Telugu Global
Sports

మయాంక్ వేగం వెనుక అసలు రహస్యం!

ఐపీఎల్ -17వ సీజన్ లో రెండుకు రెండుమ్యాచ్ ల్లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన 21 సంవత్సరాల ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ మెరుపువేగానికి అసలు కారణమేంటో బయటకు వచ్చింది.

మయాంక్ వేగం వెనుక అసలు రహస్యం!
X

ఐపీఎల్ -17వ సీజన్ లో రెండుకు రెండుమ్యాచ్ ల్లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన 21 సంవత్సరాల ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ మెరుపువేగానికి అసలు కారణమేంటో బయటకు వచ్చింది.

అంతర్జాతీయ క్రికెట్లో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే ఫాస్ట్ బౌలర్లకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. మార్క్ వుడ్, మిషెల్ స్టార్క్, కిగీసో రబడ, గెరార్డ్ కొట్జే, అన్రిక్ నోర్జే, నాండ్రే బర్గర్, లాకీ ఫెర్గూసన్ లాంటి బౌలర్లు గంటకు సగటున 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరితేనే అందరూ అబ్బురపడి చూస్తున్నారు. అయితే.

ప్రస్తుత 2024 సీజన్ ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఢిల్లీ కమ్ లక్నో సూపర్ జెయింట్స్ యువఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ గంటకు 155 కిలోమీటర్ల వేగాన్ని మించి బౌల్ చేయడం ద్వారా అలజడి రేపాడు. అందరి దృష్టీ తనవైపే పడేలా చేయడంలో సఫలమయ్యాడు.

రెండుకు రెండుమ్యాచ్ ల్లో.....

20 లక్షల రూపాయల కనీస వేలం ధరకు గత సీజన్లోనే లక్నో ప్రాంచైజీలో చేరిన 21 సంవత్సరాల మయాంక్ యాదవ్ కు ఢిల్లీ క్రికెట్ వర్గాలలో నిప్పులు చెరిగే ఫాస్ట్ బౌలర్ గా పేరుంది. వరుస గాయాలతో గత సీజన్లో ఐపీఎల్ కు దూరం కావాల్సి వచ్చిన మయాంక్ ప్రస్తుత సీజన్లో ఆడిన రెండుకు రెండుమ్యాచ్ ల్లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచి వారేవ్వా అనిపించుకొన్నాడు.

పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లతో జరిగిన మ్యాచ్ ల్లో మయాంక్ గంటకు 155 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరడం ద్వారా చెలరేగిపోయాడు.

అరంగేట్రం మ్యాచ్ లో 3 వికెట్లతో బెస్ట్ ప్లేయర్ అవార్డు అందుకొన్న మయాంక్..బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో విశ్వరూపమే ప్రదర్శించాడు. తన కోటా 4 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.

కనీసం ఒక్క వైడ్ లేదా నోబాల్ లేకుండా 17 డాట్ బాల్స్ వేయడం ద్వారా సంచలనమే సృష్టించాడు. మిడిల్, డెత్ ఓవర్లలో అగ్నిగోళాల్లాంటి బంతులు వేస్తూ లక్నోజట్టుకు వరుస విజయాలు అందించాడు. అత్యంత వేగవంతమైన 156.7 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరి 2024 సీజన్ కే ఫాస్టెస్ట్ బౌలర్ గా నిలిచాడు.

స్పీడ్ థ్రిల్స్..స్పీడ్ విన్స్.....

స్పీడ్ థ్రిల్స్, స్పీడ్ కిల్స్ అన్న హెచ్చరికను యువఫాస్ట్ బౌలర్ మయాంక్ తనకు అనుకూలంగా మలచుకొన్నాడు. స్పీడ్ థ్రిల్స్ ..స్పీడ్ విన్స్ అనుకొనేలా చేశాడు. కేవలం 21 ఏళ్ల వయసుకే మయాంక్ ఇంత వేగంగా ఎలా బౌల్ చేయగలుగుతున్నాడు, మయాంక్ మెరువువేగం వెనుక అసలు రహస్యం ఏమిటంటూ మీడియా ప్రతినిథులు ఆరా తీస్తే ..అసలు రహస్యం ఏమిటో బయటపడింది.

సాధారణంగా..ఫాస్ట్ బౌలర్లు మాంసాహారంతో కూడిన పౌష్టిక, సమతుల ఆహారం తీసుకొంటారన్నది వాస్తవమే. ప్రపంచ మేటి ఫాస్ట్ బౌలర్లలో ఎక్కువ మంది మాంసాహారులే.

అయితే ..మయాంక్ మాత్రం మాంసాహారాన్ని విసర్జించి రెండేళ్లు అయ్యిందని, శాకాహారిగా మారిన తరువాత అతని బౌలింగ్ లో వాడివేడీ పెరిగినట్లు మయాంక్ తల్లి మమతా యాదవ్ ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టింది.

శ్రీకృష్ణ భక్తుడు మయాంక్...

మయాంక్ యాదవ్ యుక్తవయసులోనే శ్రీకృష్ణభక్తుడిగా మారాడు. గత రెండు సంవత్సరాలుగా మాంసాహారాన్ని విడిచి పెట్టి పూర్తి శాకాహారిగా మారిపోయినట్లు అతని తల్లి మమత చెబుతున్నారు.

మయాంక్ కు పప్పు, ఆకుకూరలు, రొట్టెలు, పాలపదార్థాలు మాత్రమే ఆహారంగా ఇస్తున్నట్లు తెలిపారు. మయాంక్ శరీరతత్వానికి మాంసాహారం అస్సలు పడదని, శాకారం తీసుకోడంతో అతని శారీరక పటుత్వంలోనే కాదు..బౌలింగ్ లోనూ అనూహ్యమైన మార్పులు చోటు చేసుకొన్నట్లు వివరించింది.

కృష్ణభక్తుడుగా మారటంతో తనకు తానుగా మాంసాహారానికి దూరమయ్యాడని, శాకాహార భోజనంతో తన ఫిట్ నెస్ ను మెరుగుపరచుకోడం తాను గమనించినట్లు వివరించారు.

ఓ ఫాస్ట్ బౌలర్ కు అవసరమైన ఆహారాన్ని మాత్రమే ఓ తల్లిగా తాను వండి పెడుతున్నట్లు మమత తెలిపారు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన తన అరంగేట్రం మ్యాచ్ లో 155.8 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన మయాంక్..తన రెండోమ్యాచ్ గా బెంగళూరుతో జరిగిన పోరులో వేగాన్ని గంటకు 156.7 కిలోమీటర్లకు పెంచుకోగలిగాడు.

సీజన్ రానున్న మ్యాచ్ ల్లో మయాంక్ వేగం ఏ స్థాయికి చేరుతుందో మరి. ఇదిఇలాఉంటే..కరీబియన్ ద్వీపాలు, అమెరికా సంయుక్త అతిథ్యంలో జరిగే 2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టుకు మయాంక్ ను ఎంపిక చేసి తీరాల్సిన పరిస్థితి ఏర్పడిందని క్రికెట్ వ్యాఖ్యాతలు అభిప్రాయపడుతున్నారు.

ఈ ప్రపంచంలో అతిపెద్ద, బలమైన జంతువు ఏనుగు శాకాహారే. అత్యంత వేగంగా బంతులు విసురుతున్న మయాంక్ యాదవ్ సైతం శాకాహారి కావడంలో వింతేమీలేదు.

First Published:  4 April 2024 12:09 PM GMT
Next Story