Telugu Global
Sports

వింబుల్డన్ లో జోకోవిచ్ ' గ్రాండ్ విన్' రికార్డు!

గ్రాండ్ స్లామ్ కింగ్ నొవాక్ జోకోవిచ్ మరో అరుదైన ఘనత సాధించాడు. 350వ విజయంతో మరో ఇద్దరు ఆల్ టైమ్ గ్రేట్ల సరసన నిలచాడు.

నొవాక్ జోకోవిచ్
X

వింబుల్డన్ లో జోకోవిచ్ ' గ్రాండ్ విన్' రికార్డు!

గ్రాండ్ స్లామ్ కింగ్ నొవాక్ జోకోవిచ్ మరో అరుదైన ఘనత సాధించాడు. 350వ విజయంతో మరో ఇద్దరు ఆల్ టైమ్ గ్రేట్ల సరసన నిలచాడు.

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ సర్క్యూట్ లో సెర్బియన్ థండర్, గ్రాండ్ స్లామ్ టైటిల్స్ కింగ్ నోవాక్ జోకోవిచ్ విజయపరంపర కొనసాగుతోంది. 36 సంవత్సరాల వయసులోనూ తన ఆటలో వాడివేడి ఏమాత్రం తగ్గలేదని జోకోవిచ్ మరోసారి చాటుకొన్నాడు.

తన కెరియర్ లో ఇప్పటికే ప్రపంచ రికార్డుస్థాయిలో 23 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్, ఏడు వింబుల్డన్ ట్రోఫీలు అందుకొన్న జోకోవిచ్..ప్రస్తుత 2023 వింబుల్డన్ టోర్నీలో మాత్రం 2వ సీడ్ గా టైటిల్ వేటకు దిగాడు.

గ్రాస్ కోర్టు టెన్నిస్ లో'బాస్' జోకోవిచ్...

వింబుల్డన్ గ్రాస్ కోర్టు టెన్నిస్ లో రోజర్ ఫెదరర్ తర్వాత అత్య్తుత్తమ ఆటగాడిగా ఓ వెలుగు వెలుగుతున్న నొవాక్ జోకోవిచ్ ప్రస్తుత సీజన్ పురుషుల సింగిల్స్ మూడోరౌండ్ కు చేరుకోడం ద్వారా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు.

రెండోరౌండ్ మ్యాచ్ లో ఆస్ట్ర్రేలియా ఆటగాడు జోర్డాన్ థాంప్సన్ ను చిత్తు చేయడం ద్వారా మూడోరౌండ్లో అడుగుపెట్టాడు. గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలలో జోకోవిచ్ కు ఇది 350వ సింగిల్స్ విజయం కాగా...2014 నుంచి వింబుల్డన్ సెంటర్ కోర్టులో వరుసగా 41వ గెలుపు కావడం మరో రికార్డు.

ఫెదరర్ , సెరెనాల సరసన...

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో 350వ విజయం సాధించడం ద్వారా ఆల్ టైమ్ గ్రేట్లు రోజర్ ఫెదరర్, సెరెనా విలియమ్స్ తర్వాతి స్థానంలో జోకోవిచ్ నిలిచాడు. రోజర్ ఫెదరర్ 369 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ విజయాలతో టాపర్ గా ఉంటే...సెరెనా విలియమ్స్ 367 విజయాలతో రెండోస్థానంలో నిలిచింది. జోకోవిచ్ 350 విజయాలతో మూడోస్థానం సాధించాడు.

తన కెరియర్ లో ఇప్పటికే ఏడుసార్లు వింబుల్డన్ విజేతగా నిలిచిన జోకోవిచ్ మరో టైటిల్ నెగ్గితే రోజర్ ఫెదరర్ 8 వింబుల్డన్ టైటిల్స్ రికార్డును సమం చేయగలుగుతాడు. వింబుల్డన్ చరిత్రలో అత్యధికంగా 9 టైటిల్స్ తో మార్టీనా నవ్రతిలోవా అత్యధిక టైటిల్స్ నెగ్గిన ప్లేయర్ గా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

రోజర్ ఫెదరర్ 20, సెరెనా విలియమ్స్ 23, మార్గారెట్ కోర్ట్ 24 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గగా..జోకోవిచ్ 23 టైటిల్స్ తో పురుషుల విభాగంలో నంబర్ వన్ గా నిలిచాడు.

రెండోరౌండ్లోనే రూడ్ కు షాక్...

వింబుల్డన్ నాలుగోరోజు పోటీలలో భాగంగా జరిగిన పురుషుల సింగిల్స్ రెండోరౌండ్లోనే ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ కాస్పర్ రూడ్ కు ఎదురుదెబ్బ తగిలింది.

బ్రిటీష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ లైమ్ బ్రాడీ ఐదుసెట్ల పోరులో 4వ సీడ్ రూడ్ పై సంచలన విజయం సాధించాడు. రూడ్ 4-6, 6-3, 6-4, 3-6, 0-6తో అనూహ్య పరాజయం చవిచూశాడు.

మహిళల సింగిల్స్ తొలిరౌండ్ పోరులోనే చెక్ రిపబ్లిక్ కు చెందిన 16వ సీడ్ కారోలినా ముచోవాకు పరాజయం ఎదురయ్యింది. జర్మన్ ప్లేయర్ జూలీ నీమియర్ 6406, 7-5, 6-1తో సంచలన విజయం సాధించింది.

మహిళల సింగిల్స్ మూడోరౌండ్ చేరిన ప్లేయర్లలో సోఫియా కెనిన్, మిర్రా ఆంద్రీవా ఉన్నారు.

First Published:  7 July 2023 7:15 AM GMT
Next Story