Telugu Global
Sports

సూర్యకుమార్ కు మాస్టర్ హ్యాట్సాఫ్!

టీ-20 క్రికెట్లో భారత నయాసంచలనం, మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ పై మాస్టర్ సచిన్ టెండుల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు

సూర్యకుమార్ కు మాస్టర్ హ్యాట్సాఫ్!
X

టీ-20 క్రికెట్లో భారత నయాసంచలనం, మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ పై మాస్టర్ సచిన్ టెండుల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచకప్ సెమీఫైనల్స్ చేరే నాలుగుజట్లేవో తేల్చి చెప్పాడు....

ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో గత పదిమాసాలుగా నిలకడగా రాణిస్తూ రికార్డుల మోత మోగిస్తున్న భారత నయాసంచలనం సూర్యకుమార్ యాదవ్ కు మాస్టర్ సచిన్ హ్యాట్సాఫ్ చెప్పాడు.

ప్రపంచకప్ కు సన్నాహాకంగా భారతజట్టు తరపున ఆడిన ప్రతిమ్యాచ్ లోనూ హాఫ్ సెంచరీ సాధిస్తున్న సూర్యకుమార్ ఆటతీరు చూస్తుంటే గర్వకారణంగా ఉందని ప్రశంసించాడు. ఆస్ట్ర్రేలియా వేదికగా జరుగుతున్న ప్రస్తుత ప్రపంచకప్ లో భారత్ విజేతగా నిలవాలంటే సూర్యకుమార్ కీలకమని సచిన్ అభిప్రాయపడ్డాడు.

భరోసా, ప్రశంసే అసలు బలం...

ప్రస్తుత 2022 సీజన్లో సూర్యకుమార్ యాదవ్ నిలకడగా రాణించడానికి అసలు కారణం భారతజట్టులో అతని చోటు పదిలం కావడం, ఆటతీరును మెచ్చుకొంటూ ప్రశంసించడమేనని మాస్టర్ చెప్పాడు.

ఏ క్రీడాకారుడికైనా భరసో, ప్రశంస అనేవి కొండంత బలాన్ని ఇస్తాయని, ఆకాశమే హద్దుగా దూసుకుపోయే శక్తిని ఇస్తాయని 200 టెస్టుమ్యాచ్ లు, 100 అంతర్జాతీయ శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్ సచిన్ తెలిపాడు.

సూర్యకుమార్ నిలకడగా రాణించడం ప్రపంచకప్ లో భారతజట్టుకు మాత్రమే కాదు..దేశవాళీ క్రికెట్లో ముంబైకి, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కి మేలు చేస్తుందని అన్నాడు.

సెమీస్ చేరేది ఆ నాలుగుజట్లే...

ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ నుంచి సెమీఫైనల్స్ చేరే నాలుగుజట్ల పేర్లను సచిన్ బయటపెట్టాడు. తన దృష్టిలో ..ప్రపంచకప్ సెమీస్ చేరే సత్తా భారత్, పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్ర్రేలియాజట్లకు మాత్రమే ఉందని, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాజట్లను తాను డార్క్ హార్స్ లుగా పరిగణిస్తానని మాస్టర్ వివరించాడు.

భారత్ తలపడే గ్రూపు నుంచి పాకిస్థాన్, భారతజట్లే సెమీస్ చేరతాయని , వేరే గ్రూపు నుంచి ఆతిథ్య ఆస్ట్ర్రేలియా, మాజీ చాంపియన్ ఇంగ్లండ్ నాకౌట్ రౌండ్ చేరటం ఖాయమని తెలిపాడు.

అక్టోబర్ , నవంబర్ మాసాలలో ప్రపంచకప్ నిర్వహిస్తున్న కారణంగా...వికెట్లు బ్యాటింగ్ కు ఎంతో అనువుగా ఉంటాయని, 170కి పైగా స్కోరు సాధిస్తే మ్యాచ్ నెగ్గే అవకాశాలు ఉంటాయని సచిన్ చెప్పాడు.

భారతజట్టు ప్రస్తుత ఆటతీరు, కీలక బ్యాటర్ల దూకుడు, జట్టు సమతౌల్యం చూస్తుంటే సెమీఫైనల్స్ చేరడం ఏమంత కష్టంకాదని మాస్టర్ జోస్యం చెప్పాడు.

అక్టోబర్ 23న ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదికలలో ఒకటైన మెల్బోర్న్ స్టేడియం వేదికగా జరిగే సూపర్ -12 తొలిరౌండ్ పోరులో చిరకాల ప్రత్యర్థులు

భారత్, పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

First Published:  18 Oct 2022 5:18 AM GMT
Next Story