Telugu Global
Sports

జింబాబ్వే అవుట్... నెదర్లాండ్స్ కు ప్రపంచకప్ ఆఖరి బెర్త్!

భారత్ వేదికగా జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఆఖరి బెర్త్ ను నెదర్లాండ్స్ కైవసం చేసుకొంది. జింబాబ్వే, స్కాట్లాండ్ జట్లకు నిరాశే మిగిలింది.

జింబాబ్వే అవుట్... నెదర్లాండ్స్ కు ప్రపంచకప్ ఆఖరి బెర్త్!
X

జింబాబ్వే అవుట్... నెదర్లాండ్స్ కు ప్రపంచకప్ ఆఖరి బెర్త్!

భారత్ వేదికగా జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఆఖరి బెర్త్ ను నెదర్లాండ్స్ కైవసం చేసుకొంది. జింబాబ్వే, స్కాట్లాండ్ జట్లకు నిరాశే మిగిలింది.

2023 వన్డే ప్రపంచకప్ చివరి రెండు బెర్త్ లను ప్రపంచ మాజీ చాంపియన్ శ్రీలంక, సంచలనాల నెదర్లాండ్స్ జట్లు సొంతం చేసుకొన్నాయి. జింబాబ్వే వేదికగా గత రెండువారాలుగా సాగిన అర్హత పోటీలలోని రెండు బెర్త్ ల కోసం మొత్తం పదిజట్లు తలపడ్డాయి.

హరారే, బులావాయే స్టేడియాలలో జరిగిన ఈ పోటీల గ్రూప్ లీగ్ దశలో మెరుపులు మెరిపించిన ఆతిథ్య జింబాబ్వే..సూపర్ సిక్స్ రౌండ్లో మాత్రం తేలిపోయింది. విజయం అంచుల వరకూ వచ్చి స్కాట్లాండ్ చేతిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్ర్రమించింది.

ప్రపంచ మాజీ చాంపియన్ శ్రీలంక వరుస విజయాలతో ప్రపంచకప్ 9వ బెర్త్ ను ఖాయం చేసుకోగా..ఆఖరి బెర్త్ కోసం స్కాట్లాండ్- నెదర్లాండ్స్ జట్లు తలపడ్డాయి.

నెదర్లాండ్స్ కెప్టెన్ డి లీడ్ షో.....

బులావాయే వేదికగా జరిగిన సూపర్ -6 ఆఖరి రౌండ్ రాబిన్ లీగ్ పోరులో కెప్టెన్ బాస్ డి లీడ్ సూపర్ సెంచరీతో నెదర్లాండ్స్ జట్టును విజేతగా నిలిపాడు. డార్క్ హార్స్ స్కాట్ లాండ్ నుంచి గట్టిపోటీ ఎదుర్కొన్న నెదర్లాండ్స్ 4 వికెట్ల విజయంతో ఐదోసారి వన్డే ప్రపంచకప్ కు అర్హత సంపాదించగలిగింది.

ఈ డూ ఆర్ డై మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన స్కాట్లాండ్‌ 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. బాండ్రన్‌ మెక్‌మలెన్‌ (106) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో కెప్టెన్ బాస్‌ డి లీడ్‌ 5 వికెట్లు పడగొట్టాడు.

ప్రపంచకప్ బెర్త్ ను సొంతం చేసుకోవాలంటే 44 ఓవర్లలోనే విజయలక్ష్యం 278 పరుగుల స్కోరు సాధించాల్సిన నెదర్లాండ్స్ 42.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికే సాధించగలిగింది.

బౌలర్ గా 5 వికెట్లు, బ్యాటర్ గా (92 బంతుల్లో 123; 7 ఫోర్లు, 5 సిక్సర్లు)సెంచరీ సాధించిన నెదర్లాండ్స్ కెప్టెన్ బాస్‌ డి లీడ్‌ కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

ఐదోసారి నెదర్లాండ్స్ కు అర్హత...

ప్రపంచ క్రికెట్ లోని పసికూన జట్లలో పెద్దజట్టుగా పేరున్న నెదర్లాండ్స్ ..వన్డే ప్రపంచకప్ ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించడం ఇది ఐదోసారి.

గతంలో 1996, 2003, 2007, 2011 ప్రపంచకప్ టోర్నీల ఫైనల్ రౌండ్లో తలపడిన రికార్డు నెదర్లాండ్స్ కు ఉంది.

2023 ప్రపంచకప్ క్వాలిఫైయర్స్ సూపర్‌-6 రౌండ్లో 5 మ్యాచ్‌లాడిన నెదర్లాండ్స్‌, స్కాట్లాండ్‌, జింబాబ్వే మూడేసి విజయాలతో తలో 6 పాయింట్లతో సమంగా నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్‌ సాధించిన నెదర్లాండ్స్‌ (0.16) ఆఖరి బెర్త్ ను ఖాయం చేసుకోగలిగింది.

స్కాట్లాండ్‌ (0.10), జింబాబ్వే (-0.09) రన్ రేట్ ప్రాతిపదికన అర్హత సాధించలేకపోయాయి.

10 జట్లతో ప్రపంచకప్ ఫైనల్ రౌండ్...

భారత్ వేదికగా అక్టోబర్ -నవంబర్ మాసాలలో జరుగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ రౌండ్లో మొత్తం 10 దేశాలజట్లు తలపడనున్నాయి. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ఆధారంగా భారత్, ఆస్ట్ర్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్ జట్లు నేరుగా ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించగా..

మిగిలిన రెండు బెర్త్ ల కోసం 10 జట్లు క్వాలిఫైయింగ్ టోర్నీలో తలపడితే శ్రీలంక, నెదర్లాండ్స్ మాత్రమే సఫలం కాగలిగాయి.

1973, 1975 ప్రపంచకప్ టోర్నీల విజేత వెస్టిండీస్ గత 43 సంవత్సరాల కాలంలో ఫైనల్ రౌండ్ కు చేరుకోలేకపోడం ఇదే మొదటిసారి. వెస్టిండీస్ లాంటి దిగ్గజ జట్టు లేకుండా..వన్డే ప్రపంచకప్ చరిత్రలో 2023 టోర్నీ జరుగనుంది.

First Published:  7 July 2023 6:15 AM GMT
Next Story