Telugu Global
Sports

ఆసియాకప్ లో భారత్ కు పాక్ సూపర్ షాక్!

ఆసియాకప్ సూపర్ -4 రౌండ్ ను డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఓటమితో మొదలు పెట్టింది. దుబాయ్ స్టేడియం వేదికగా ముగిసిన హోరాహోరీ పోరులో పాకిస్థాన్ 5 వికెట్లతో భారత్ ను కంగుతినిపించి..లీగ్ దశ ఓటమికి బదులు తీర్చుకొంది..

ఆసియాకప్ లో భారత్ కు పాక్ సూపర్ షాక్!
X

ఆసియాకప్ సూపర్ -4 రౌండ్ ను డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఓటమితో మొదలు పెట్టింది. దుబాయ్ స్టేడియం వేదికగా ముగిసిన హోరాహోరీ పోరులో పాకిస్థాన్ 5 వికెట్లతో భారత్ ను కంగుతినిపించి..లీగ్ దశ ఓటమికి బదులు తీర్చుకొంది..

ఆసియాకప్ వేదికగా ఆసియా దిగ్గజాలు భారత్-పాక్ జట్ల పోరు ఉత్కంఠభరితంగా సాగుతోంది. రెండుజట్లూ అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన క్రికెట్ ఆడుతూ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను ఓలలాడిస్తున్నాయి.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా గత వారం ప్రారంభమైన 15వ ఆసియాకప్ గ్రూప్ -ఏ లీగ్ ప్రారంభమ్యాచ్ తొలిరౌండ్లో భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ను కంగుతినిపిస్తే..అదే దుబాట్ స్టేడియం వేదికగా..వారం రోజుల తర్వాత జరిగిన సూపర్-4 రౌండ్ తొలిపోరులో పాక్ జట్టు 5 వికెట్ల తేడాతోనే భారత్ పై నెగ్గి దెబ్బకు దెబ్బతో బదులు తీర్చుకొంది.

రోహిత్- రాహుల్ ప్రపంచ రికార్డు భాగస్వామ్యం...

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన ఈ సూపర్-4 రౌండ్ సూపర్ పోరులో కీలక టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్ కు దిగాల్సి వచ్చింది.

భారత స్టార్ ఓపెనింగ్ జోడీ రోహిత్- రాహుల్ కేవలం 5.1 ఓవర్లలోనే మొదటి వికెట్ కు 54 పరుగుల మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు.రోహిత్ 16 బాల్స్ లో 3 సిక్సర్లు, 2 బౌండ్రీలతో 28, రాహుల్ 20 బాల్స్ లో 2 సిక్సర్లు, ఓ బౌండ్రీతో 28 పరుగుల స్కోర్లకు అవుటయ్యారు.

ఈ ఇద్దరూ టీ-20 ఫార్మాట్లో మొదటి వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయటం ఇది 14వసారి. ఇందులో నాలుగుసార్లు సెంచరీ భాగస్వామ్యాలు, 9సార్లు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలు ఉన్నాయి. టీ-20 క్రికెట్లో రాహుల్- రోహిత్ ల భాగస్వామ్యాలు ప్రపంచ రికార్డుగా చేరాయి.

రోహిత్ ను అధిగమించిన విరాట్...

దూకుడుమీదున్న భారత టాపార్డర్ కు పాక్ స్పిన్ జోడీ నవాజ్, షదాబ్ ఖాన్ పగ్గాలు వేయగలిగారు. మిడిల్ ఓవర్లలో కీలక వికెట్లు పడగొడుతూ పరుగులజోరుకు అడ్డుకట్ట వేయగలిగారు.

భారతసూపర్ హిట్టర్లు సూర్యకుమార్ యాదవ్ 13, రిషభ్ పంత్ 14, హార్థిక్ పాండ్యా డకౌట్ గా వెనుదిరగడంతో..భారత బ్యాటింగ్ భారమంతా మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీపైనే పడింది.

ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వరకూ కొహ్లీ పోరాడి ఆడి తన కెరియర్ లో 32వ టీ-20 అర్థశతకాన్ని సాధించడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పగలిగాడు. రోహిత్ శర్మ పేరుతో ఉన్న 31 హాఫ్ సెంచరీల రికార్డును అధిగమించడం ద్వారా అగ్రస్థానంలో నిలిచాడు.

కొహ్లీ మొత్తం 44 బాల్స్ ఎదుర్కొని ఒకే ఒక్క సిక్సర్ ,4 బౌండ్రీలతో 60 పరుగుల స్కోరుకు రనౌటయ్యాడు. పాకిస్థాన్ ప్రత్యర్థిగా కొహ్లీకి ఇది 4వ హాఫ్ సెంచరీకావడం విశేషం.

పాక్ త గ్రూప్ ప్రారంభ మ్యాచ్ లో 35 పరుగులు స్కోరు సాధించిన విరాట్...ఆ తర్వాత హాంకాంగ్ తో ముగిసిన పోరులో అజేయ హాఫ్ సెంచరీ సాధించాడు. గత రెండుమ్యాచ్ ల్లోనూ విరాట్ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు చేయడం విశేషం.

లోయర్ ఆర్డర్ ఆటగాడు రవి బిష్నోయ్ ఇన్నింగ్స్ ఆఖరి రెండుబాల్స్ లో రెండు బౌండ్రీలు సాధించడంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగుల స్కోరు చేయగలిగింది.

పాక్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ షదాబ్ ఖాన్ 2 వికెట్లు, నసీమ్, హస్నెయిన్, రవూఫ్, నవాజ్ తలో వికెట్ పడగొట్టారు.

రిజ్వాన్- నవాజ్ షో...

182 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన పాక్ జట్టు ప్రారంభఓవర్లలోనే కెప్టెన్, స్టార్ బ్యాటర్ బాబర్ అజమ్ వికెట్ నష్టపోయింది. లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్ బౌలింగ్ లో 14 పరుగుల స్కోరుకు రోహిత్ పట్టిన క్యాచ్ కు బాబర్ వెనుదిరిగాడు.

వన్ డౌన్ ఫకర్ జమాన్ సైతం 15 పరుగులకే చిక్కాడు. అయితే ..డాషింగ్ ఓపెనర్ రిజ్వాన్- స్పిన్ ఆల్ రౌండర్ నవాజ్ జోడీ మూడో వికెట్ కు కీలక భాగస్వామ్యంతో..

విజయానికి మార్గం సుగమం చేశారు.

నవాజ్ కేవలం 20 బాల్స్ లోనే 6 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 42 పరుగులకు భువీ బౌలింగ్ లో అవుటయ్యాడు. మరోవైపు రిజ్వాన్ 51 బాల్స్ లో 6 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 71 పరుగులు సాధించాడు.

మిడిలార్డర్ ఆటగాళ్లు ఆసీఫ్ అలీ, కుష్ దిల్ కీలక పరుగులు సాధించడంతో మరో బంతి మిగిలి ఉండగానే పాక్ జట్టు 5 వికెట్లు మాత్రమే నష్టపోయి 5 వికెట్ల విజయం సొంతం చేసుకోగలిగింది.

భారత స్టార్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చహాల్, హార్థిక్ పాండ్యా స్థాయికి తగ్గట్టుగా బౌలింగ్ చేయలేక భారీగా పరుగులు సమర్పించుకోడం భారత్ ఓటమికి కారణమయ్యింది.

పాకిస్థాన్ కు తన ఆల్ రౌండ్ షోతో కీలక విజయం అందించిన స్పిన్ ఆల్ రౌండర్ నవాజ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 6న జరిగే సూపర్-4 రెండోరౌండ్ పోరులో మాజీ చాంపియన్ శ్రీలంకతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

First Published:  5 Sep 2022 4:03 AM GMT
Next Story