Telugu Global
Sports

ఒక్క గెలుపుతో ముంబై రికార్డుల మోత!

ఐపీఎల్ -17వ సీజన్లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. పరాజయాల హ్యాట్రిక్ తరువాత తొలివిజయం నమోదు చేసింది.

ఒక్క గెలుపుతో ముంబై రికార్డుల మోత!
X

ఐపీఎల్ -17వ సీజన్లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. పరాజయాల హ్యాట్రిక్ తరువాత తొలివిజయం నమోదు చేసింది.

ఐదుసార్లు ఐపీఎల్ విన్నర్ ముంబై ఇండియన్స్ ప్రస్తుత 2024 సీజన్ లీగ్ లో తొలి గెలుపు కోసం నాలుగుమ్యాచ్ లు ఆడాల్సి వచ్చింది. ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా నాయకత్వంలో తొలి టైటిల్ వేటకు దిగిన ముంబైకి మొదటి మూడురౌండ్లలోనూ ఘోరపరాజయాలు ఎదురయ్యాయి. అయితే..హోంగ్రౌండ్ వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన 4వ రౌండ్ మ్యాచ్ లో 29 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్ ను అధిగమించడం ద్వారా ఊపిరిపీల్చుకోగలిగింది.

ముంబై భారీస్కోరు....

ఈ కీలక పోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 235 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. మొత్తం బ్యాటింగ్ ఆర్డర్లో ఒక్క ఆటగాడు అర్థసెంచరీ సాధించకుండానే ముంబై 235 పరుగుల స్కోరు సాధించడం ద్వారా అరుదైన రికార్డు నమోదు చేయగలిగింది.

టీ-20 చరిత్రలో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ లేకుండా 235 పరుగులు చేసిన తొలి, ఏకైకజట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది.

ఆఖరి ఓవర్లో రొమారియో దంచుడు....

ముంబై ఇన్నింగ్స్ చివరి ( 20వ ) ఓవర్లో బ్యాటింగ్ కు దిగిన ఆల్ రౌండర్ రొమారియో షెఫర్డ్ వీరవిహారం చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చి వేశాడు. ఫాస్ట్ బౌలర్ నోర్గే బౌలింగ్ లో ..రొమారియో ఆఖరి ఆరు బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 32 పరుగులు దండుకొన్నాడు. దీంతో ముంబై ప్రత్యర్థి ఎదుట 236 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచగలిగింది.

ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ 49, ఇషాన్ కిషన్ 42, హార్థిక్ పాండ్యా 39 పరుగులకు అవుట్ కాగా..టిమ్ డేవిడ్ 45, రొమారియో షెఫర్డ్ 39 పరుగుల నాటౌట్ స్కోర్లు సాధించారు.

రొమారియో 10 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 39 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా 390.00 స్ట్ర్రయిక్ రేట్ తో మరో రికార్డు నెలకొల్పాడు. 2008 నుంచి జరుగుతున్న గత 17 సీజన్లలో అత్యధిక స్ట్ర్రయిక్ రేట్ నమోదు చేసిన బ్యాటర్ రొమారియో షెఫర్డ్ మాత్రమే కావటం విశేషం. ఇప్పటి వరకూ పాట్ కమిన్స్ పేరుతో ఉన్న 373.33 స్ట్ర్రయిక్ రేట్ రికార్డును రొమారియో అధిగమించాడు.

ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, నోర్జే చెరో 2 వికెట్లు, ఖలీల్ అహ్మద్ 1 వికెట్ పడగొట్టారు.

పృథ్వీజోరుకు బుమ్రా బ్రేక్...

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 236 పరుగుల భారీస్కోరు చేయాల్సిన ఢిల్లీ క్యాపిటల్స్ ను కీలక సమయంలో ముంబై తురుపుముక్క జస్ ప్రీత్ బుమ్రా కోలుకోలేని దెబ్బ కొట్ట్టి మ్యాచ్ ను మలుపు తిప్పాడు.

సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 10 పరుగులకే అవుటైనా..యువఓపెనర్ పృథ్వీ షా ( 40 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో ) 66 పరుగుల స్కోరుతో దూకుడుమీదున్న తరుణంలో ..ఆట 12వ ఓవర్లో బుమ్రా ఓ సూపర్ యార్కర్ తో పడగొట్టడంతో ముంబై పట్టు బిగించగలిగింది.

వన్ డౌన్ అభిషేక్ పోరెల్ 41, యువహిట్టర్ ట్రిస్టాన్ స్టబ్స్ 25 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 71 పరుగుల నాటౌట్ స్కోరు సాధించినా ప్రయోజనం లేకపోయింది.

ముంబై 29 పరుగులతో ప్రస్తుత సీజన్లో తొలివిజయం నమోదు చేయగలిగింది. ముంబై బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు, కొట్జే 4 వికెట్లు, షెఫర్డ్ 1 వికెట్ పడగొట్టారు.

200కు పైగా స్కోర్లు సాధించిన సమయంలో ముంబై ఇప్పటి వరకూ 14కు 14 మ్యాచ్ ల్లోనూ అజేయంగా నిలవడం విశేషం. 200కు పైగా స్కోర్లను ముంబై విజయవంతంగా కాపాడుకోగలిగింది.

హోంగ్రౌండ్లో ముంబై 50వ గెలుపు...

హోంగ్రౌండ్ వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ కి ఇది 50వ గెలుపు కావడం విశేషం. ఈ విజయంతో హౌంగ్రౌండ్లో అత్యధిక విజయాలు సాధించిన తొలిజట్టుగా ముంబై రికార్డు నెలకొల్పింది.

కోల్ కతా నైట్ రైడర్స్ తన హోంగ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ లో 48, చైపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ 47 విజయాల రికార్డుతో ఆ తర్వాతి స్థానాలలో ఉన్నాయి. అంతేకాదు...ఐపీఎల్ చరిత్రలోనే 150 విజయాలు సాధించిన తొలిజట్టు ఘనతను సైతం ముంబై దక్కించుకొంది.

టీ-20 చరిత్రలో ముంబై 150 విజయాలు, చెన్నై 148, టీమిండియా 144, లాంకాషైర్ 143, నాటింగ్ హామ్ షైర్ 143 విజయాల రికార్డులతో ఉన్నాయి.

రోహిత్ , బుమ్రా రికార్డులు...

ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ ద్వారా ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ, ఓపెనింగ్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా సైతం వ్యక్తిగతంగా రికార్డులు సాధించారు.

ఢిల్లీ బ్యాటర్ జే రిచర్డ్ సన్ ఇచ్చిన క్యాచ్ ను అందుకోడం ద్వారా రోహిత్ శర్మ 100 ఐపీఎల్ క్యాచ్ లు పట్టిన ఫీల్డర్ల క్లబ్ లో చేరాడు. విరాట్ కొహ్లీ 110, సురేశ్ రైనా 109, కిరాన్ పోలార్డ్ 103 క్యాచ్ లతో మొదటి మూడుస్థానాలలో ఉంటే..రోహిత్ 100 క్యాచ్ లతో 4వ స్థానంలో నిలిచాడు.

బుమ్రా తన కోటా 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టడం ద్వారా ఒకే ఫ్రాంచైజీ తరపున 150 వికెట్లు సాధించిన 3వ బౌలర్ గా రికార్డుల్లో చేరాడు.

లాసిత్ మలింగ 170, సునీల్ నరైన్ 166 వికెట్లతో మొదటి రెండు స్థానాలలో ఉంటే..బుమ్రా 150 వికెట్లతో మూడోవస్థానంలో కొనసాగుతున్నాడు.

First Published:  8 April 2024 7:32 AM GMT
Next Story