Telugu Global
Sports

ధోనీ..గవాస్కర్..ఓ అరుదైన ఆటోగ్రాఫ్!

వేలమంది అభిమానులకు ఆటోగ్రాఫ్ లు ఇచ్చిన ఓ దిగ్గజ క్రికెటర్ తానే ఓ అభిమానిగా మారి ఆటోగ్రాఫ్ అడిగిన అరుదైన సంఘటన చెన్నై చెపాక్ స్టేడియంలో చోటు చేసుకొంది.

MS Dhoni signs autograph on Sunil Gavaskar
X

ధోనీ..గవాస్కర్..ఓ అరుదైన ఆటోగ్రాఫ్!

వేలమంది అభిమానులకు ఆటోగ్రాఫ్ లు ఇచ్చిన ఓ దిగ్గజ క్రికెటర్ తానే ఓ అభిమానిగా మారి ఆటోగ్రాఫ్ అడిగిన అరుదైన సంఘటన చెన్నై చెపాక్ స్టేడియంలో చోటు చేసుకొంది.....

సునీల్ మనోహర్ గవాస్కర్..1970 దశకంలో ప్రపంచ క్రికెట్ అత్యుత్తమ ఓపెనర్లలో ఒకరు.టెస్టు క్రికెట్లో ఎన్నో అరుదైన రికార్డులు నెలకొల్పిన దిగ్గజం ఆయన.

తన కెరియర్ లో ప్రపంచ వ్యాప్తంగా వేలాదిమంది అభిమానులకు ఆటోగ్రాఫ్ లు ఇచ్చిన ఘనుడు గవాస్కర్. రిటైర్మెంట్ తర్వాత కామెంటీటర్ గా, విమర్శుకుడిగా, విశ్లేషకుడుగా గుర్తింపు పొందిన సునీల్ గవాస్కర్ ఇప్పుడు ఓ అభిమానిగా మారిపోయారు. తాను ఎంతగానో ఇష్టపడే, అభిమానించే క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీనే ఆటోగ్రాఫ్ ఇవ్వమంటూ కోరిన సంఘటన చెన్నై చెపాక్ స్టేడియంలో చోటు చేసుకొంది.



చెన్నై 'సూపర్ 'షో...

ఐపీఎల్ -16వ సీజన్ లీగ్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన 13వ రౌండ్ మ్యాచ్ సందర్భంగా...చెన్నై కెప్టెన్ ధోనీని ఆటోగ్రాఫ్ ఇవ్వమంటూ కోరారు.

మూడేళ్ల విరామం తర్వాత చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా సూపర్ కింగ్స్ జట్టు తన ఐపీఎల్ మ్యాచ్ లు ఆడింది. అంతేకాదు..మొత్తం ఏడుమ్యాచ్ లను విజయంవంతంగా ఆడిన అనంతరం అభిమానులకు అభివాదం చేస్తూ కెప్టెన్ ధోనీ నాయకత్వంలోని సూపర్ కింగ్స్ ఆటగాళ్లంతా స్టేడియం చుట్టూ తిరిగారు.

ఆ సమయంలో ధోనీని గవాస్కర్ ఆటోగ్రాఫ్ కోరారు. ప్రస్తుత ఐపీఎల్ లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గవాస్కర్ తాను ధరించిన షర్టు ( చాతీ ఎడమ ) పై భాగంలో ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకొన్నారు.

వందేళ్లకు ఓ ఆటగాడు ధోనీ...

భారత క్రికెట్ కు, ఐపీఎల్ కు గత 16 సంవత్సరాలుగా అసమాన సేవలు అందిస్తున్న మహేంద్రసింగ్ ధోనీ లాంటి అరుదైన ఆటగాళ్లు వందేళ్లకు ఒక్కరు చొప్పున మాత్రమే వస్తూ ఉంటారని గవాస్కర్ కొనియాడారు. ధోనీ ఇప్పుడే ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించకుండా మరో ఏడాది పాటు ఆడితే ఐపీఎల్ ఖ్యాతి మరింతగా పెరుగుతుందని చెప్పారు.

2008 ప్రారంభ ఐపీఎల్ నుంచి ప్రస్తుత 16వ సీజన్ లీగ్ వరకూ చెన్నై జట్టుకు నాయకుడిగా, వికెట్ కీపర్ బ్యాటర్ గా, గొప్ప ఫినిషర్ గా ఎన్నో అద్భుత విజయాలు అందించిన రికార్డు ధోనీకి ఉంది. చెన్నైజట్టును నాలుగుసార్లు విజేతగా నిలిపిన మొనగాడు ధోనీ.

ధోనీ రిటైర్మెంట్ పై పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నా..ప్రచారం జరుగుతున్నా మరో ఏడాదిపాటు కొనసాగితే ఐపీఎల్ కు జరిగే మేలు అంతాఇంతాకాదని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.

ఇంపాక్ట్ ప్లేయర్ మహేంద్రసింగ్ ధోనీ..

క్రికెట్లోకి ఎందరో ఆటగాళ్లు వస్తూ పోతూ ఉంటారని..అయితే పలువిధాలుగా ప్రభావం చూపే ఆటగాళ్లు వందేళ్లకు ఒక్కరు మాత్రమే ఉంటారని..అలాంటి క్రికెటరే ధోనీ అంటూ..ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటీటర్ కెవిన్ పీటర్సన్ కితాబిచ్చారు.

భారత క్రికెట్ పైన తరాల తరబడి ధోనీ ప్రభావం కనపడి తీరుతుందని చెప్పారు. ధోనీ మరో ఏడాదిపాటు తన ఐపీఎల్ కెరియర్ ను పొడిగించుకోక తప్పదని తేల్చి చెప్పారు.

ప్రస్తుత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకూ ఆడిన 13 రౌండ్ల మ్యాచ్ ల్లో 7 విజయాలు, 5 పరాజయాలతో 15 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ రెండోస్థానంలో కొనసాగుతోంది. ఆఖరిరౌండ్ మ్యాచ్ లో నెగ్గడం ద్వారా ప్లే-ఆఫ్ రౌండ్ చేరాలన్న పట్టుదలతో ఉంది.

న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈనెల 20న జరిగే తన లీగ్ ఆఖరిమ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది.

First Published:  15 May 2023 8:10 AM GMT
Next Story