Telugu Global
Sports

ప్రపంచకప్ లో మొరాకో సరికొత్త చరిత్ర!

ప్రపంచకప్ లో మొరాకో సరికొత్త చరిత్ర!
X

ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ క్వార్టర్ ఫైనల్స్ చేరడం ద్వారా మొరాకో సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రీ-క్వార్టర్స్ లో స్పెయిన్ పై సంచలన విజయంతో విజేతగా నిలిచింది. ఈ ఘనత సాధించిన నాలుగో ఆఫ్రికాఖండ దేశంగా నిలిచింది.

సంచలనాలు, అనూహ్యఫలితాలతో సాగిపోతున్న 2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ ఆఖరి ప్రీ- క్వార్టర్ ఫైనల్ పోరులో సైతం మరో అద్భుతం చోటు చేసుకొంది.

ఆఫ్రికా జోన్ నుంచి ప్రపంచకప్ ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించిన మొరాకో ఏకంగా క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకొంది. ఆఖరి ప్రీ- క్వార్టర్ ఫైనల్ రౌండ్లో ప్రపంచ మాజీ చాంపియన్స్పె యిన్ పై సంచలన విజయం నమోదు చేసింది.

గ్రూపులీగ్ దశ నుంచి మెరుపు విజయాలతో దూసుకొచ్చిన మొరాకో నాకౌట్ రౌండ్లోనూ అదే దూకుడు కొనసాగించింది.

పెనాల్టీ షూటౌట్లో స్పెయిన్ అవుట్..

స్పెయిన్- మొరాకోజట్ల పోరు నువ్వానేనా అన్నట్లుగా సాగింది. బంతిని అధికభాగం స్పెయిన్ జట్టే తన అదుపులో ఉంచుకోడం ద్వారా మిడ్ ఫీల్డ్ లో ఆధిపత్యం చెలాయించినా గోల్స్ సాధించలేకపోయింది. మరోవైపు తనకు లభించిన పరిమిత అవకాశాలలోనే మొరాకో దూకుడుగా ఆడుతూ స్పానిష్ గోల్ పై ఒత్తిడి పెంచింది.

ఆట నిర్ణితసమయంలో ఏజట్టూ గోలు చేయలేకపోడంతో 0-0తో ముగిసింది. దీంతో ఎక్స్ ట్రా టైమ్ కు ఆటను పొడిగించారు.

అదనపు సమయంలో స్పెయిన్ జోరు పెంచినా..మొరాకో గోల్ కీపర్ గోడలా అడ్డుకొని నిలువరించాడు. ఎక్స్ ట్రా టైమ్ ముగిసే క్షణాలలో మొరాకో మరింత జాగ్రత్త ఆడి..మ్యాచ్ ను పెనాల్టీ షూటౌట్ కు తీసుకెళ్లగలిగింది.

స్పెయిన్..ఇంత బతుకూ బతికీ..

ప్రపంచకప్ సన్నాహాలలో భాగంగా స్పెయిన్ కు చెందిన ఒక్కో ఆటగాడు వెయ్యికి పైగా పెనాల్టీలు చొప్పున సాధన చేసినట్లుగా స్పానిష్ కోచ్ లూయిస్ ఎన్రికో చెబుతూ వచ్చారు. అయితే..ఇంతగా సాధన చేసిన స్పెయిన్ జట్టు చివరకు మొరాకో చేతిలో పెనాల్టీ షూటౌట్లోనే ఘోరపరాజయం చవిచూడాల్సి వచ్చింది. మూడుకు మూడు పెనాల్టీలను గోల్స్ గా మలచుకోడంలో విఫలమయ్యింది.

ప్యాబ్లో సారాబియా, కార్లోస్ సోలెర్, సెర్గియో బుస్కెటా తమ పెనాల్టీలను సద్వినియోగం చేయలేక చేతులెత్తేశారు. మరోవైపు మొరాకో మూడుకు మూడు పెనాల్టీలను గోల్స్ గా మలచుకొని 3-0తో విజేతగా నిలిచింది. మొరాకో ఆఖరి పెనాల్టీని హకీమ్ గోల్ గా మలచడంతో మొరాకో కు క్వార్టర్ ఫైనల్స్ బెర్త్ ఖాయమైపోయింది.

ఈ ఓటమితో 2010 ప్రపంచ విజేత స్పెయిన్ ప్రీ-క్వార్టర్ ఫైనల్ రౌండ్ నుంచే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది.

1986 ప్రపంచకప్ లో ప్రీ- క్వార్టర్ ఫైనల్ రౌండ్ చేరిన మొరాకో..ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ చేరడం ద్వారా తన రికార్డును మెరుగుపరచుకోగలిగింది. ప్రపంచకప్ ఫుట్ బాల్ చరిత్రలో క్వార్టర్ ఫైనల్ చేరిన నాలుగో ఆఫ్రికాఖండ దేశంగా చరిత్ర సృష్టించింది.

అంతేకాదు..అరబ్ గడ్డపై తొలిసారిగా జరుగుతున్న ప్రపంచకప్ ఫుట్ బాల్ క్వార్టర్ ఫైనల్ రౌండ్లో మిగిలిన ఏకైకజట్టు మొరాకో మాత్రమే కావడంతో వేలాదిమంది గల్ఫ్ దేశాల అభిమానులు అండగా ఉంటూ ప్రోత్సహిస్తున్నారు.

సెమీఫైనల్లో చోటు కోసం జరిగే క్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్ తో మొరాకో అమీతుమీ తేల్చుకోనుంది.


First Published:  7 Dec 2022 5:18 AM GMT
Next Story