాన్ టీమ్ డైరెక్టర్ మికీ ఆర్థర్ తప్పుపట్టడాన్ని ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్ లే తిప్పికొట్టారు. తాము ఎప్పుడు, ఎక్కడ పోటీలు నిర్వహించినా ఎవరో ఒకరు విమర్శించడం సహజమేనని, ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకొంటామని తేల్చి చెప్పారు.

మ్యాచ్ జరిగిన తీరు, నిర్వహించిన తీరు తమకు సంతృప్తి నిచ్చిందని ఐసీసీ చైర్మన్ వివరించారు.

ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉంది- వాసిం...

భారత్ తో జరిగిన మ్యాచ్ లో సమర్థవంతంగా ఆడలేక, ఘోరపరాజయం చవిచూసిన పాక్ టీమ్ మేనేజ్ మెంట్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి కుంటిసాకులు వెదుకుతోందని, టీమ్ డైరెక్టర్ మికీ చెబుతున్న వివరణ ఏమాత్రం సబబుగా లేదని మాజీ కెప్టెన్, విఖ్యాత కామెంటీటర్ వాసిం అక్రం మండిపడ్డారు.

ఓటమి అనంతరం మికీ చేసిన వ్యాఖ్యలు చూస్తే..ఆడలేక మద్దెల ఓడు అన్న సామెత తనకు గుర్తుకు వచ్చిందని చురక అంటించారు.

భారత్ ను ఓడించడానికి ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాము, లోపం ఎక్కడ జరిగిందన్న వాస్తవాలను గురించి మాట్లాడకుండా సంబంధం లేని ఏవో అంశాల గురించి మాట్లాడుతూ ఓటమి బాధ్యత నుంచి తప్పించుకోలేరంటూ హెచ్చరించారు.

పాకిస్థాన్ మరో మాజీ కెప్టెన్ మోయిన్ ఖాన్ సైతం తమ టీమ్ డైరెక్టర్ మికీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. భారత్ ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని, ఇలాంటి మ్యాచ్ లు ఎలా నిర్వహించాలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్..భారత్ ను చూసి తెలుసుకోవాలని, భారత విధానాలను కాపీ కొట్టినా తప్పులేదని అన్నారు.

ఓ మ్యాచ్ కు లక్షా 30 వేలమంది అభిమానులు హాజరయ్యేలా చూసిన బీసీసీఐని అభినందించక తప్పదంటూ వాసిం అక్రం ప్రశంసల వర్షం కురిపించాడు.

మొత్తం మీద పాక్ టీమ్ డైరెక్టర్ మికీ ఆర్థర్ వ్యాఖ్యలు వికటించడమే కాదు..ఓటమి అవమానాన్ని రెట్టింపు చేసాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  17 Oct 2023 11:30 AM GMT
Next Story