Telugu Global
Sports

టెస్టు క్రికెట్లో ప్రపంచ రికార్డుల మోత!

146 సంవత్సరాల సాంప్రదాయ టెస్టు క్రికెట్లో రికార్డుల మోత మోగుతోంది. భారత దిగ్గజాలు రోహిత్, విరాట్ తో పాటు..పాక్ యువబ్యాటర్ సయ్యద్ షకీల్ సైతం సరికొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పగలిగాడు.

టెస్టు క్రికెట్లో ప్రపంచ రికార్డుల మోత!
X

146 సంవత్సరాల సాంప్రదాయ టెస్టు క్రికెట్లో రికార్డుల మోత మోగుతోంది. భారత దిగ్గజాలు రోహిత్, విరాట్ తో పాటు..పాక్ యువబ్యాటర్ సయ్యద్ షకీల్ సైతం సరికొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పగలిగాడు..

సాంప్రదాయ టెస్టు క్రికెట్ సరికొత్త ప్రపంచ రికార్డులతో మార్మోగిపోతోంది. 146 సంవత్సరాల చరిత్ర కలిగిన టెస్టు ఫార్మాట్లో సరికొత్త రికార్డులు వచ్చి చేరాయి. ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా భారత్- వెస్టిండీస్ జట్ల రెండుమ్యాచ్ ల సిరీస్, శ్రీలంక- పాక్ జట్ల సిరీస్ మ్యాచ్ ల్లో ఈ రికార్డులు నమోదయ్యాయి.

ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని క్వీన్స్ పార్క్ స్టేడియం వేదికగా వెస్టిండీస్ తో జరిగిన 100వ టెస్టు మ్యాచ్ లో భారత స్టార్ బ్యాటర్ల జోడీ విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ చెరో రికార్డు నెలకొల్పారు.

500వ మ్యాచ్ లో 'సెంచరీహీరో ' విరాట్!

భారత క్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ తన 500వ అంతర్జాతీయమ్యాచ్ లో సెంచరీ సాధించిన తొలి, ఏకైక క్రికెటర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ క్వీన్స్ పార్క్ మైదానంలో విరాట్ 121 పరుగులు సాధించడం ద్వారా ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు.

గతంలో పలువురు బ్యాటర్లు 500 అంతర్జాతీయమ్యాచ్ లు ఆడినా ఈ రికార్డు సాధించలేకపోయారు.

వరుసగా 30 డబుల్ డిజిట్ స్కోర్ల ప్రపంచ రికార్డు...

వెస్టిండీస్ తో రెండోటెస్టు మ్యాచ్ లో భారత కెప్టెన్ కమ్ ఓపెనర్ రోహిత్ శర్మ..రెండుకు రెండు ఇన్నింగ్స్ లోనూ హాఫ్ సెంచరీలు సాధించడం ద్వారా..టెస్టు క్రికెట్ చరిత్రలోనే వరుసగా 30సార్లు రెండంకెల స్కోర్లు సాధించిన ఏకైక, తొలిబ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు.

శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్థనే పేరుతో ఉన్న 29 డబుల్ డిజిట్ స్కోర్ల రికార్డును తెరమరుగు చేశాడు. టెస్టుమ్యాచ్ ల్లో రోహిత్ శర్మ ఆడిన గత 30 ఇన్నింగ్స్ లో ( 12, 161, 26, 66, 25*, 49, 34, 30, 36, 12*, 83, 21, 19, 59, 11, 127, 29, 15, 46, 120, 32, 31, 12, 12, 35, 15, 43, 103, 80 , 57 ) స్కోర్లు సాధించాడు. కనీసం ఒక్కసారి కూడా డకౌట్ కాకపోడం, సింగిల్ డిజిట్ స్కోరుకే అవుటవ్వడం లేకుండా ఈ అరుదైన రికార్డును నెలకొల్పాడు.

పాక్ కుర్రాడి ప్రపంచ రికార్డు...

శ్రీలంక వేదికగా ..శ్రీలంక ప్రత్యర్థిగా జరుగుతున్న 2023 టెస్టు సిరీస్ లో నిలకడగా రాణిస్తున్న పాకిస్థాన్ యువబ్యాటర్ సయ్యద్ షకీల్ తన అరంగేట్రం టెస్టు నుంచి ఆడిన ఏడు వరుస టెస్టుల్లో అర్థశతకాలు సాధించడం ద్వారా ఓ అరుదైన ప్రపంచ రికార్డు సాధించాడు.

గత 146 సంవత్సరాలుగా సాగుతున్న టెస్టు క్రికెట్లో వరుసగా ఏడుటెస్టుల్లో హాఫ్ సెంచరీలు సాధించిన ఏకైక, తొలి బ్యాటర్ 27సంవత్సరాల షకీల్ మాత్రమే.

శ్రీలంకతో రెండోటెస్టు తొలి ఇన్నింగ్స్ లో షకీల్ 110బంతులు ఎదుర్కొని 57 పరుగులు సాధించడం ద్వారా ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు.

2022 సీజన్లో ఇంగ్లండ్ ప్రత్యర్థిగా టెస్టు అరంగేట్రంచేసిన షకీల్ ఇప్పటి వరకూ వరుసగా ఆడిన ఏడుకు ఏడుటెస్టుల్లోనూ హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. షకీల్ ఆడిన గత 7 టెస్టులు, 13 ఇన్నింగ్స్ లో 875 పరుగులు సాధించాడు.

తన అరంగేట్రం టెస్టు లో 76, రెండోటెస్టులో 63, 94, మూడోటెస్టులో 53, 55నాటౌట్, 4వటెస్టులో 55,5వ టెస్టులో 125 నాటౌట్, 6వ టెస్టులో 208 నాటౌట్, 7వ టెస్టులో 57 పరుగుల స్కోర్లతో సంచలనం సృష్టించాడు. రెండు సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలతో 87.50 సగటుతో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ఆసియా ఉపఖండ దేశాల పిచ్ లపైన ఏడు వరుస హాఫ్ సెంచరీలు సాధించిన షకీల్ త్వరలో జరిగే ఆస్ట్ర్లేలియా పర్యటనలో సత్తా చాటుకోవాల్సి ఉంది.

First Published:  27 July 2023 10:30 AM GMT
Next Story