Telugu Global
Sports

ఎన్ఎండీసీ బ్రాండ్ అంబాసిడర్‌గా నిఖత్ జరీన్

ఎన్ఎండీసీ 2.0కు నిఖత్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండనుందని.. ఆమె ద్వారా సంస్థకు మరింత గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నామని ఎన్ఎండీసీ సీఎండీ సుమిత్ దేబ్ అన్నారు.

ఎన్ఎండీసీ బ్రాండ్ అంబాసిడర్‌గా నిఖత్ జరీన్
X

నిజామాబాద్‌లో పుట్టి హైదరాబాద్‌లో పెరిగి.. అంతర్జాతీయ వేదికలపై భారత పతాకాన్ని ఎగుర వేస్తున్న యువ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌తో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) యువ బాక్సర్ నిఖత్‌తో రెండేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. అవసరం అయితే భవిష్యత్‌లో ఈ ఒప్పందం గడువు పొడిగిస్తామని పేర్కొంది. ఈ ఒప్పందంతో రెండేళ్ల పాటు నిఖత్.. ఎన్ఎండీసీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండనున్నది.

నిఖత్ జరీత్‌తో జరిగిన ఒప్పందం విలువను మాత్రం ఎన్ఎండీసీ అధికారులు వెల్లడించలేదు. అయితే, రెండేళ్ల తర్వాత ఒప్పందాన్ని పొడిగించే అవకాశం మాత్రం ఉందని తెలిపింది. ఈ మేరకు నిఖత్, అధికారులు ఎంవోయూ పైన సంతకాలు చేశారు. ఐబీఏ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ 2022లో బంగారు పతకంతో పాటు, బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కూడా గోల్డ్ మెడల్ గెలిచి అందరి దృష్టిని నిఖత్ ఆకర్షించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆమెకు నగదు ప్రోత్సాహకాన్ని అందించింది.

నిఖత్ జరీన్ ప్రస్తుతం 2024 పారీస్ ఒలింపిక్స్ కోసం సిద్ధపడుతున్నది. ఇందుకోసం అయ్యే ఖర్చును ఎన్ఎండీసీ భరించనున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర క్రీడా శాఖతో పాటు ఇప్పుడు ఎన్ఎండీసీ కూడా తోడవటంతో నిఖత్‌ శిక్షణకు ఆర్థిక అండ లభించినట్లైంది.

ఎన్ఎండీసీ తన రెండో అధ్యాయాన్ని ప్రారంభించనున్నది. ఇకపై ఐరన్, స్టీల్ పవర్ హౌస్‌గా మారడానికి ఎన్ఎండీసీ సిద్ధమైందని అధికారులు చెప్పారు. ఎన్ఎండీసీ 2.0కు నిఖత్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండనుందని.. ఆమె ద్వారా సంస్థకు మరింత గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నామని ఎన్ఎండీసీ సీఎండీ సుమిత్ దేబ్ అన్నారు.



First Published:  29 Jan 2023 6:15 AM GMT
Next Story