Telugu Global
Sports

టీమిండియాకు మరో పేసర్ దొరికాడు..

మయాంక్‌ 4 ఓవర్లు వేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో నయాపేస్‌ సంచలనంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

టీమిండియాకు మరో పేసర్ దొరికాడు..
X

బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లక్నో 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌట్‌ అయింది. బుల్లెట్‌ వేగంతో బంతులు విసురుతూ ఈ ఐపీఎల్‌లో ఆకర్షణగా నిలిచిన మయాంక్ యాదవ్ రెండో మ్యాచ్‌లోనూ సంచలన బౌలింగ్‌తో అదరగొట్టాడు. మూడు వికెట్లు (3/14) తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు.

బెంగళూరుపై అద్భుతమైన ప్రదర్శనతో అందరిచూపును తనవైపున‌కు తిప్పుకున్నాడు మయాంక్‌ యాదవ్‌. తన పేస్‌ బౌలింగ్‌తో ఆర్సీబీ బ్యాటర్లను ముప్పుతిప్పులు పెట్టాడు. 22 ఏళ్ల కుర్రాడి బౌలింగ్‌కు మాక్స్‌వెల్‌ లాంటి వరల్డ్‌క్లాస్‌ బ్యాటరే వణికిపోయాడు. గంటకు 156.7 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి ఈ సీజన్‌లోనే ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు అందుకున్నాడు. ఆర్సీబీ బ్యాటర్‌ గ్రీన్‌ను మయాంక్‌ అద్భుతమైన బంతితో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఇది మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది.

మయాంక్‌ 4 ఓవర్లు వేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో నయాపేస్‌ సంచలనంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్‌కు మరో జవగల్ శ్రీనాథ్‌ దొరికేశాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదే ఫామ్‌ కొనసాగిస్తే త్వరలోనే భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

First Published:  3 April 2024 1:48 AM GMT
Next Story