Telugu Global
Sports

మహిళా ఐపీఎల్ లో ముంబై సునామీ!

భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఓ అద్భుత ఘట్టానికి ముంబైలో తెరలేచింది

మహిళా ఐపీఎల్ లో ముంబై సునామీ!
X

భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఓ అద్భుత ఘట్టానికి ముంబైలో తెరలేచింది. ప్రారంభ మహిళా ఐపీఎల్ లీగ్ కు ముంబై ఇండియన్స్ అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చింది...

క్రికెట్ అభిమానులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూసిన ప్రారంభ మహిళా ఐపీఎల్ హంగామాకు ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో అట్టహాసంగా తెరలేచింది.

బాలీవుడ్ స్టార్ల నృత్యాలు, పాప్ సంగీతం, లేజర్ లైట్ల హంగుల నడుమ 2023 సీజన్ టోర్నీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

మొత్తం ఐదు ( ముంబై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్ ) ఫ్రాంచైజీల కెప్టెన్లు కలసి విజేతజట్టుకు బహుకరించే ట్రోఫీని ఆవిష్కరించారు.

కళ్లు చెదిరే ఆరంభం....

మార్చి 4 నుంచి మార్చి 26 వరకూ జరిగే ఈటోర్నీని ముంబై నగరంలోని బ్రబోర్న్ స్టేడియం, డాక్టర్ డీవై పాటిల్ స్టేడియాలకు మాత్రమే పరిమితం చేశారు. ఐదుజట్ల ఈ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ కమ్ నాకౌట్ టోర్నీలో భాగంగా 22 మ్యాచ్ లను నిర్వహించనున్నారు.

హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్, మెగ్ లానింగ్ కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ జట్ల ప్రారంభమ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది.

ఈ టోర్నీ ప్రారంభమ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది.

హర్మన్ ప్రీత్ సుడిగాలి బ్యాటింగ్..

ముంబై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్..సుడిగాలి హాఫ్ సెంచరీతో తనజట్టు భారీస్కోరు సాధించడంలో ప్రధానపాత్ర వహించింది. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, 30 బంతుల్లో 14 బౌండ్రీలతో 65 పరుగుల స్కోరుతో టాప్ స్కోరర్ గా హర్మన్ నిలిచింది.

ముంబై ఇన్నింగ్స్‌ మొదటి 10 ఓవర్లు నిదానంగానే సాగినా ఆ తర్వాత ఒక్కసారిగా మెరుపువేగం పుంజుకొంది. 11వ ఓవర్ నుంచే హర్మన్‌ తన బ్యాటింగ్ ను టాప్ గేర్ కు మార్చింది. బౌండ్రీల వర్షం కురిపించింది.

ఓపెనర్‌ యస్తిక భాటియా ఆటమూడో ఓవర్‌లో ఒక్కపరుగుకే వెనుదిరగగా.. మాథ్యూస్‌, బ్రంట్‌ ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఈ జోడీ వీలు అదనుచూసి బౌండ్రీలు బాదడంతో ముంబై 10వ ఓవర్‌ పూర్తయ్యేసరికి 77 పరుగులు చేసి 2 వికెట్లు నష్టపోయింది.

ఆ తర్వాత నుంచి హర్మన్ తన బ్యాట్ కు పూర్తిస్థాయిలో పని చెప్పింది. స్నేహ్‌ రాణా ఓవర్‌లో రెండు ఫోర్లతో బౌండ్రీల వరదకు గేట్లు తెరిచింది. హర్మన్‌ ఔటయ్యేంత వరకు స్కోరుబోర్డు పరుగులెత్తింది. 12, 13 ఓవర్లలో రెండేసి ఫోర్లు బాదిన హర్మన్‌.. మోనికా పటేల్‌ వేసిన 15వ ఓవర్‌లో వరుసగా 4,4,4,4 బౌండ్రీలతో శివమెత్తి పోయింది.. గార్డ్‌నర్‌ వేసిన తదుపరి ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లు కొట్టిన ముంబై కెప్టెన్‌.. ఈ క్రమంలో 22 బంతుల్లో డబ్ల్యూపీఎల్‌లో తొలి అర్ధశతకం నమోదు చేసుకుంది.

మహిళా ఐపీఎల్ లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ సాధించిన ప్లేయర్ గా హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డుల్లో చేరింది. హేలీ మాథ్యూస్‌ (31 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), అమేలియా కెర్‌ (24 బంతుల్లో 45 నాటౌట్‌; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌) చెలరేగిపోతే.. మిడిలార్డర్ బ్యాటర్లు బ్రంట్‌ (23; 5 ఫోర్లు), పూజ వస్ర్తాకర్‌ (15; 3 ఫోర్లు) కూడా వీరవిహారం చేయటంతో ముంబై రికార్డుస్థాయిలో తొలిమ్యాచ్ లోనే 207 పరుగుల భారీస్కోరు నమోదు చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో స్నేహ్‌ రాణా 2 వికెట్లు సాధించింది.

గుజరాత్ 64 పరుగులకే ప్యాకప్...

అనంతరం 208 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన గుజరాత్‌ కేవలం 15.1 ఓవర్లలో 64 పరుగులకే కుప్పకూలిపోయింది. కెప్టెన్ బెత్ మూనీ మూడవ బంతికే గాయంతో ఆట నుంచి ఉపసంహరించుకోడంతోనే గుజరాత్ పతనం ప్రారంభమయ్యింది.

డైలాన్ హేమలత మాత్రమే 29 నాటౌట్‌; ఒక ఫోర్‌, 2 సిక్సర్లు తో 29 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది.ముంబై బౌల‌ర‌ల్లో సాయిక ఇష‌క్ నాలుగు, అమేలియా, నాట్ సీవ‌ర్ బ్రంట్ త‌లా రెండు వికెట్లు తీశారు. ఇసీ వాంగ్‌కు ఒక వికెట్ ద‌క్కింది.

ముంబై 143 పరుగుల రికార్డు విజయం సాధించడంలో ప్రధానపాత్ర వహించిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా ఈరోజు జరిగే పోరులో..రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది, ముంబై బ్రబోర్న్ స్టేడియం వేదికగా రాత్రి 7-30కి ఈ పోరు ప్రారంభంకానుంది.

First Published:  5 March 2023 5:01 AM GMT
Next Story