Telugu Global
Sports

25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కలచెదిరిన జోకోవిచ్

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో ఓ అరుదైన రికార్డు నెలకొల్పాలన్న దిగ్గజఆటగాడు జోకోవిచ్ కల చెదిరింది. యూఎస్ ఓపెన్ మూడోరౌండ్లోనే పోటీ ముగిసింది.

25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కలచెదిరిన జోకోవిచ్
X

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో ఓ అరుదైన రికార్డు నెలకొల్పాలన్న దిగ్గజఆటగాడు జోకోవిచ్ కల చెదిరింది. యూఎస్ ఓపెన్ మూడోరౌండ్లోనే పోటీ ముగిసింది.

న్యూయార్క్ వేదికగా జరుగుతున్న 2024 యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టో్ర్నీలో సంచలనాల పర్వం కొనసాగుతూనే ఉంది. టైటిల్ ఫేవరెట్ ఆటగాళ్లు ఒక్కొక్కరే పరాజయాలతో ఇంటిదారి పడుతున్నారు. ఆ జాబితాలో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జోకోవిచ్ సైతం చేరిపోయాడు.

మూడోరౌండ్లోనే జోకోవిచ్ బోల్తా...

రెండోరౌండ్లోనే మాజీ చాంపియన్ , 3వ సీడ్ కార్లోస్ అల్ కరాజ్ అనూహ్యంగా ఓడితే...2వ సీడ్ జోకోవిచ్ పోరు మూడోరౌండ్లో ముగిసింది. గత నెలలో పారిస్ వేదికగా ముగిసిన 2024 ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ లో బంగారు పతకం సాధించడం ద్వారా గోల్డెన్ స్లామ్ ( నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో పాటు ఒలింపిక్స్ స్వర్ణం ) కలను నెరవేర్చుకొన్న జోకోవిచ్..25 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ రికార్డును సైతం పూర్తి చేయాలని భావించాడు.

అయితే..37 సంవత్సరాల వెటరన్ జోకోవిచ్ ఆశల్ని ఆస్ట్ర్రేలియాకు చెందిన 28వ ర్యాంక్ ఆటగాడు అలెక్సీ పోపిరిన్ అడియాసలు చేశాడు. నాలుగుసెట్ల పోరులో జోకోవిచ్ ను ఇంటిదారి పట్టించాడు.

గత 18 ఏళ్లలో ఇదే మొదటిసారి....

గత రెండుదశాబ్దాల కాలంలో నాలుగుసార్లు యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన జోకోవిచ్..మూడోరౌండ్లోనే పరాజయం పొందటం గత 18 సంవత్సరాలలో ఇదే తొలిసారి. తనకంటే 26 ర్యాంకులు దిగువన ఉన్న అలెక్సీ దెబ్బకు కుదేలైపోయాడు. 4-6, 4-6, 6-2, 4-6తో జోకోవిచ్ ఓటమి పాలయ్యాడు. మొదటి రెండుసెట్లను 4-6 స్కోర్లతో చేజార్చుకొన్న జోకోవిచ్ కీలక మూడోసెట్ ను 6-2తో నెగ్గినా..నిర్ణయాత్మక ఆఖరిసెట్లో తేలిపోయాడు. 4-6 ఓటమితో టోర్నీ నుంచి నిష్క్ర్రమించాడు.

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ పురుషుల విభాగంలో అత్యధికంగా 24 టైటిల్స్ తో అగ్రస్థానంలో నిలిచిన జోకోవిచ్.. మహిళల విభాగంలో మార్గారెట్ కోర్ట్ సాధించిన 25 టైటిల్స్ రికార్డును సమం చేయాలని ఉవ్విళూరాడు. అయితే యూఎస్ ఓపెన్ మూడోరౌండ్ ఓటమితో లక్ష్యానికి దూరం కాక తప్పలేదు.

తన కల నెరవేర్చుకోవాలంటే జోకోవిచ్ 2025 గ్రాండ్ స్లామ్ సీజన్ వరకూ వేచిచూడక తప్పదు.

తన సుదీర్ఘ కెరియర్ లో ఇప్పటికే రెండుసార్లు కెరియర్ గ్రాండ్ స్లామ్, అత్యధికవారాలపాటు నంబర్ వన్ ర్యాంక్, అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన మొనగాడి రికార్డులు సాధించిన జోకోవిచ్..38 సంవత్సరాల వయసులో అరుదైన రికార్డు కోసం పోటీపడాల్సి ఉంది. అయితే..తనకంటే చిన్నవయసులో ఉన్న నేటితరం ఆటగాళ్లతో పోటీపడటం, పరాజయాలు పొందడం జోకోవిచ్ కు గత రెండు సంవత్సరాలుగా ఓ బలహీనతగా మారిపోయింది.

జోకోవిచ్ ఇలా- అల్ కరాజ్ అలా...

భారీఅంచనాల నడుమ ప్రారంభమైన ప్రస్తుత సీజన్ ఆఖరి గ్రాండ్ స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ ప్రారంభరౌండ్లలోనే ఇద్దరు సీడెడ్ స్టార్లు ఇంటిదారి పట్టడం టైటిల్ పోరును మరింత రసవత్తరంగా మార్చింది.

మాజీ చాంపియన్ 3వ ర్యాంక్ ఆటగాడు కార్లోస్ అల్ కరాజ్ ను 74వ ర్యాంక్ డచ్ ఆటగాడు బోటిచ్ కంగు తినిపిస్తే..2వ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ జోకోవిచ్ పై 28వ ర్యాంక్ ఆస్ట్ర్రేలియా ఆటగాడు అలెక్సీ విజేతగా నిలవడం విశేషం.

స్పానిష్ సంచలనం, 22 సంవత్సరాల కార్లోస్ అల్ కరాజ్..ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీ రెండోరౌండ్లోనే పరాజయం పొందటం ఇదే మొదటిసారి. మూడేళ్ల క్రితం తొలిసారిగా యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గడంతో పాటు..వింబుల్డన్ టోర్నీలోనూ విజేతగా నిలిచిన అల్ కరాజ్..ఓపెన్ ఎరాలో మూడోరౌండ్ కు ముందే టోర్నీ నుంచి నిష్క్ర్రమించిన 3వ ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు.

2021 వింబుల్డన్ రెండోరౌండ్లోనే కంగు తిన్నతరువాత మరో గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఓటమి పొందడం అల్ కరాజ్ కు ఇదే మొదటిసారి. తొలిరౌండ్లో ఆస్ట్ర్రేలియాకు చెందిన లీ టు ను అధిగమించడానికి నాలుగుసెట్లపాటు పోరాడాల్సి వచ్చిన అల్ కరాజ్..రెండోరౌండ్లో తేలిపోయాడు.ప్రస్తుత ఓటమికి ముందు వరకూ డోకిచ్ ప్రత్యర్థిగా అల్ కరాజ్ కు 2-0 విజయాల రికార్డు ఉంది.

మూడోరౌండ్లో యానిక్ సిన్నర్...

టాప్ సీడ్ ఆటగాడు, టైటిల్ ఫేవరెట్ యానిక్ సిన్నర్ అలవోకగా 3వ రౌండ్ చేరాడు. ఇటలీకి చెందిన ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ఆటగాడు యానిక్ సిన్నర్ తన రెండోరౌండ్ పోరులో అలవోక విజయం సాధించాడు. అమెరికాకు చెందిన 49వ ర్యాంక్ ప్లేయర్ అలెక్స్ మిచెల్ సన్ ను వరుస సెట్లలో చిత్తు చేశాడు.

గంటా 39 నిముషాలపాటు సాగిన పోరులో సిన్నర్ 6-4, 6-0, 6-2తో విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో సిన్నర్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకోగలిగాడు.

2024 సీజన్ టూర్ పురుషుల విభాగంలో 50 విజయాలు నమోదు చేసిన తొలి ఆటగాడిగా సిన్నర్ నిలిచాడు.

నాలుగోరౌండ్లో చోటు కోసం జరిగే పోరులో 87వ ర్యాంకర్, ఆస్ట్ర్రేలియాకు చెందిన క్రిస్టోఫర్ ఓ కోనెల్ తో సిన్నర్ తలపడాల్సి ఉంది.

First Published:  31 Aug 2024 5:10 AM GMT
Next Story