Telugu Global
Sports

జోకోవిచ్ ఖాతాలో 90వ టైటిల్

ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ఆటగాడు నొవాక్ జోకోవిచ్ ప్రస్తుత సీజన్లో నాలుగో టూర్ టైటిల్ నెగ్గడం ద్వారా ఆల్ టైమ్ గ్రేట్ రోజర్ ఫెదరర్ సరసన నిలిచాడు.

జోకోవిచ్ ఖాతాలో 90వ టైటిల్
X

ప్రపంచ పురుషుల టెన్నిస్ లో సెర్బియన్ స్టార్ నొవాక్ జోకోవిచ్ జోరు కొనసాగుతోంది. 2022 సీజన్లో నాలుగో టైటిల్ నెగ్గడం ద్వారా గతంలో రోజర్ ఫెదరర్ నెలకొల్పిన రికార్డును జోకోవిచ్ సమం చేయగలిగాడు.

ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ఆటగాడు నొవాక్ జోకోవిచ్ ప్రస్తుత సీజన్లో నాలుగో టూర్ టైటిల్ నెగ్గడం ద్వారా ఆల్ టైమ్ గ్రేట్ రోజర్ ఫెదరర్ సరసన నిలిచాడు.

గతవారం జరిగిన టెల్ అవీవ్ ఓపెన్ విజేతగా ట్రోఫీ అందుకొన్న జోకోవిచ్...ఈ వారం జరిగిన ఆస్తానా ఓపెన్ లో సైతం తిరుగులేని విజయంతో బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీ సాధించాడు.

ఆస్తానా ఫైనల్లో స్టెఫానోస్ సిటిస్ పాస్ ను జోకోవిచ్ 6-3, 6-4తో చిత్తు చేయడం ద్వారా తన కెరియర్ లో 90వ టైటిల్ సాధించాడు. 2022 సీజన్లో జోకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ తో పాటు మరో మూడు ఏటీపీ టూర్ టైటిల్స్ సాధించడం ద్వారా గతంలో రోజర్ ఫెదరర్ నెలకొల్పిన రికార్డును సమం చేయగలిగాడు.

జోకోవిచ్ బరిలో నిలిచిన గత 9 టోర్నీలలో కేవలం ఒక్కసెట్ ను మాత్రమే కోల్పోడం విశేషం.

ఫెదరర్, నడాల్ ల సరసన జోకోవిచ్...

ఏటీపీ టూర్ చరిత్రలో 90 టైటిల్స్ సాధించిన మొనగాళ్ల జాబితాలో సైతం జోకోవిచ్ చోటు సంపాదించగలిగాడు. అమెరికన్ ఆల్ టైమ్ గ్రేట్ జిమ్మీ కానర్స్ 109 టూర్ టైటిల్స్ తో ప్రపంచ రికార్డు నెలకొల్పగా...ఆ తర్వాతి స్థానాలలో రోజర్ ఫెదరర్ ( 103 టైటిల్స్ ), ఇవాన్ లెండిర్ ( 94 ), రాఫెల్ నడాల్ ( 92 ) నిలిచారు. జోకోవిచ్ 90 టైటిల్స్ తో ఐదోస్థానంలో కొనసాగుతున్నాడు.

గ్రాండ్ స్లామ్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ సాధించిన ముగ్గురిలో జోకోవిచ్ సైతం ఉన్నాడు.

First Published:  11 Oct 2022 8:07 AM GMT
Next Story