Telugu Global
Sports

సిక్సర్ల బాదుడులో రోహిత్ ప్రపంచ రికార్డు!

భారత క్రికెట్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సొంతగడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన మొనగాడిగా నిలిచాడు.

సిక్సర్ల బాదుడులో రోహిత్ ప్రపంచ రికార్డు!
X

సిక్సర్ల బాదుడులో రోహిత్ ప్రపంచ రికార్డు!

భారత క్రికెట్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సొంతగడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన మొనగాడిగా నిలిచాడు...

ప్రపంచకప్ కు సన్నాహకంగా ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియాతో ముగిసిన తీన్నార్ వన్డే సిరీస్ ను ఆతిథ్య భారత్ 2-1తో కైవసం చేసుకొంది. రాజ్ కోట్ వేదికగా ముగిసిన ఆఖరివన్డేలో 353 పరుగుల భారీలక్ష్యాన్ని చేరుకోడంలో విఫలమైన భారత్ 66 పరుగులతో ఓడినా..పలు అరుదైన రికార్డులను మాత్రం సొంతం చేసుకోగలిగింది.

సూపర్ ఫామ్ లో ఉన్న యువఓపెనర్ శుభ్ మన్ గిల్, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, వైస్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా, మిడిలార్డర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, స్పిన్ జాదూ అశ్విన్ లకు విశ్రాంతి నిచ్చి భారత్ పరాజయం మూటగట్టుకొంది. సిరీస్ స్వీప్ సాధించడంలో విఫలమయ్యింది.

1986 నుంచి 7వ సిరీస్ గెలుపు...

ఐదుసార్లు వన్డే ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా 1986 నుంచి భారత్ కు ఇది 7వ సిరీస్ విజయం కావడం విశేషం. 1986లో 6 మ్యాచ్ ల సిరీస్ ను 3-2తో నెగ్గిన భారత్ 2010లో మూడుమ్యాచ్ ల సిరీస్ ను 1-0తోనూ, 2013లో 7 మ్యాచ్ ల సిరీస్ ను 3-2తోనూ, 2017లో 5 మ్యాచ్ ల సిరీస్ ను 4-1తోనూ2019 సిరీస్ ను 2-1తోనూ గెలుచుకొంది. ప్రస్తుత 2023 సిరీస్ ను సైతం భారత్ 2-1తోనే గెలుచుకోగలిగింది.

హిట్ మ్యాన్ సూపర్ హిట్....

ప్రస్తుత సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ లకూ దూరంగా ఉన్న రోహిత్ శర్మ..రాజ్ కోట వేదికగా ముగిసిన ఆఖరి వన్డేలో సైతం తన జోరు కొనసాగించాడు. 353 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్ కు దిగిన తనజట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే..మిడిలార్డర్ వైఫల్యంతో భారత్ 49.4 ఓవర్లలో 286 పరుగులకే కుప్పకూలింది.

కేవలం 57 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఈ క్రమంలో స్వదేశీ వన్డే సిరీస్ ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఓపెనర్ గా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కంగారూ ఫాస్ట్ బౌలర్ల త్రయం మిషెల్ స్టార్క్, జోష్ హేజిల్ వుడ్, పాట్ కమిన్స్ లను అలవోకగా ఎదుర్కొని రోహిత్ తనదైన శైలిలో ఎడాపెడా సిక్సర్లు బాదాడు.

ఇప్పటి వరకూ న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ పేరుతో ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును రోహిత్ తెరమరుగు చేశాడు. కివీ గడ్డపై అత్యధికంగా 256 సిక్సర్లు బాదిన మార్టిన్ గప్టిల్ రికార్డును రోహిత్ 256 సిక్సర్లతో అధిగమించాడు. కివీ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ సొంత గడ్డపై 230 సిక్సర్లు బాదడం ద్వారా ఆల్ టైమ్ గ్రేట్ల వరుస మూడోస్థానంలో నిలిచాడు.

550 సిక్సర్ల క్లబ్ లో రోహిత్...

అంతర్జాతీయ క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ కలిపి 550కి పైగా సిక్సర్లు బాదిన బ్యాటర్ల క్లబ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ చేరాడు. 553 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న కరీబియన్ హిట్టర్ క్రిస్ గేల్ కు రోహిత్ చేరువయ్యాడు.

ప్రస్తుత సిరీస్ లోని ఆఖరివన్డేలో ఆస్ట్ర్రేలియాపై సాధించిన 6 సిక్సర్లతో రోహిత్ అంతర్జాతీయ సిక్సర్ల సంఖ్య 551కి చేరింది.

సెంచరీలేని చివరి వన్డే....

రాజ్ కోట సౌరాష్ట్ర్ర క్రికెట్ స్టేడియం వేదికగా ముగిసిన ప్రస్తుత సిరీస్ లోని ఆఖరి వన్డేలో మరో అరుదైన రికార్డు నమోదయ్యింది. రెండుజట్ల బ్యాటర్లు కలిపి 638 పరుగులు స్కోరు సాధించినా..కనీసం ఒక్కరూ మూడంకెల స్కోరును చేరుకోలేకపోయారు.

ఆస్ట్ర్రేలియా ఓపెనర్ మిషెల్ మార్ష్ 96, వన్ డౌన్ స్టీవ్ స్మిత్ 74, రెండోడౌన్ లబుషేన్ 72 పరుగులు సాధించినా, భారత కెప్టెన్ రోహిత్ శర్మ 81, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ 56 పరుగులు సాధించినా మూడంకెల స్కోర్లుగా మలచుకోలేకపోయారు.

కనీసం ఒక్క సెంచరీ లేకుండా ముగిసిన ఆరవ భారీస్కోరింగ్ మ్యాచ్ గా ఇది రికార్డుల్లో చేరింది. 2021 సిరీస్ లో భాగంగా పూణే వేదికగా ఇంగ్లండ్- భారత్ జట్ల మధ్య ముగిసిన మ్యాచ్ లో 651 పరుగులు, 2020లో రాజ్ కోట వేదికగానే ఆస్ట్ర్రేలియా- భారత్ జట్ల పోరులో 644, 2013లో ఇంగ్లండ్- భారతజట్ల పోరులో 641 పరుగుల స్కోర్లు నమోదైనా..కనీసం ఒక్కరూ శతకం బాదలేకపోయారు.

కేవలం..రాజ్ కోట స్టేడియంలో మాత్రమే మూడుసార్లు జరిగిన భారీస్కోరింగ్ మ్యాచ్ ల్లో..రెండుజట్ల తరపునా సెంచరీ నమోదు కాకుండా పోయింది.

First Published:  28 Sep 2023 2:30 AM GMT
Next Story