Telugu Global
Sports

ప్రారంభవేడుకలు లేకుండానే వన్డే ప్రపంచకప్!

భారత్ వేదికగా అక్టోబర్ 5నుంచి జరుగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ ను ప్రారంభవేడుకలు లేకుండా మొదలు పెట్టాలని నిర్వాహక సంఘం నిర్ణయించింది.

ప్రారంభవేడుకలు లేకుండానే వన్డే ప్రపంచకప్!
X

భారత్ వేదికగా అక్టోబర్ 5నుంచి జరుగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ ను ప్రారంభవేడుకలు లేకుండా మొదలు పెట్టాలని నిర్వాహక సంఘం నిర్ణయించింది.

భారతగడ్డపై అక్టోబర్ 5 నుంచి 46 రోజులపాటు అట్టహాసంగా జరుగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ సంరంభాన్ని ప్రారంభవేడుకలు లేకుండానే నిర్వహించనున్నారు.

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గురువారం ఇంగ్లండ్- న్యూజిలాండ్ జట్ల ప్రారంభమ్యాచ్ తో 48 రౌండ్ల ప్రపంచకప్ కు తెరలేవనుంది. అయితే..ముందుగా నిర్ణయించిన ప్రకారం ప్రారంభవేడుకలు మాత్రం ఉండబోవని నిర్వాహక భారత క్రికెట్ నియంత్రణమండలి ప్రకటించింది. నవంబర్ 19 న ముగింపు వేడుకలు మాత్రం నిర్వహిస్తామని తెలిపింది.

ఇదే మొదటిసారి......

ఐసీసీ ఆధ్వర్యంలో జరిగే ప్రపంచకప్ పోటీలను కోట్లరూపాయల వ్యయంతో అట్టహాసంగా ప్రారంభవేడుకలతో ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. వాస్తవానికి ప్రస్తుత ప్రపంచకప్ పోటీలకు ఒకరోజు ముందుగా అహ్మదాబాద్ స్టేడియంలో ప్రారంభవేడుకలు నిర్వహించాలని భావించారు.

బాలీవుడ్ సెలెబ్రిటీలు రనవీర్ సింగ్, అర్జిత్ సింగ్, తమన్నా భాటియా, శ్రీయ గోశాల్, ఆశా భోంస్లేలతో ఆటపాట కార్యక్రమాలు, భారీఎత్తున బాణసంచా, లేజర్ హంగులతో ప్రారంభవేడుకలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేశారు.

అయితే..ప్రారంభవేడుకలు లేకుండానే ప్రపంచకప్ ను ప్రారంభించాలని నిర్వాహక సంఘం ఆకస్మికంగా నిర్ణయం తీసుకొంది. టోర్నీలో పాల్గొంటున్న మొత్తం 10 జట్ల కెప్టెన్లు పాల్గొనే 'కెప్టెన్స్ డే' వేడుకను మాత్రం యధావిధిగా నిర్వహిస్తారు.

నవంబర్ 19న ముగింపు వేడుకలు...

10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ దశ నుంచి ఫైనల్ నాకౌట్ రౌండ్ వరకూ జరిగే మొత్తం 48 మ్యాచ్ ల ఈ టోర్నీ నవంబర్ 19న అహ్మదాబాద్ స్టేడియంలోనే ముగియనుంది.

అదేరోజున ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఆతిథ్య భారతజట్టు తన ప్రారంభమ్యాచ్ ను చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా అక్టోబర్ 8న ఆస్ట్ర్రేలియాతో ఆడనుంది.

టో్ర్నీ ప్రారంభమ్యాచ్ మాత్రం అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 5న నిర్వహిస్తారు. రెండుసార్లు విజేత వెస్టిండీస్, జింబాబ్వే లాంటి జట్లు ప్రపంచకప్ కు అర్హత సాధించలేకపోయాయి. ఆ స్థానాలలో ఆఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్ ఆడుతున్నాయి.

గతంలో ఎన్నడూలేని విధంగా మొత్తం89 కోట్ల రూపాయల వరకూ ప్రైజ్ మనీగా ఇస్తున్నారు. 1983, 2011 టోర్నీలలో విజేతగా నిలిచిన ఆతిథ్య భారత్ మూడోసారి ప్రపంచకప్ గెలుచుకోవాలన్న పట్టుదలతో బరిలోకి దిగుతోంది.

First Published:  4 Oct 2023 5:15 AM GMT
Next Story