Telugu Global
Sports

రుమాలీ రోటీ చుట్టిన చేతులతో వికెట్లు, కోట్లు!

భారత కీలక ఫాస్ట్ బౌలర్, హైదరాబాదీ స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ తన 30వ పుట్టినరోజును కుటుంబసభ్యుల సమక్షంలో జరుపుకొన్నాడు. తాను క్రికెటర్ గా ఎదగటానికి తన కుటుంబం పడిన కష్టం, చేసిన త్యాగం తలచుకొని భావోద్వేగానికి గురయ్యాడు.

రుమాలీ రోటీ చుట్టిన చేతులతో వికెట్లు, కోట్లు!
X

భారత కీలక ఫాస్ట్ బౌలర్, హైదరాబాదీ స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ తన 30వ పుట్టినరోజును కుటుంబసభ్యుల సమక్షంలో జరుపుకొన్నాడు. తాను క్రికెటర్ గా ఎదగటానికి తన కుటుంబం పడిన కష్టం, చేసిన త్యాగం తలచుకొని భావోద్వేగానికి గురయ్యాడు.

భారత క్రికెట్ ప్రస్తుత తరం ఆటగాళ్లలో ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. పేద, దిగువమధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన ఆటగాళ్లు యశస్వీ జైశ్వాల్, ధృవ్ జురెల్, శార్థూల్ ఠాకూర్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్ అంతర్జాతీయ క్రికెటర్లుగా ఎదగడం వెనుక కుటుంబసభ్యుల త్యాగాలు, ఎన్నో వెతలు, అవమానాలు, అంతులేని పోరాటం దాగి ఉన్నాయి.

క్రికెటర్ కావటానికి భారత డాషింగ్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ ముంబై మహానగరం ఫుట్ పాత్ ల మీద పడుకొని, పానీపూరీ దుకాణంలో పనిచేస్తే..మెరుపు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ క్యాటరింగ్ పనికి వెళుతూ రుమాలీ రోటీలు చుట్టేవాడు.

ప్రస్తుత భారత ఫాస్ట్ బౌలింగ్ కు వెన్నెముకలాంటి మహ్మద్ సిరాజ్ 30వ పడిలో ప్రవేశించాడు. ఇంగ్లండ్ తో ఐదుమ్యాచ్ ల టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే తాను పుట్టిపెరిగిన హైదరాబాద్ నగరానికి తిరిగి వచ్చి.. తన కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నాడు.

200 రూపాయల కోసం ఎంత కష్టం, ఎంత కష్టం..

హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ప్రాంతానికి చెందిన ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన సిరాజ్ కు చదువు ఏమాత్రం అబ్బలేదు. తండ్రి ఆటో డ్రైవర్, తల్లి ఆ ఇంట్లో, ఈ ఇంట్లో పాచిపనులు చేస్తూ తెచ్చిన మొత్తంతో కుటుంబం గడిచేది.

తన కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండటం కోసం సిరాజ్ సైతం క్యాటరింగ్ బృందంలో సభ్యుడిగా రుమాలీ రోటీలు చేస్తూ రోజుకు 200 రూపాయలు సంపాదించేవాడు.

తన సంపాదనలో 50 రూపాయలు ఉంచుకొని, మిగిలిన 150 రూపాయల మొత్తం ఇంటిఖర్చుల కోసం ఇచ్చేవాడు. క్రికెట్ ఆడటానికి తగిన దుస్తులు, ఓ ఫాస్ట్ బౌలర్ కావటానికి తగిన పరికరాలు, హంగులు కూడా తనకు లేవని సిరాజ్ గుర్తు చేసుకొన్నాడు.

తమను పెంచి పెద్దచేయటానికి తల్లిదండ్రులు పడిన కష్టాన్ని గుర్తు చేసుకొని సిరాజ్ తీవ్రభావోద్వేగానికి గురయ్యాడు. రుమాలీ రోటీలు చేసిన రోజు తన చేతులు బొబ్బలెక్కేవని, మండిపోతూ ఉండేవని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం భారతజట్టులో కీలక సభ్యుడిగా, ఐపీఎల్ లో బెంగళూరు ఫ్రాంచైజీ ఆటగాడిగా సిరాజ్ వివిధ రూపాలలో ఏడాదికి 20 కోట్ల రూపాయలకు పైగా సంపాదిస్తున్నాడు.

తాను ఎంత ఎదిగినా గతాన్ని గుర్తు చేసుకొంటూనే ఉంటానని సిరాజ్ గర్వంగా చెప్పాడు.

వెతుక్కొంటూ వచ్చిన అవకాశాలు..

విపరీతమైన పోటీ ఉన్న క్రికెట్లో ఎక్కువమంది అవకాశాల కోసం కొందరు ఎదురుచూస్తుంటే...అవకాశాలే కొందరిని వెతుక్కొంటూ రావడం సిరాజ్ విషయంలో నిజమయ్యింది.

ఐపీఎల్ 13వ సీజన్లో అంచనాలకు మించి రాణించడం ద్వారా సిరాజ్ జీవితమే మారిపోయింది. ఐపీఎల్ ప్రదర్శనతో ఏకంగా భారతజట్టులో చోటుసంపాదించాడు.

అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోడానికి పడరాని పాట్లు పడ్డాడు. ఓ దశలో క్రికెట్ నుంచి విరమించుకొందామని కూడా భావించాడు. భారత జట్టు సభ్యుడిగా వరుస వైఫల్యాలతో తీవ్రనిరాశకు గురైన సిరాజ్ 2019-20 సీజన్లోనే క్రికెట్ కు గుడ్ బై చెప్పాలని ప్రయత్నించాడు.

2017 న్యూజిలాండ్ టీ-20 సిరీస్ ద్వారా అరంగేట్రం చేసిన సిరాజ్ ఆ వెంటనే జట్టులో స్థానం కోల్పోయాడు. తిరిగి 2019 వన్డే సిరీస్ ద్వారా ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడిన సిరాజ్ నిలదొక్కుకోలేకపోయాడు.

తండ్రిమరణాన్ని దిగమింగి.....

క్రికెట్ సంపాదనతో అమ్మను పని మాన్పించిన సిరాజ్...ఆస్ట్ర్రేలియా పర్యటనకు వెళ్ళిన సమయంలోనే తండ్రిని కోల్పోయాడు. కరోనా, క్వారెంటైయిన్ నిబంధనల కారణంగా స్వదేశానికి వచ్చి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయాడు. తన ఉన్నతి కోసం పాటుపడిన తండ్రి మరణాన్ని దిగమింగుకొని ఆస్ట్ర్రేలియాలోనే ఉండిపోయాడు.ఆ త్యాగానికి ప్రతిఫలం అన్నట్లుగా భారత టెస్టు జట్టులో చోటు దక్కింది.

ఇశాంత్ శర్మ, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ లాంటి సీనియర్ ఫాస్ట్ బౌలర్లు గాయాలు, ఫిట్ నెస్ సమస్యలతో అందుబాటులో లేకపోడం...26 సంవత్సరాల హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ సిరాజ్ కు కలసి వచ్చింది.

దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించడంతో పాటు...గల్ఫ్ దేశాలు వేదికగా ముగిసిన 2020 ఐపీఎల్ లో బెంగళూరు జట్టు తరపున సత్తా చాటుకోడం ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టు ద్వారా సిరాజ్ సాంప్రదాయటెస్టు అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత నుంచి సిరాజ్ మరి వెనుదిరిగి చూసింది లేదు.

అరుదైన ఘనత....

ఆటోరిక్షా డ్రైవ‌ర్ కుమారుడి స్థాయి నుంచి భారత టెస్ట్ బౌలర్ స్థాయికి ఎదిగిన సిరాజ్‌.. టీమిండియా త‌ర‌పున ఆడిన రెండ‌వ హైదరాబాదీ ఫాస్ట్ బౌల‌ర్‌. గ‌తంలో స‌య్యిద్ అబిద్ అలీ భారత్ కు ఫాస్ట్ బౌలర్ గా సేవలు అందించాడు. అబిద్ అలీ 1966లో అడిలైడ్‌లో టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో అత‌ను 55 ప‌రుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు. అయితే..భారత్ త‌ర‌పున టెస్టు బరిలో నిలిచిన 298వ ప్లేయ‌ర్‌గా సిరాజ్ రికార్డుల్లో చేరాడు. మెల్‌బోర్న్ టెస్టు రెండుఇన్నింగ్స్ లోనూ కీలక వికెట్లు పడగొట్టడం ద్వారా సిరాజ్ జట్టు విజయంలో తనవంతు పాత్ర నిర్వరించాడు.

2023 వన్డే ప్రపంచకప్ లో పాల్గొన్న సిరాజ్ రోహిత్ శర్మ నాయకత్వంలో ఆడిన ఆసియాకప్ ఫైనల్లో శ్రీలంకపైన విశ్వరూపమే ప్రదర్శించాడు. దక్షిణాఫ్రికా సిరీస్ లోనూ చెలరేగిపోయాడు.

ఐపీఎల్ ద్వారా సీజన్ కు 7 కోట్లు...

ఐపీఎల్ -2017 సీజన్లో 10 లక్షల రూపాయలుగా ఉన్న సిరాజ్ ధర..2018లో 2 కోట్ల 60 లక్షల రూపాయలకు పెరిగింది. 2022 సీజన్లో 7 కోట్ల రూపాయలకు పెరగడం విశేషం. క్రికెటర్ గా ఇప్పటికే సిరాజ్ 55 కోట్ల రూపాయలు సంపాదించాడు.

అంతేకాదు..బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు క్రికెటర్లలో ఒకడిగా...సిరాజ్ గ్రేడ్-ఏ జాబితాలో చోటు సంపాదించడం ద్వారా ఏడాదికి 5 కోట్ల రూపాయలు అందుకొంటున్నాడు. ఇది కాక భారత్ తరపున ఆడిన ఒక్కో టెస్టుమ్యాచ్ కు 15 లక్షలు, వన్డేకి 7 లక్షలు, టీ-20 మ్యాచ్ కు 4 లక్షల రూపాయలు చొప్పున మ్యాచ్ ఫీజుగా ఆర్జిస్తున్నాడు.

ఒకదశలో రోజుకు 200 రూపాయలు సంపాదించడానికి రుమాలీ రోటీలు చుడుతూ నానాపాట్లు పడిన సిరాజ్ ప్రస్తుతం క్రికెటర్ గా నెలకు కోటి రూపాయలు సంపాదించే స్థాయికి ఎదగటం అద్భుతం కాక మరేమిటి.

సిరాజ్ తన ఫిట్ నెస్ ను, ఫామ్ ను కాపాడుకోగలిగితే మరో ఐదేళ్లపాటు భారత క్రికెట్ కీలక ఫాస్ట్ బౌలర్ గా కొనసాగే అవకాశం లేకపోలేదు.

First Published:  14 March 2024 5:30 AM GMT
Next Story