Telugu Global
Sports

బెయిలు పై బయటకు వచ్చి నేపాల్ బౌలర్ ప్రపంచ రికార్డు!

అత్యాచారం ఆరోపణలపై జైలుపాలైన నేపాల్ జాదూ స్పిన్నర్ సందీప్ లామీచానే సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డేలలో అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన మొనగాడిగా నిలిచాడు.

బెయిలు పై బయటకు వచ్చి నేపాల్ బౌలర్ ప్రపంచ రికార్డు!
X

బెయిలు పై బయటకు వచ్చి నేపాల్ బౌలర్ ప్రపంచ రికార్డు!

అత్యాచారం ఆరోపణలపై జైలుపాలైన నేపాల్ జాదూ స్పిన్నర్ సందీప్ లామీచానే సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డేలలో అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన మొనగాడిగా నిలిచాడు.....

క్రికెట్లో ఫార్మాట్ ఏదైనా..టెస్టు హోదా పొందిన దేశాల క్రికెటర్లే ప్రపంచ రికార్డుల మోత మోగించడం సాధారణం. అయితే..టెస్టు హోదా లేని ఓ దేశానికి చెందిన క్రికెటర్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడంటే మాత్రం ఆశ్చర్యపోక తప్పదు.

మొనగాళ్లను మించిన పసికూన..

అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే తన ఉనికిని చాటుకొంటున్న నేపాల్ జట్టు సభ్యుడు, 22 సంవత్సరాల సందీప్ లామీచానే వన్డే క్రికెట్లో ప్రపంచ రికార్డుతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.

వన్డే క్రికెట్లో ఐదేళ్ల క్రితమే అఫ్ఘనిస్థాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నెలకొల్పిన ప్రపంచ రికార్డును నేపాలీ కుర్రోడు సందీప్ అధిగమించాడు. ఏసీసీ పురుషుల ప్రీమియ‌ర్ క‌ప్‌టోర్నీలో భాగంగా ఒమ‌న్ తో జరిగిన పోరులో సందీప్ ఈ రికార్డు నమోదు చేశాడు. కేవలం 42 వన్డే మ్యాచ్ ల్లోనే 100 వికెట్ల మైలురాయిని చేరడం ద్వారా అత్యంత వేగంగా వంద వన్డే వికెట్లు సాధించిన తొలి బౌలర్ గా సందీప్ నిలిచాడు.

జైలు నుంచి బెయిలు పై బయటకు వచ్చి....

నేపాల్ లోని ఓ యువతిపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై సందీప్ లామిచానేను గతేడాది అక్కడి పోలీసులు అరెస్టు చేసి జైలులో ఉంచారు. జైలులో ఉన్న కారణంగా కొద్దిమాసాలపాటు క్రికెట్ కు దూరమైన సందీప్..బెయిలు పై బయటకు వచ్చిన తర్వాత నుంచి తిరిగి నేపాల్ జాతీయజట్టులో చోటు సంపాదించడం ద్వారా మరోసారి సత్తా చాటుకొన్నాడు.

2018 లో అప్ఘన్ లెగ్ స్పిన్న గుగ్లీ బౌలర్ రషీద్ ఖాన్ సాధించిన అత్యంత వేగంగా 100 వన్డే వికెట్ల రికార్డును సందీప్ అధిగమించగలిగాడు. రషీద్ 44 మ్యాచ్ ల్లో సాధించిన ప్రపంచ రికార్డును సందీప్ కేవలం 42 మ్యాచ్ ల్లోనే తెరమరుగు చేయగలిగాడు.

వన్డే ఫార్మాట్లో అత్యంత వేగంగా 100 వికెట్లు మైలురాయిని చేరిన దిగ్గజ బౌలర్ల మిషెల్ స్టార్క్, సక్లయిన్ ముస్తాక్, షేన్ బాండ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఉన్నారు.

ఆస్ట్ర్రేలియా మెరుపు ఫాస్ట్ బౌలర్ స్టార్క్ 52 వన్డేల్లోనూ, పాక్ ఆఫ్ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ 53 వన్డేలలోనూ, న్యూజిలాండ్ మెరుపు ఫాస్ట్ బౌలర్ షేన్ బాండ్,

అఫ్ఘన్ స్వింగ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ 54 మ్యాచ్ ల్లోనూ 100 వికెట్ల రికార్డును చేరుకోగలిగారు.

అయితే..టెస్టు హోదాలేని నేపాల్ కు చెందిన సందీప్ మాత్రం ఈ దిగ్గజాల రికార్డులను కేవలం 42 మ్యాచ్ ల్లోనే అధిగమించడం ద్వారా చరిత్ర సృష్టించాడు.

అత్యాచారం కేసులో జైలుకు..

క్రికెటర్ గా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకొన్న సందీప్ 21 సంవత్సరాల చిన్నవయసులోనే జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఓ యువతి పై అత్యాచారం చేశాడన్న కారణంగా పోలీసులు గతేడాది అరెస్టు చేసి జైలులో ఉంచారు. దాంతో సందీప్ క్రికెట్ జీవితం ముగిసిపోయిందనే అందరూ అనుకొన్నారు. నేపాల్ క్రికెట్ సంఘం సైతం సందీప్ పై నిషేధం విధించింది. అయితే.. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో సందీప్‌పై నిషేధాన్ని ఎత్తి వేసినా విచారణ మాత్రం కొనసాగుతూనే ఉంది.

బెయిలు రావడంతో జైలు నుంచి బయటకు వచ్చిన సందీప్ ..నేపాల్ బౌలింగ్ కు వెన్నెముకగా మారాడు.


ఐపీఎల్‌లో ఢిల్లీకి ఆడిన సందీప్..

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన ఐపీఎల్ లో 2018 నుంచి 2020 సీజన్ వరకూ ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడిన అనుభవం సందీప్ కు ఉంది. 15 సంవత్సరాల చిరుప్రాయంలోనే సీజన్ కు 10 లక్షల రూపాయల కాంట్రాక్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో సందీప్ చేరాడు.

ఢిల్లీ తరపున 9 మ్యాచులు ఆడిన సందీప్ 2018 సీజన్లో ఆరు వికెట్లు, 2019లో 13 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 2020 సీజన్లో మాత్రం ఢిల్లీ తుది జట్టులో చోటు సంపాదించలేకపోయాడు.

ఆ తర్వాత ఈ లెగ్ స్పిన్న‌ర్‌కు మరో అవ‌కాశమే దక్కలేదు. అప్ప‌టి నుంచి సందీప్ ఐపీఎల్ కే దూరం కావాల్సి వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ లీగ్ వర్గాలలో ప్రతిభావంతుడైన యువలెగ్ స్పిన్నర్ గా సందీప్ లామిచానేకు గొప్పగుర్తింపే ఉంది.

నేపాల్ జట్టులోని స్టార్ క్రికెటర్లలో ఒకడైన సందీప్ ..అత్యాచారం విచారణలో నిర్దోషిగా బయటపడగలిగితేనే భవిష్యత్ లో మరింతగా రాణించే అవకాశం ఉంటుంది.

First Published:  25 April 2023 5:30 AM GMT
Next Story