Telugu Global
Sports

ఐపీఎల్ 2023 కు నేడు లోబడ్జెట్ వేలం !

ఐపీఎల్ 16వ సీజన్ మినీ వేలానికి కొచ్చీలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

ఐపీఎల్ 2023 కు నేడు లోబడ్జెట్ వేలం !
X

ఐపీఎల్ 16వ సీజన్ మినీ వేలానికి కొచ్చీలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. మొత్తం 405 మంది స్వదేశీ, విదేశీ క్రికెటర్లను వేలానికి ఉంచారు. మొత్తం 10 ఫ్రాంచైజీలు పరిమిత బడ్జెట్ తో వేలానికి సిద్ధమయ్యాయి....

ఐపీఎల్ 2023 సీజన్లో తొలి అంకం వేలానికి కొచ్చీ వేదికగా రంగం సిద్ధమయ్యింది. ఈరోజు మధ్యాహ్నం 2-30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మినీవేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు పోటీకి దిగుతున్నాయి.

405 మంది ఆటగాళ్లతో వేలం..

దేశవిదేశాలకు చెందిన మొత్తం 991మంది క్రికెటర్లు వేలం కోసం తమ పేర్లను రిజిష్టర్ చేసుకొన్నారు. అయితే కేవలం 87 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. భారీసంఖ్యలో నమోదైన ఆటగాళ్ల నుంచి 405 మందితో మాత్రమే తుదిజాబితాను రూపొందించారు.

మొత్తం 405 మందిలో 273 భారత ఆటగాళ్లు కాగా...132 మంది మాత్రమే విదేశీ క్రికెటర్లున్నారు. ఐసీసీ అనుబంధ దేశాలకు చెందిన నలుగురు ఆటగాళ్లకు మాత్రమే తుదిజాబితాలో చోటు దక్కింది.

మొత్తం ఆటగాళ్లలో 282 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లున్నారు. వీరిలో నలుగురు టెస్ట్ హోదా పొందని దేశాలజట్ల ఆటగాళ్లే కావడం విశేషం.

30 మంది విదేశీ క్రికెటర్లకు చాన్స్...

వివిధ ఫ్రాంచైజీలు ఇప్పటికే తమతమ ప్రధానజట్ల కూర్పును పూర్తి చేశాయి. మొత్తం 10 జట్లలో 87 మాత్రమే ఖాళీలు ఉంటే..వీరిలో 30 మంది విదేశీ క్రికెటర్లను ఎంపిక చేసుకొని తీరాల్సి ఉంది.

19 మంది విదేశీ క్రికెటర్ల కనీస వేలం ధరను 2 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. మరో 11 మంది ఆటగాళ్ల కనీసధరను కోటీ 50 లక్షలుగా ఖరారు చేశారు.

భారత మాజీ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తో సహా 20 మంది ఆటగాళ్లు కోటీరూపాయల కనీస వేలం ధర జాబితాలో నిలిచారు.

ఇంగ్లండ్ ఆల్ రౌండర్లకు భలే డిమాండ్..

ఇంగ్లండ్ సూపర్ ఆల్‌రౌండ‌ర్లు బెన్ స్టోక్స్, సామ్ క‌ర‌న్ రూ.2 కోట్ల క‌నీస ధ‌ర‌కు రిజిష్ట‌ర్ అయ్యారు. కంగారూ ఆల్‌రౌండ‌ర్ కామెరూన్ గ్రీన్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ సైతం వేలంలో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు.

రూ.2 కోట్ల క‌నీస ధ‌ర ఈ జాబితాలో నిలిచిన ఇతర విదేశీ క్రికెటర్లలో క్రిస్ లిన్, క్రిస్ జోర్డాన్, జేస‌న్ హోల్డ‌ర్, నికోల‌స్ పూర‌న్ వంటి స్టార్ ఆటాగాళ్లు ఉన్నారు. ఆదిల్ ర‌షీద్, ట్రావిస్ హెడ్, టామ్ బాంట‌న్, టైమ‌ల్ మిల్స్, జేమీ ఓవ‌ర్ట‌న్, క్రేగ్ ఓవ‌ర్ట‌న్, ఫిల్ సాల్ట్, ఆడం మిల్నే, జిమ్మీ నీషమ్, రిలీ ర‌స్సో, ర‌సీ వాన్ డెర్ డ‌స్సెన్, ఏంజెలో మ్యాథ్యూస్‌లు రూ.2 కోట్ల క‌నీస ధ‌ర‌కు రిజిష్ట‌ర్ అయ్యారు. ఈ బేస్ ధ‌ర‌లో ఒక్క భార‌త ఆట‌గాడు కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

కోటిన్నర వేలం ధరతో షకీబుల్...

బంగ్లాదేశ్ కెప్టెన్ కమ్ స్పిన్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ కు కోటిన్నర రూపాయల కనీస వేలం ధర జాబితాలో చోటు దక్కింది. ఇతర విదేశీ ఆటగాళ్లలో

సీన్ అబాట్, రిలే మెరిడిత్, రిచ‌ర్డ్‌స‌న్, ఆడం జంపా, షకిబుల్ హ‌స‌న్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, డేవిడ్ మ‌ల‌న్, జేస‌న్ రాయ్, షెర్‌ఫానే రూథ‌ర్‌ఫ‌ర్డ్ ఉన్నారు.

కోటిరూపాయల వేలం ధర జాబితాలో కేదార్ జాద‌వ్, మ‌నీష్ పాండే, మొహ‌మ్మ‌ద్ న‌బీ, ముజీబ్ ఉర్ ర‌హ‌మాన్, హెన్రిక్స్, ఆండ్రూ టై, జో రూట్, లూక్ వుడ్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మ‌న్, మార్టిన్ గుఫ్తిల్, కైల్ జేమీస‌న్, మ్యాట్ హెన్రీ, టామ్ లాథ‌మ్, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్ల‌సెన్, త‌బ్రేజ్ షంసీ, కుశాల్ పెరీరా, రోస్ట‌న్ ఛేజ్‌, ర‌కీం కార్న్‌వాల్, షై హోప్, డేవిడ్ వీసె, అకీల్ హుస్సేన్ ఉన్నారు.

మొత్తం 10 ఫ్రాంచైజీల చూపు బ్రిటీష్ సూపర్ ఆల్ రౌండర్లు బెన్ స్టోక్స్, సామ్ కరెన్, కంగారూ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ లపైన కేంద్రీకృతమయ్యింది.

ఈ రోజు మధ్యాహ్నం 2-30 గంటల నుంచి అర్థరాత్రి వరకూ వేలం కార్యక్రమం కొనసాగనుంది.

First Published:  23 Dec 2022 4:45 AM GMT
Next Story