Telugu Global
Sports

రంజీట్రోఫీ 'రారాజు' ముంబై!

భారత క్రికెట్ చిరునామా ముంబై దేశవాళీ రంజీ ట్రోఫీకి మరోపేరుగా నిలిచింది. రికార్డుస్థాయిలో 42వ టైటిల్ నెగ్గి తన రికార్డును తానే అధిగమించింది.

రంజీట్రోఫీ రారాజు ముంబై!
X

భారత క్రికెట్ చిరునామా ముంబై దేశవాళీ రంజీ ట్రోఫీకి మరోపేరుగా నిలిచింది. రికార్డుస్థాయిలో 42వ టైటిల్ నెగ్గి తన రికార్డును తానే అధిగమించింది.

దేశవాళీ క్రికెట్లో అత్యంత పురాతన టోర్నీలలో ఒకటైన రంజీట్రోఫీ చరిత్రలో ముంబై రికార్డుస్థాయిలో 42వసారి విజేతగా నిలిచింది. ఎనిమిదేళ్ల విరామం తరువాత జాతీయ క్రికెట్ చాంపియన్ గా సరికొత్త రికార్డు నెలకొల్పింది.

ముంబై స్కూల్ ఆఫ్ క్రికెట్.....

గత తొమ్మిది దశాబ్దాలుగా జరుగుతున్న రంజీట్రోఫీలో ముంబై ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. అలనాటి విజయ్ మర్చెంట్ నుంచి నేటితరం యశస్వి జైశ్వాల్ వరకూ ఎందరో గొప్పగొప్ప క్రికెటర్లకు భారత, అంతర్జాతీయ క్రికెట్ కు అందించిన ముంబైకి భారత క్రికెట్ నర్సరీగా, 'ముంబై స్కూల్ ఆఫ్ క్రికెట్' గా గొప్ప పేరుంది.

గొప్ప క్రికెటర్లను తయారు చేయటమే కాదు..గొప్పజట్లను తీర్చి దిద్దుతూ తనదైన క్రికెట్ సంస్కృతిని పాదుకొల్పిన ఘనత కేవలం ముంబై క్రికెట్ సంఘానికి మాత్రమే దక్కుతుంది. దేశవాళీ క్రికెట్లో జూనియర్ స్థాయి నుంచి రంజీట్రోఫీ స్థాయి వరకూ ముంబై తిరుగులేని ఆధిపత్యమే కొనసాగుతోంది.

169 పరుగుల విజయంతో......

అయితే..రంజీట్రోఫీ చరిత్రలో మాత్రం సౌరాష్ట్ర్ర, విదర్భ, మధ్యప్రదేశ్ లాంటి జట్ల జోరుతో గత దశాబ్దకాలంగా ముంబై వెనుకబడి పోతూ వస్తోంది. ఏజట్టు సాధించని విధంగా ఇప్పటికే 41సార్లు రంజీ విజేతగా నిలిచిన ముంబై ఎనిమిదేళ్ల విరామం తరువాత ప్రస్తుత సీజన్ రంజీ ఫైనల్స్ కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో బరోడా, సెమీఫైనల్లో తమిళనాడును చిత్తు చేసిన ముంబై ఫైనల్లో మాత్రం గట్టి పోటీ ఎదుర్కొని రెండుసార్లు చాంపియన్ విదర్భను 169 పరుగులతో అధిగమించడం ద్వారా 42వ సారి ట్రోఫీ కైవసం చేసుకోగలిగింది.

స్టార్ ప్లేయర్లు అందుబాటులో లేకున్నా...

భారత కెప్టెన్ రోహిత్ శర్మ, యువఓపెనర్ యశస్వి జైశ్వాల్, సర్ ఫ్రాజ్ ఖాన్ లాంటి మేటి బ్యాటర్లు అందుబాటులో లేకున్నా ముంబై 2023-24 రంజీ ఫైనల్స్ కు చేరడం, అందుబాటులో ఉన్న ఆటగాళ్లతోనే అజింక్యా రహానే నాయకత్వంలో విజేతగా నిలవడం, 42వసారి విజేతగా తన రికార్డును తానే అధిగమించడం ఓ గొప్ప రికార్డుగా మిగిలిపోతుంది.

గత తొమ్మిది దశాబ్దాల కాలంలో 48సార్లు రంజీ ఫైనల్స్ చేరడంతో పాటు 42 సార్లు విజేతగా, ఆరుసార్లు రన్నరప్ గా నిలిచిన అరుదైన రికార్డు కేవలం ముంబైకి మాత్రమే సొంతం.

హోంగ్రౌండ్ వాంఖడే స్టేడియం వేదికగా విదర్భతో జరిగిన టైటిల్ సమరంలో ముంబై తొలి ఇన్నింగ్స్ లో తడబడినా..ప్రత్యర్థిని 105 పరుగులకే కుప్పకూల్చడం, తన రెండో ఇన్నింగ్స్ లో భారీస్కోరు సాధించడం ద్వారా టైటిల్ ఖాయం చేసుకోగలిగింది.

19సంవత్సరాల యువబ్యాటర్ ముషీర్ ఖాన్ రికార్డు శతకంతో ముంబై..ప్రత్యర్థి ఎదుట 538 పరుగుల భారీవిజయలక్ష్యాన్ని ఉంచగలిగింది. కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ ( 102), హర్ష దుబే ( 65 ) పోరాడినా విదర్భ 365 పరుగులు మాత్రమే చేయగలిగింది.

విదర్భ టెయిల్ ఎండర్ ఉమేశ్ యాదవ్ ను వెటరన్ ధవళ్ కులకర్ణీ పడగొట్టడంతో ముంబై 42వసారి రంజీట్రోఫీ విజేతగా నిలువగలిగింది. ముంబై విజయంలో ప్రధానపాత్ర వహించిన యువబ్యాటర్ ముషీర్ ఖాన్ కు ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్స్ అవార్డు దక్కింది.

ముంబైజట్టుకి మాస్టర్ హ్యాట్సాఫ్...

ముంబై క్రికెట్ ప్రధాన కేంద్రం వాంఖడే స్టేడియం 50 సంవత్సరాల వేడుకల సమయంలోనే ..వాంఖడే సేడియం వేదికగా జరిగిన రంజీ ఫైనల్లో ముంబైజట్టే విజేతగా నిలవడం ఓ చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుంది.

జాతీయ క్రికెట్ చాంపియన్ గా నిలిచిన ముంబైకి మాస్టర్ సచిన్ టెండుల్కర్, భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విఖ్యాత కామెంటీటర్లు సునీల్ గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్ హ్యాట్సాఫ్ చెప్పారు.

ముంబైజట్టుకి 10 కోట్ల నజరానా...

రంజీట్రోఫీ విజేత ముంబైజట్టుకు బీసీసీఐ 5 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీగా చెల్లిస్తే..ముంబై క్రికెట్ సంఘం తమ ఆటగాళ్లకు మరో 5 కోట్ల రూపాయలు బోనస్ గా ప్రకటించింది.

ముంబై జట్టులోని సభ్యులంతా మొత్తం 10 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని పంచుకోనున్నారు. ముంబై క్రికెట్ పరంపరను కొనసాగించిన జట్టు సభ్యులకు 5 కోట్ల రూపాయలు అదనంగా ఇస్తున్నట్లు ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడు అమోల్ కాలే, కార్యదర్శి అజింక్యా నాయక్ ప్రకటించారు.

దేశవాళీ క్రికెట్ ప్రస్తుత సీజన్లో వివిధ విభాగాలలో ముంబైజట్టు 7 విభాగాలలో జాతీయ చాంపియన్ గా నిలవడం తమకు గర్వకారణమని ముంబై క్రికెట్ సంఘం తెలిపింది.

రంజీట్రోఫీ మ్యాచ్ ల్లో ఆడిన క్రికెటర్లకు ఆడిన మ్యాచ్ ల ప్రాతిపదికన రోజుకు 25వేల నుంచి 50 వేల రూపాయల వరకూ మ్యాచ్ ఫీజుగా చెల్లిస్తున్నారు. ప్రస్తుత సీజన్లో ముంబై తరపున 10 మ్యాచ్ లు ఆడిన ఒక్కో ఆటగాడు 25 లక్షల రూపాయల చొప్పున మ్యాచ్ ఫీజు అందుకోనున్నాడు.

First Published:  15 March 2024 5:20 AM GMT
Next Story