Telugu Global
Sports

నిరాశ పరిచినా.. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్‌ రికార్డు

వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో రజతం గెలిచాడు. ఈ ఫీట్ సాధించిన తొలి భారత పురుష అథ్లెట్‌గా నీరజ్ రికార్డులకు ఎక్కాడు.

నిరాశ పరిచినా.. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్‌ రికార్డు
X

భారీ అంచనాలతో వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ బరిలోకి దిగిన నీరజ్ చోప్రా.. మరోసారి ఒలింపిక్స్ లాగా చరిత్ర సృష్టిస్తాడని అందరూ భావించారు. అయితే ఆదివారం ఉదయం జరిగిన ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా తృటిలో స్వర్ణ పతకాన్ని చేజార్చుకున్నాడు. స్వర్ణ పతకం రాలేదని అభిమానులు నిరాశ చెందారు. కానీ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన తొలి భారత పురుష అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పాడు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా 88.13 మీటర్ల దూరం విసిరి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్ 90.54 మీటర్లు విసిరి స్వర్ణ పతకం గెలుచుకున్నాడు.



క్వాలిఫయింగ్ రౌండ్లలో అద్భుత ప్రతిభ కనపరిచి ఫైనల్స్ చేరుకున్న నీజర్.. ఆదివారం ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయాడు. నాలుగో ప్రయత్నంలో జావెలిన్‌ను 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఐదో ప్రయత్నంలో మరింత దూరం విసురుతాడని భావించినా.. ఫౌల్ చేయడంతో రెండో స్థానానికే పరిమితం అయ్యాడు. ఒకవేళ నీరజ్ స్వర్ణం గెలిస్తే.. 2009 తర్వాత ఒకే ఏడాదిలో ఒలింపిక్స్, వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌గా నిలిచిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టించేవాడే. కానీ ఫైనల్‌లో అతడికి అండర్సన్ రూపంలో గట్టి పోటీ ఏర్పడింది.

వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన తొలి ట్రాక్ అండ్ ఫీల్డ్ ఇండియన్ మేల్ అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. అంతకు ముందు 2003 పారిస్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో అంజూ బాబీ జార్జ్ లాంగ్ జంప్‌లో బ్రాంజ్ మెడల్ సాధించింది. వరల్డ్ అథ్లెటిక్స్‌లో మెడల్ సాధించిన తొలి భారత అథ్లెట్ ఆమె. ఆ తర్వాత 19 ఏళ్లకు నీరజ్ రజతం సాధించాడు. ఇక నీరజ్ తర్వాతి టార్గెట్ కామన్వెల్త్ గేమ్స్. ఈ పోటీల్లో నీరజ్ తప్పకుండా స్వర్ణం సాధిస్తాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

First Published:  24 July 2022 4:37 AM GMT
Next Story