Telugu Global
Sports

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలో ఒకే ఒక్కడు!

సెర్బియన్ థండర్ నొవాక్ జోకోవిచ్ 36 ఏళ్ల వయసులో 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గి తనకు తానే సాటిగా నిలిచాడు. 2023 యూఎస్ ఓపెన్ టైటిల్ ను జోకోవిచ్ నాలుగోసారి గెలుచుకొన్నాడు.

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలో ఒకే ఒక్కడు!
X

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలో ఒకే ఒక్కడు!

సెర్బియన్ థండర్ నొవాక్ జోకోవిచ్ 36 ఏళ్ల వయసులో 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గి తనకు తానే సాటిగా నిలిచాడు. 2023 యూఎస్ ఓపెన్ టైటిల్ ను జోకోవిచ్ నాలుగోసారి గెలుచుకొన్నాడు.

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ లో సెర్బియన్ స్టార్ నొవాక్ జోకోవిచ్ తిరుగులేని చాంపియన్ గా అవతరించాడు. 2023 యూఎస్ ఓపెన్ టైటిల్ గెలుచుకోడం ద్వారా తన గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సంఖ్యను 24కు పెంచుకోగలిగాడు.

న్యూయార్క్ లోని ఆర్థర్ యాష్ స్టేడియం వేదికగా జరిగిన టైటిల్ సమరంలో జోకోవిచ్ 6-3, 7-6, 6-3తో 3వ సీడ్ డేనిల్ మెద్వదేవ్ ను చిత్తు చేయడం ద్వారా నాలుగోసారి యూఎస్ ట్రోఫీని అందుకొన్నాడు.

3 గంటల 16 నిముషాల పోరులో విజేత....

ప్రస్తుత సీజన్ ఆఖరి గ్రాండ్ స్లామ్ టోర్నీగా జరిగిన యూఎస్ ఓపెన్ బరిలో రెండోసీడ్ గా టైటిల్ వేటకు దిగిన జోకోవిచ్ తనదైన శైలిలో వరుస విజయాలు సాధిస్తూ టైటిల్ సమరానికి అర్హత సంపాదించాడు.

మాజీ చాంపియన్, 3వ సీడ్ డేనిల్ మెద్వదేవ్ తో జరిగిన టైటిల్ సమరంలో వెటరన్ జోకోవిచ్ కు తగిన పోటీనే లేకుండా పోయింది. తొలిసెట్ 6-3తో అలవోకగా నెగ్గిన జోకోవిచ్..రెండోసెట్ ను టైబ్రేక్ లో సొంతం చేసుకోగలిగాడు. మూడోసెట్ ను సైతం 6-3తో నెగ్గడం ద్వారా తన కెరియర్ లో నాలుగోసారి యూఎస్ ఓపెన్ విజేతగా నిలువగలిగాడు.

సెమీఫైనల్లో టాప్ సీడ్ కార్లోస్ అల్ కరాజ్ పై సంచలన విజయం సాధించడం ద్వారా ఫైనల్స్ చేరిన మెద్వదేవ్ టైటిల్ పోరులో మాత్రం అదేజోరు కొనసాగించలేకపోయాడు.

మార్గారెట్ కోర్ట్ సరసన జోకోవిచ్...

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలో అత్యధికంగా 24 టైటిల్స్ నెగ్గిన మార్గారెట్ కోర్ట్ రికార్డును జోకోవిచ్ ప్రస్తుత యూఎస్ ఓపెన్ విజయంతో సమం చేయగలిగాడు. పురుషుల విభాగంలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన మొనగాడు జోకోవిచ్ మాత్రమే.

ప్రస్తుత 2023 సీజన్లోని మొత్తం నాలుగు టైటిల్స్ లో మూడింటిని జోకోనే సొంతం చేసుకోగలిగాడు. ఆస్ట్ర్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ లను జోకోవిచ్ నెగ్గగా..వింబుల్డన్ ట్రోఫీని మాత్రం కార్లోస్ అల్ కరాజ్ సాధించాడు.

అసలుసిసలు చాంపియన్ జోకోవిచ్...

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లోని నాలుగు ( వింబుల్డన్, ఫ్రెంచ్, ఆస్ట్ర్రేలియన్, అమెరికన్ ఓపెన్ ) రకాల టోర్నీలలోనూ నిలకడగా రాణిస్తూ...కెరియర్ ట్రిపుల్ ను సాధించడం ద్వారా జోకోవిచ్ సంచలనం సృష్టించాడు.

పచ్చిక కోర్టుల్లో జరిగే వింబుల్డన్, ఎర్రమట్టి కోర్టులో జరిగే ఫ్రెంచ్ ఓపెన్, నేర్పు, ఓర్పులకు పరీక్షగా నిలిచే యూఎస్ ఓపెన్, విపరీతమైన బౌన్స్ తో కూడిన ఆస్ట్రేలియన్ ఓపెన్ సింథటిక్ కోర్టుల్లో జరిగే గ్రాండ్ స్లామ్ పోరులో ఒక్కసారి విజేతగా నిలిచినా గొప్పఘనతగానే భావిస్తారు. అంతేకాదు...నాలుగు రకాల ట్రోఫీలను ఒకే ఏడాదిలో సాధిస్తే గ్రాండ్ స్లామ్ గానూ, కెరియర్ లో సాధిస్తే కెరియర్ గ్రాండ్ స్లామ్ గానూ పరిగణిస్తారు.

టెన్నిస్ చరిత్రను ఓసారి తిరగేస్తే పురుషుల విభాగంలో ‘కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌’ (నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన) ఘనతను రెండుసార్లు చొప్పున సాధించిన ఆటగాళ్ళలో ఆస్ట్ర్రేలియా దిగ్గజాలు రాయ్‌ ఎమర్సన్‌( 1967 ), రాడ్‌ లేవర్‌ (1969) మాత్రమే ఉన్నారు.

ఇప్పటి వరకూ నడాల్ 22, రోజర్ ఫెదరర్ 21 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ మాత్రమే సాధించగా..ఈ ఇద్దరు మొనగాళ్లను జోకోవిచ్ అధిగమించడం ద్వారా 24 టైటిల్స్ నెగ్గిన తొలి ప్లేయర్ గా తనకుతానే సాటిగా నిలిచాడు. కెరియర్ గ్రాండ్ స్లామ్ ను మూడోసారి సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

ఓపెన్‌ శకంలో...అదీ 1968 తర్వాత నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ను కనీసం రెండుసార్లు చొప్పున గెలిచిన తొలి ఆటగాడిగా జోకోవిచ్ చరిత్ర సృష్టించాడు. తన ప్రధాన ప్రత్యర్థులు రోజర్ ఫెదరర్, రాఫెల్ నడాల్ సాధించలేని ఘనతను జోకో సొంతం చేసుకోగలిగాడు.

జోకో రికార్డుల మోత...

తన కెరియర్ లో 10సార్లు ఆస్ట్ర్రేలియన్, 4 యూఎస్ ఓపెన్, 7 వింబుల్డన్, 3 ఫ్రెంచ్ ఓపెన్ లతో కలుపుకొని జోకోవిచ్ మొత్తం 24గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకొన్నాడు.

36 సంవత్సరాల వయసుకే 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో సహా మొత్తం 91 టోర్నీలు నెగ్గడంతో పాటు 1000 కోట్ల రూపాయలకు పైగా ప్రైజ్ మనీ గెలుచుకోడం కేవలం జోకోవిచ్ కు మాత్రమే చెల్లింది. అంతేకాదు...327 వారాలపాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ లో నిలవడం ద్వారా మరోప్రపంచ రికార్డు సాధించాడు.

ఇది జోకోవిచ్ దశాబ్దం...

గత దశాబ్దకాలంగా ప్రపంచ పురుషుల టెన్నిస్ లో జోకోవిచ్ ఆధిపత్యమే కొనసాగుతోంది.2011 నుంచి 2023 మధ్యకాలంలో జోకోవిచ్ 21 గ్రాండ్ స్లామ్, 31 మాస్టర్స్, 4 ఏటీపీ టైటిల్స్ నెగ్గడం ద్వారా నడాల్, ఫెదరర్ లాంటి ప్రత్యర్థులపై పైచేయి సాధించాడు. 2023 గ్రాండ్ స్లామ్ సీజన్ లో నాలుగింట మూడు టోర్నీలలో విజేతగా నిలిచిన జోకోవిచ్ వచ్చే సీజన్ లోనూ అదేజోరు కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

ఇప్పటికే 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గడం ద్వారా పురుషుల టెన్నిస్ లో తిరుగులేని చాంపియన్ గా అవతరించాడు.

First Published:  11 Sep 2023 6:30 AM GMT
Next Story