Telugu Global
Sports

అత్యధిక విజయాలతో భారత్ రికార్డు!

ప్రపంచ క్రికెట్లో భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఏడాదికాలంలో అత్యదిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది.

అత్యధిక విజయాలతో భారత్ రికార్డు!
X

ప్రపంచ క్రికెట్లో భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఏడాదికాలంలో అత్యదిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఆస్ట్ర్రేలియా పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును తిరగరాసింది....

అంతర్జాతీయ క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ జట్టు భారత్ సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది. ఆస్ట్ర్రేలియా పేరిట గత 19 సంవత్సరాలుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును రాహుల్ ద్రావిడ్ ప్రధాన శిక్షకుడిగా, రోహిత్ శర్మ కెప్టెన్ గా అధిగమించింది. క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ ఏడాదికాలంలో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది.

2003లో ఆస్ట్ర్రేలియా, 2022లో భారత్...

ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో విజేతగా నిలిచిన జట్టుగా గత 19 సంవత్సరాలుగా ఆస్ట్ర్రేలియా ఉంటే...2022 క్యాలెండర్ ఇయర్ లో మాత్రం భారతజట్టు ఆ రికార్డును తిరగరాసింది.

2003 క్యాలెండర్‌ ఇయర్‌లో ఆస్ట్ర్లేలియా మొత్తం 47 మ్యాచ్‌లు ఆడి 38 మ్యాచ్‌ల్లో విజేతగా నిలవడం ద్వారా అత్యంత విజయవంతమైన జట్టుగా ప్రపంచ రికార్డు నమోదు చేసింది. 2003 నుంచి ఆస్ట్ర్రేలియా పేరుతోనే ప్రపంచరికార్డు కొనసాగుతూ వస్తోంది.

2022 టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 ప్రారంభమ్యాచ్ లో పాకిస్థాన్ ను 4 వికెట్ల తేడాతో ఓడించడం ద్వారా భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. టెస్టులు, వన్డేలు, టీ-20 లు కలసి మొత్తం 56 మ్యాచ్‌లు ఆడిన భారత్ 39 విజయాలతో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది.

2022 సీజన్ ప్రారంభంలో స్వదేశంలో వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు.. రెండు సిరీస్‌లలోనూ ఆ టీమ్‌ను 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఆ తర్వాత సొంతగడ్డపైనే శ్రీలంక జట్టుతో మూడు టీ-20 మ్యాచ్‌లు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారతజట్టు‌.. ఆ రెండు సిరీస్‌లను కూడా వరుసగా 3-0, 2-0తో గెలుచుకుంది. అలా ఇప్పటివరకు వరుస విజయాలు సాధిస్తూ తన విజయపరంపరను కొనసాగిస్తూ వస్తోంది.

ద్రావిడ్ ను మించిన విరాట్ కొహ్లీ...

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆరో బ్యాటర్‌గా విరాట్ కొహ్లీ నిలిచాడు. ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్లో పాకిస్థాన్ తో జరిగిన పోరులో 82 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా విరాట్ కొహ్లీ 6వ స్థానంలో నిలిచాడు.

విరాట్ కోహ్లీ మొత్తం 528 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 53.80 సగటుతో 24 వేల212 పరుగులు సాధించాడు. 71 సెంచరీలు, 126 హాఫ్‌ సెంచరీలతో ఈ ఘనతను సొంతం చేసుకోగలిగాడు. అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 254 నాటౌట్‌.

ఇక రాహుల్ ద్రావిడ్‌ మొత్తం 509 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లో 45.41 సగటుతో 24,208 పరుగులు సాధించాడు. అందులో 48 సెంచరీలు, 146 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 270 పరుగులు.

ఆల్ టైమ్ గ్రేట్ మాస్టర్ సచిన్...

అంతర్జాతీయక్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన మొనగాడిగా మాస్టర్ సచిన్ కొనసాగుతున్నాడు. తన 22 సంవత్సరాల కెరియర్ లో సచిన్ మొత్తం 34 వేల357 పరుగులతో టాపర్ గా ఉన్నాడు.

శ్రీలంక వికెట్ కీపర్‌-బ్యాటర్‌ కుమార సంగక్కర (28,016), ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ (27,483), శ్రీలంకకు మాజీ కెప్టెన్ మహేల జయవర్దనే (25,957), దక్షిణాఫ్రికా ఆల్‌ రౌండర్‌ జాక్వెస్‌ కలిస్‌ (25,534) 2 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు.

మాస్టర్ సచిన్ రికార్డును చేరుకోవాలంటే విరాట్ మరో ఐదుగురిని దాటుకుంటూ పోవాల్సి ఉంది. మరో పదేళ్లపాటు విరాట్ అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగితే సచిన్ రికార్డును అధిగమించడం ఏమంత కష్టంకాబోదు.

First Published:  25 Oct 2022 5:40 AM GMT
Next Story