Telugu Global
Sports

మహిళా ఐపీఎల్ వేలం నిర్వహణలో మల్లిక షో!

భారత మహిళా క్రికెట్ చరిత్రలో రెండు అద్భుత, అసాధారణ ఘటనలు చోటు చేసుకొన్నాయి. ముంబై వేదికగా జరిగిన మహిళా ఐపీఎల్ తొలి వేలం కార్యక్రమాన్ని ఓ మహిళే నిర్వహించడం గర్వకారణంగా మిగిలిపోతుంది.

మహిళా ఐపీఎల్ వేలం నిర్వహణలో మల్లిక షో!
X

భారత మహిళా క్రికెట్ చరిత్రలో రెండు అద్భుత, అసాధారణ ఘటనలు చోటు చేసుకొన్నాయి. ముంబై వేదికగా జరిగిన మహిళా ఐపీఎల్ తొలి వేలం కార్యక్రమాన్ని ఓ మహిళే నిర్వహించడం గర్వకారణంగా మిగిలిపోతుంది...

మహిళా క్రికెట్ మ్యాచ్ లను మహిళా అంపైర్లు, మ్యాచ్ రిఫరీలే నిర్వహిస్తున్న ప్రస్తుత కాలంలో మరో అపూర్వఘట్టం ముంబైలో చోటు చేసుకొంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి మొట్టమొదటిసారిగా మహిళా ఐపీఎల్ కోసం ముంబై వేదికగా నిర్వహించిన వేలం కార్యక్రమాన్ని ఓ మహిళే నిర్వహించేలా చొరవు తీసుకొని వారేవ్వా అనిపించుకొంది. భారత మహిళల ప్రజ్ఞను, సత్తాను ప్రపంచానికి చాటి చెప్పడంలో సఫలమయ్యింది.

Advertisement

మల్లికా సాగర్ సరికొత్త చరిత్ర..

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ గత 15 సీజన్లుగా నిర్వహిస్తూ వస్తున్నఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం కార్యక్రమాలను బ్రిట‌న్‌కు చెందిన‌ హ‌గ్ ఎడ్మియ‌డెస్, ఇంగ్లండ్ టీవీ ప్ర‌జెంట‌ర్‌ రిచ‌ర్డ్ మ‌డ్లే, భార‌త కామెంటేట‌ర్ చారు శర్మ నిర్వహించడం ద్వారా సరికొత్త గ్లామర్ తెచ్చారు.

ఐపీఎల్ వేలం కార్యక్రమాన్ని నిర్వహించడం ఓ కళ అని చెప్పకనే చెప్పారు.

Advertisement

గంటలపాటు సాగే వేలం కార్యక్రమాన్ని విసుగు విరామం లేకుండా..అత్యంత సమర్థవంతంగా, ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా నిర్వహించాలంటే ఎంతో నేర్పు, ఓర్పు, ప్రజ్ఞ, సమయస్ఫూర్తి ఉండి తీరాలి.

ఇప్పటి వరకూ పురుషుల ఐపీఎల్ వేలం కార్యక్రమాలను పురుషులే నిర్వహించారు. అయితే బీసీసీఐ నిర్వహించ తలపెట్టిన మొట్టమొదటి ఐపీఎల్ కు సన్నాహకంగా ముంబై వేదికగా జరిగిన వేలం కార్యక్రమాన్ని ఓ మహిళ ఆధ్వర్యంలో నిర్వహించడంలో సఫలమయ్యారు.

ఎవరీ మల్లికా సాగర్....

మహిళా ఐపీఎల్ తొలి వేలం కార్యక్రమాన్ని అత్యంత సమర్థవంతంగా, ఆత్మవిశ్వాసంతో నిర్వహించడం ద్వారా ముంబై యువతి మల్లికా సాగర్ అందరి దృష్టిని ఆకర్షించారు.

పురుషులకు మహిళలు ఏమాత్రం తీసిపోరని తెలియచెప్పారు.

కొద్దిగంటలపాటు ఎలాంటి అంతరాయం లేకుండా సాగిన ఈ వేలంలో ఐదు ఫ్రాంచైజీలకు చెందిన బృందాలు, పలువురు బీసీసీఐ ప్రముఖులు, మీడియా సభ్యులు పాల్గొన్నారు.

వేలం కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతను ముంబైకి చెందిన మల్లిక సాగర్ కు బీసీసీఐ అప్పజెప్పింది. వేలం జాబితాలోని మొత్తం 408 ప్లేయర్ల పేర్లను చదువుతూ..చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో, అలవోకగా వేలం కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా తనకుతానే సాటిగా నిలిచింది.

మల్లికకు స్వతహాగా.. పురాత‌న‌ పెయింటింగ్స్‌, శిల్పాలు, కళాఖండాలు సేక‌రించ‌డ‌మంటే చాలా ఇష్టం.

మ‌ధ్య భార‌తదేశం, ఆధునిక భార‌త దేశానికి సంబంధించిన పెయింటింగ్స్‌ను మ‌ల్లిక ఎక్కువ‌గా సేకరిస్తూ ఉంటారు. ఆమె ప్ర‌స్తుతం ఆర్ట్ ఇండియా క‌న్స‌ల్టంట్స్ కంపెనీలో ప‌నిచేస్తోంది.

కళాఖండాల వేలం కార్యక్రమాల నిర్వహణ అనుభవంతో మల్లిక ఐపీఎల్ వేలం కార్యక్రమాన్ని అలవోకగా నిర్వహించగలిగింది. ప్రారంభ మహిళా ఐపీఎల్ వేలాన్ని నిర్వహించిన తొలిమహిళగా మల్లికా సాగర్ రికార్డుల్లో చేరింది.

వేలం కార్యక్రమాన్ని మల్లిక నిర్వహించిన తీరును చూసి భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ అబ్బురపడిపోయాడు. మల్లికను చూసి భారత్ గర్విస్తోందని, మల్లికతో వేలం కార్యక్రమాన్ని నిర్వహించేలా చేసిన బీసీసీఐని కొనియాడక తప్పదంటూ ట్విట్ చేశాడు.

మొత్తం 408 స్వదేశీ , విదేశీ ప్లేయర్ల జాబితా నుంచి..వివిధ ఫ్రాంచైజీలు కేవలం 87 మంది క్రికెటర్లను మాత్రమే తమతమ జట్ల కోసం వేలం ద్వారా ఎంపిక చేసుకోగలిగాయి.

వేలం కోసం ఒక్కో ఫ్రాంచైజీ 12 కోట్ల రూపాయల చొప్పున బడ్జెట్ తో బరిలోకి దిగింది. మొత్తం 59 కోట్ల 50 లక్షల రూపాయలు వెచ్చించి ప్లేయర్ల వేలాన్ని ముగించగలిగాయి.

వేలంలో రికార్డు ధర పలికిన స్మృతి మందన, యాష్లే గార్డ్నర్, నటాలియా స్కీయర్, జెమీమా రోడ్రిగేజ్, దీప్తి శర్మలతో సమానంగా..వేలం కార్యక్రమాన్ని నిర్వహించిన మల్లికా సాగర్ కూ గుర్తింపు దక్కడం విశేషం.

తగిన అవకాశాలు కల్పించి, వెన్నుతట్టి ప్రోత్సహిస్తే..రంగం ఏదైనా పురుషులతో సమానంగా మహిళలూ రాణించగలరనడానికి మల్లికా సాగరే తాజానిదర్శనం.

Next Story