Telugu Global
Sports

భారతగడ్డపై ముస్లిం సెంటిమెంట్...తీరు మారని పాక్!

భారత్ వేదికగా జరుగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందే పాకిస్థాన్ ముస్లిం సెంటిమెంట్ ను రెచ్చగొట్టడం ద్వారా పబ్బం గడుపుకోవాలని చూస్తోంది.

భారతగడ్డపై ముస్లిం సెంటిమెంట్...తీరు మారని పాక్!
X

భారతగడ్డపై ముస్లిం సెంటిమెంట్...తీరు మారని పాక్!

భారత్ వేదికగా జరుగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందే పాకిస్థాన్ ముస్లిం సెంటిమెంట్ ను రెచ్చగొట్టడం ద్వారా పబ్బం గడుపుకోవాలని చూస్తోంది.

ఏడేళ్ల విరామం తర్వాత భారత గడ్డపై అడుగుపెట్టిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు యాజమాన్యం బుద్ధి ఏమాత్రం మారలేదు. ఆఖరి నిముషంలో వీసాలు జారీకావడంతో భారత్ లో అడుగుపెట్టిన పాక్ వచ్చీరావడంతోనే ముస్లిం సెంటిమెంట్ ను రెచ్చగొట్టడం ద్వారా మరో వివాదానికి ఆజ్యం పోసింది.

ప్రపంచ మేటి బ్యాటర్ బాబర్ అజమ్ నాయకత్వంలో భారత్ లో అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్న 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో పాల్గొనటానికి పాక్ జట్టు తరలి వచ్చింది.

హైదరాబాద్ లో పాక్ క్రికెటర్ల మకాం...

హైదరాబాద్ వేదికగా పాక్ జట్టు ప్రాక్టీసు మ్యాచ్ లతో పాటు రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ ల్లో సైతం పాల్గోనుంది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన తొలి సన్నాహక పోటీలో పాక్ జట్టుకు న్యూజిలాండ్ చేతిలో పరాజయం తప్పలేదు. ప్రపంచకప్ లో తన తొలిమ్యాచ్ ఆడటానికి ముందు పాక్ జట్టు మరో ప్రాక్టీసు మ్యాచ్ లో పాల్గొనాల్సి ఉంది.

అయితే..అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా అక్టోబర్ 14న జరిగే రౌండ్ రాబిన్ లీగ్ పోరులో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత్ తో పాక్ జట్టు తలపడనుంది.

శ్రీలంక వేదికగా ఇటీవలే ముగిసిన వన్డే ఆసియాకప్ సూపర్ -4 రౌండ్లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్..ఫైనల్స్ కు అర్హత సాధించడంలో విఫలం కావడం ద్వారా ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను సైతం చేజార్చుకొంది.

ముస్తాక్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు...

మరోవైపు..పాక్ మాజీ క్రికెటర్, సహాయక శిక్షకుడు ముస్తాక్ అహ్మద్ మాత్రం..ముస్లిం సెంటిమెంట్ ను రెచ్చగొడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్, అహ్మదాబాద్ నగరాలలో ముస్లిం జనాభా ఎక్కువని, వారి మద్దతు పాక్ జట్టుకే ఉంటుందని తేల్చి చెప్పాడు.

తమజట్టు హైదరాబాద్, అహ్మదాబాద్ నగరాలు వేదికలుగా ఆడే మ్యాచ్ లకు ఆయా నగరాలలోని ముస్లింవర్గాల క్రికెట్ అభిమానుల మద్ధతు తమకే ఉంటుందని, వారి అండదండలతోనే తాము విజయాలు సాధిస్తామంటూ ముస్తాక్ వ్యాఖ్యలు చేయడం ద్వారా వివాదానికి తెరలేపాడు.

అయితే..క్రికెట్ కు హిందూ, ముస్లిం అంటూ సెంటిమెంట్ ను అంటగట్టడం ఏమాత్రం సమర్ధనీయం కాదని పలువురు వ్యాఖ్యాతలు మండిపడుతున్నారు. ఆటను, ఆటలోని ప్రతిభకు మాత్రమే అభిమానులుంటారు కానీ..మతాలకు చెందిన క్రికెటర్లకు ఉండరని పలువురు ప్రముఖులు చురకలంటించారు.

పాకిస్థాన్ జట్టు ప్రపంచకప్ ను గెలుచుకోవాలంటే, అత్యుత్తమంగా రాణించాలంటే మతాన్ని , సెంటిమెంట్లను నమ్ముకొనే కంటే తమలోని ప్రతిభను నమ్ముకోవాలని కొందరు విశ్లేషకులు సలహా ఇచ్చారు.

ప్రపంచకప్ టోర్నీలలో భారత్ ప్రత్యర్థిగా పాకిస్థాన్ కు అంతంత మాత్రమే రికార్డు ఉంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ కు లక్షకు పైగా అభిమానులు హాజరుకానున్నారు. లక్షా 25 వేల సీటింగ్ సామర్థ్యం కలిగిన నరేంద్ర మోడీ స్టేడియం కిటకిటలాడటం ఖాయంగా కనిపిస్తోంది.

First Published:  30 Sep 2023 5:45 AM GMT
Next Story