Telugu Global
Sports

గంగూలీ హయాంలో బీసీసీఐకి డబ్బేడబ్బు!

సౌరవ్ గంగూలీ బీసీసీఐ చైర్మన్ గా పనిచేసిన కాలంలో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది

గంగూలీ హయాంలో బీసీసీఐకి డబ్బేడబ్బు!
X

సౌరవ్ గంగూలీ బీసీసీఐ చైర్మన్ గా పనిచేసిన కాలంలో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. మూడేళ్లకాలంలో 3600 కోట్ల నుంచి 9వేల 600 కోట్లకు పెరిగినట్లు గత కార్యవర్గంలోని కోశాధికారి అరుణ్ ధుమాల్ ప్రకటించారు...

క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు ఏదంటే భారత క్రికెట్ నియంత్రణమండలి( బీసీసీఐ ) అని మాత్రమే చెప్పాలి. ఐపీఎల్ పుణమ్యా అంటూ బీసీసీఐ ఆదాయం గత 15 సంవత్సరాలుగా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతూ వస్తోంది.

క్రికెట్ కు అతిపెద్ద గ్లోబల్ మార్కెట్....

క్రికెట్ కే అతిపెద్ద గ్లోబల్ మార్కెట్ గా గుర్తింపు పొందిన భారతచుట్టూనే అంతర్జాతీయ క్రికెట్ పరిభ్రమిస్తూ ఉంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్వహించే ప్రతిమూడు ప్రపంచకప్ టోర్నీలలో ఒకటి భారత్ వేదికగానే జరుగుతూ వస్తోంది.

భారత్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్నాయంటే చాలు స్టేడియాలు కిటకిటలాడిపోడం, ప్రత్యక్షప్రసారాల వీక్షణకోసం టీవీల ముందు కోట్లాదిమంది గుమికూడడం సాధారణ విషయమే.

క్రికెట్ పిచ్చి అంతా ఇంతాకాదు..

ప్రపంచంలో ఎక్కువమంది క్రికెట్ అభిమానులు ( పిచ్చోళ్లు ) ఎక్కువగా ఉన్న దేశం భారత్ మాత్రమే. ఆరేళ్ల పిల్లల నుంచి ఆరుపదుల పెద్దల వరకూ క్రికెట్ కు వీరాభిమానులే. దేశంలో ఎన్నిరకాల క్రీడలున్నా క్రికెట్ కు ఉన్న ఆదరణ అంతాఇంతాకాదు. 2008 ఇండియన్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ ప్రారంభంతో బీసీసీఐ దశ తిరిగిపోయింది.

ఫ్రాంచైజీ క్రికెట్ తో వివిధ రూపాలలో ఏటా కాసులవర్షం కురువడం ఆరంభమయ్యింది. దీంతో ...దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రతిభవంతులైన యువక్రికెటర్లు సైతం..ఐపీఎల్ పుణ్యమా అంటూ రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తుతూ వస్తున్నారు.

ఆస్ట్ర్రేలియా వేదికగా జరుగుతున్న ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ లో పాల్గొంటున్న భారతజట్టులోని ఆటగాళ్లంతా కోటీశ్వరులే.

2019 సీజన్ నాటికి 3648 కోట్ల రూపాయలుగా ఉన్న బీసీసీఐ ఆదాయం...సౌరవ్ గంగూలీ అధ్యక్షుడిగా,జే షా కార్యదర్శిగా, అరుణ్ ధుమాల్ కోశాధికారిగా గత మూడేళ్లకాలంలో 300 శాతం పెరిగిపోయింది.

ముంబై వేదికగా జరిగిన బోర్డు 91వ వార్షిక సర్వసభ్యసమావేశంలో కోశాధికారి అరుణ్ ధుమాల్ సమర్పించిన నివేదిక ద్వారా ఆదాయవ్యయాల చిట్టాను విప్పారు. 2020 నుంచి 2022 మధ్యకాలంలో 6000వేల కోట్ల రూపాయల మేరకు అదనపు ఆదాయం సమకూరినట్లు వివరించారు.

బోర్డు ఆదాయం 3వేల 648 కోట్ల నుంచి రికార్డుస్థాయిలో 9వేల 629 కోట్ల రూపాయలకు పెరిగిపోయింది.

క్రికెట్ సంఘాలకు నిధులవరద...

2019లో వినోద్ రాయ్ నేతృత్వంలోని బీసీసీఐ పాలకమండలి...బీసీసీఐ అనుబంధ క్రికెట్ సంఘాలకు 680 కోట్ల రూపాయలు నిధులు పంచితే...గంగూలీ హయాంలో అదికాస్త ఐదురెట్ల మేరకు పెరిగింది. వివిధ రూపాలలో దేశంలోని వివిధ క్రికెట్ సంఘాలకు 3వేల 295 కోట్లరూపాయల నిధులు అందచేసినట్లు వివరించారు.

2023-2027 కాలానికి ఐపీఎల్ ప్రసారహక్కులు, డిజిటల్ మీడియా హక్కులను ఈ-వేలం ద్వారా విక్రయించడమే తమ ఆదాయం గణనీయంగా పెరగటానికి కారణమని తెలిపారు.

ప్రసారహక్కుల విక్రయం ద్వారా 48వేల 390 కోట్ల రూపాయలు సమకూరాయని, దీనికితోడు సరికొత్తగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలు వచ్చి...ఐపీఎల్ లో చేరడంతో 12 వేల 715 కోట్ల రూపాయలు వచ్చాయని నివేదికలో పొందు పరచారు.

ప్రస్తుత ఆర్ధికసంవత్సరానికి ముంబైలోని ఆదాయపుపన్ను శాఖతో సంప్రదింపులు జరపడం ద్వారా వందలకోట్ల రూపాయల మేర మినహాయింపు సాధించగలిగామని

తేల్చి చెప్పారు.

కరోనా గడ్డుకాలాన్ని విజయవంతంగా దాటుకురావడమే కాకుండా..ఆదాయాన్ని 300 శాతం పెంచడం సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని కార్యవర్గం ఘనతగా అభివర్ణించారు.

First Published:  19 Oct 2022 3:53 AM GMT
Next Story