Telugu Global
Sports

తీరు మార్చుకోక‌పోతే కెప్టెన్‌గా త‌ప్పుకుంటా.. బౌల‌ర్ల‌కు ధోనీ వార్నింగ్‌

ఈ మ్యాచ్‌లో సీఎస్కే బౌల‌ర్లు మొత్తం 18 ఎక్స్‌ట్రాలు ఇచ్చారు. అందులో 13 వైడ్‌లు, 3 నోబాల్స్‌, 3 లెగ్ బైస్‌ ఉన్నాయి. అంత‌కుముందు గుజ‌రాత్‌తో ఆడిన మ్యాచ్‌లోనూ చెన్నై బౌల‌ర్లు 12 ఎక్స్‌ట్రాలు ఇచ్చారు.

తీరు మార్చుకోక‌పోతే కెప్టెన్‌గా త‌ప్పుకుంటా.. బౌల‌ర్ల‌కు ధోనీ వార్నింగ్‌
X

ఐపీఎల్ సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) జ‌ట్టు బౌల‌ర్ల బౌలింగ్ తీరుపై మ‌హేంద్ర సింగ్ ధోనీ తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. వారి తీరు మార‌క‌పోతే తాను జ‌ట్టు కెప్టెన్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటాన‌ని హెచ్చ‌రించాడు. సీఎస్‌కే జ‌ట్టు కెప్టెన్ ధోనీ.. సోమ‌వారం ఎల్ఎస్‌జీ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్ అనంత‌రం పైవిధంగా స్పందించాడు.

ధోనీ స్పంద‌న‌కు ప్ర‌ధాన కార‌ణం.. ఆ జ‌ట్టు బౌల‌ర్లు ఎక్స్‌ట్రా ప‌రుగులు ఎక్కువ‌గా ఇవ్వ‌డ‌మే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 217 ప‌రుగుల భారీ స్కోరు సాధించింది. అయినా ఎల్ఎస్‌జీ వారికి దీటుగా పోరాడింది. అయినా చివ‌రికి 12 ప‌రుగుల తేడాతో చెన్నై ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించింది.

ఈ మ్యాచ్‌లో సీఎస్కే బౌల‌ర్లు మొత్తం 18 ఎక్స్‌ట్రాలు ఇచ్చారు. అందులో 13 వైడ్‌లు, 3 నోబాల్స్‌, 3 లెగ్ బైస్‌ ఉన్నాయి. అంత‌కుముందు గుజ‌రాత్‌తో ఆడిన మ్యాచ్‌లోనూ చెన్నై బౌల‌ర్లు 12 ఎక్స్‌ట్రాలు ఇచ్చారు. అందులో 4 వైడ్‌లు, 2 నోబాల్స్‌, 6 లెగ్ బైస్ ఉన్నాయి. ఆ మ్యాచ్‌లో చెన్నై ఓట‌మి చెందింది.

ఈ నేప‌థ్యంలో ఎల్ఎస్‌జీతో మ్యాచ్ అనంత‌రం ధోనీ స్పందిస్తూ.. ఫాస్ట్ బౌలింగ్‌ను మెరుగుప‌రుచుకోవాల‌ని, ప‌రిస్థితుల‌కు అనుగుణంగా బౌలింగ్ చేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని స్ప‌ష్టం చేశాడు. ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్లు ఏం చేస్తున్నారో కూడా గ‌మ‌నించ‌డం చాలా ముఖ్య‌మ‌ని చెప్పాడు. వీట‌న్నింటికంటే ప్ర‌ధానంగా.. బౌల‌ర్లు నోబాల్స్, వైడ్‌లు త‌గ్గించుకోవాల‌ని సూచించాడు. ఈ మ్యాచ్‌లో తాము అద‌న‌పు ప‌రుగులు ఇచ్చామ‌ని, వాటిని త‌గ్గించుకోవాల‌ని చెప్పాడు. లేదంటే కొత్త కెప్టెన్ కింద ఆడాల్సి ఉంటుంద‌ని తేల్చి చెప్పాడు. ఇది త‌న రెండో వార్నింగ్ అని, ఇక‌పై మ‌రోసారి జ‌రిగితే తాను కెప్టెన్సీ నుంచి వైదొలుగుతాన‌ని స్ప‌ష్టం చేశాడు.

First Published:  4 April 2023 9:39 AM GMT
Next Story