Telugu Global
Sports

లక్నో పై ముంబై కళ్లు చెదిరే విజయం!

ఐపీఎల్ -16వ సీజన్ ఎలిమినేటర్ రౌండ్లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ కళ్లు చెదిరే విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ ను 81 పరుగులతో చిత్తు చేసి..క్వాలిఫైయర్ -2కు అర్హత సంపాదించింది.

లక్నో పై ముంబై కళ్లు చెదిరే విజయం!
X

ఐపీఎల్ -16వ సీజన్ ఎలిమినేటర్ రౌండ్లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ కళ్లు చెదిరే విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ ను 81 పరుగులతో చిత్తు చేసి..క్వాలిఫైయర్ -2కు అర్హత సంపాదించింది.

ఐపీఎల్ -16వ సీజన్ ప్లే-ఆఫ్ రౌండ్లలో ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్ జోరు టాప్ గేర్ కి చేరింది. లీగ్ దశ ఆఖరిమ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తు చేయడం ద్వారా ప్లే-ఆఫ్ రౌండ్ కు అర్హత సంపాదించిన ముంబై...ఎలిమినేటర్ రౌండ్లో విశ్వరూపమే ప్రదర్శించింది.

చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ముగిసిన ఏకపక్ష పోరులో ముంబై 81 పరుగులతో లక్నో సూపర్ జెయింట్స్ ను చిత్తు చేసి..లీగ్ రౌండ్ ఓటమికి బదులు తీర్చుకొంది.

ఆల్ రౌండ్ షోతో ముంబైజోరు...

ఓడితే ప్లే-ఆఫ్ రౌండ్ నుంచి నిష్క్ర్రమించక తప్పని ఈ పోరులో ముందుగా బ్యాటింగ్ లోనూ, ఆ తర్వాత బౌలింగ్ , ఫీల్డింగ్ విభాగాలలో ముంబై చెలరేగిపోయింది.

గతంలో లక్నో ప్రత్యర్థిగా మూడుకు మూడుమ్యాచ్ ల్లోనూ పరాజయాలు పొందిన ముంబై తన పవర్ ఏంటో లక్నో సూపర్ జెయింట్స్ కి రుచిచూపించింది.

ఈ డూ ఆర్ డై ఫైట్ లో టాస్‌ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 182 పరుగుల మ్యాచ్ విన్నింగ్స్ స్కోరు సాధించింది.

గ్రీన్, సూర్య షో, నేహాల్ ఫినిషింగ్ టచ్...

ముంబై ఓపెనింగ్ జోడీ రోహిత్ శ‌ర్మ(11), ఇషాన్ కిష‌న్(15) దూకుడుగా ఆడినా కేవలం 38 పరుగులకే ఒకరి వెనుక ఒకరు పెవీలియన్ చేరారు. అయితే..సూపర్ హిట్టర్లు కామెరూన్ గ్రీన్(41), సూర్య‌కుమార్ యాద‌వ్(33) కీల‌క భాగస్వామ్యంతో ముంబైని గాడిలో పెట్టారు. ఒకదశలో ముంబై 190 నుంచి 200 వరకూ స్కోరు సాధించగలదని అందరూ భావించారు. అయితే పేసర్ న‌వీన్ ఉల్ హ‌క్ తన వైవిద్యభరితమైన బంతులతో.. ఒకే ఓవ‌ర్లో ఈ ఇద్దరు హిట్టర్లను పడగొట్టాడు.కామెరూన్‌ గ్రీన్‌ (23 బంతుల్లో 41; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌) టాప్‌ స్కోరర్‌ కాగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ (20 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్‌ వర్మ (26; 2 సిక్సర్లు), నేహల్‌ వధేరా (12 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక పరుగులు సాధించారు.

చివరి ఆరు ఓవర్లలో తిల‌క్ వ‌ర్మ‌(26), ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌ నేహ‌ల్ వ‌ధేరా(23) టిమ్ డేవిడ్(7) జోరు పెంచడంతో ముంబై 182 పరుగుల స్కోరు సాధించగలిగింది.య‌శ్ ఠాకూర్ వేసిన 20వ‌ ఓవ‌ర్లో ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌ నేహ‌ల్ వ‌ధేరా తొలి బంతికి బౌండ్రీ బాదాడు. మూడో బంతికి 91 మీట‌ర్ల‌ సిక్స్ బాదాడు. నాలుగో బంతికి బౌండ‌రీ సాధించాడు. ఆఖ‌రి బంతికి ర‌వి బిష్ణోయ్ చేతికి చిక్కాడు.

ల‌క్నో బౌలర్ల‌లో న‌వీన్ ఉల్ హ‌క్ 4, య‌శ్ ఠాకూర్ 3 వికెట్లు, మొహిసిన్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు.

ఆకాశ్ స్వింగ్ కు లక్నో కంగు....

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 183 పరుగుల స్కోరు చేయాల్సిన లక్నో సూపర్ జెయింట్స్ కేవలం 16.3 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లు, ఫీల్డర్లు దూకుడుకు లక్నో బ్యాటర్లు దాసోహమనక తప్పలేదు.

లీగ్ దశ పోరులో ముంబై పై మ్యాచ్ విన్నర్ గా నిలిచిన స్టోయినిస్‌ ఈ నాకౌట్ పోరులోనూ టాప్ స్కోరర్ గా నిలిచినా ప్రయోజనం లేకపోయింది.

ఓపెనర్లు కీల్ మేయర్స్- ప్రేరక్ మన్కడ్ శుభారంభాన్ని ఇవ్వకుండానే వెనుదిరిగారు. ప్రేరక్‌ (3), కెప్టెన్ కృణాల్‌ పాండ్యా (8), కైల్‌ మయేర్స్‌ (18), ఆయుష్‌ బదోనీ (1), నికోలస్‌ పూరన్‌ (0), దీపక్‌ హుడా (15), కృష్ణప్ప గౌతమ్‌ (2) తక్కువ స్కోర్లకే అవుట్ కావడంతో లక్నో మరి కోలుకోలేకపోయింది.

ఓపెనర్లు ప్రేరక్‌, మయేర్స్‌ ఎక్కువ సేపు నిలువలేకపోవడంతో లక్నో జట్టు 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్టోయినిస్‌ ధాటిగా ఆడటంతో లక్నో కోలుకుంది. మరో వైపు కెప్టెన్‌ కృణాల్‌ ఆచితూచి ఆడాడు. మిడిలార్డర్ బ్యాటర్లు బదోనీ, పూరన్‌, హుడా సైతం విఫలమయ్యారు.

ఆకాశ్ నిప్పులు చెరిగే బంతులతో మ్యాచ్‌ గమనాన్ని మార్చేశాడు. వికెట్లకే గురిపెట్టిన బంతులతో ప్రతి బాల్‌కు వికెట్‌ పడగొట్టేలా కనిపించాడు. ఐపీఎల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు. ఆకాశ్ జోరులో ప్రేరక్‌, బదోనీ, పూరన్‌, రవి బిష్ణోయ్‌ , మొహసిన్‌ ఖాన్‌ కొట్టుకు పోయారు.

ఒకవైపు ఆకాశ్‌ వీర విహారం చేస్తుంటే.. మరోవైపు లక్నో తప్పిదాలతో తనకుతానే చేటు చేసుకొంది. మంచి లయలో బ్యాటింగ్‌ చేస్తున్న స్టోయినిస్‌.. పరుగు తీస్తున్న సమయంలో సహచరుడు దీపక్‌ హుడా అడ్డురావడంతో రనౌట్‌ కాగా.. ఆ తర్వాత కృష్ణప్ప గౌతమ్‌, హుడా కూడా రనౌట్‌గానే వెనుదిరిగారు. దీంతో ఒక దశలో 2 వికెట్లకు 69 స్కోరుతో ఉన్న సూపర్‌ జెయింట్స్‌ కేవలం 32 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది.స్టోయినిస్ 5 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 40 పరుగులు సాధించాడు.

ముంబై యువఫాస్ట్ బౌలర్ ఆకాశ్ మధ్వాల్ యార్కర్లు, స్కిడ్డర్లతో విశ్వరూపం ప్రదర్శించాడు. 3.3 ఓవర్లలో 5 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి..ముంబైకి 81 పరుగుల భారీవిజయం అందించాడు. లక్నో బ్యాటర్లు ముగ్గురు రనౌట్ల రూపంలో వెనుదిరిగారు.ఫాస్ట్ బౌలర్ జోర్డాన్, లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా చెరో వికెట్ పడగొట్టారు ఐపీఎల్ ప్లే-ఆఫ్ చరిత్రలోనే అత్యుత్తమంగా రాణించిన ఆకాశ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

లీగ్ ఆఖరి రౌండ్లో సన్ రైజర్స్ పై 4 వికెట్లు పడగొట్టిన ఆకాశ్ కు ఆ తర్వాతి మ్యాచ్ లోనే 5 వికెట్లు దక్కడం విశేషం.

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈనెల 26న జరిగే క్వాలిఫైయర్ -2లో గుజరాత్ టైటాన్స్ తో ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనుంది.

First Published:  25 May 2023 7:25 AM GMT
Next Story