Telugu Global
Sports

మెస్సీ మ్యాజిక్, అర్జెంటీనా ఆశలు సజీవం!

ప్రపంచకప్ ఫుట్ బాల్ గ్రూప్ లీగ్ రెండోరౌండ్లో అర్జెంటీనాకు స్టార్ ప్లేయర్ లయనల్ మెస్సీ అద్భుతవిజయం అందించాడు. తొలిగెలుపుతో నాకౌట్ రౌండ్ అవకాశాలను సజీవంగా నిలుపుకొంది.

మెస్సీ మ్యాజిక్, అర్జెంటీనా ఆశలు సజీవం!
X

మెస్సీ మ్యాజిక్, అర్జెంటీనా ఆశలు సజీవం!

ప్రపంచకప్ ఫుట్ బాల్ గ్రూప్ లీగ్ రెండోరౌండ్లో అర్జెంటీనాకు స్టార్ ప్లేయర్ లయనల్ మెస్సీ అద్భుతవిజయం అందించాడు. తొలిగెలుపుతో నాకౌట్ రౌండ్ అవకాశాలను సజీవంగా నిలుపుకొంది.

2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ గ్రూప్ లీగ్ ప్రారంభమ్యాచ్ ను ఓటమితో మొదలు పెట్టిన మాజీ చాంపియన్ అర్జెంటీనా..కీలక రెండోరౌండ్లో మాత్రం అద్భుత విజయం సాధించింది.

దోహా వేదికగా ముగిసిన పోరులో మెక్సికోను అర్జెంటీనా 2-0 గోల్స్ తేడాతో ఓడించడం ద్వారా ప్రీ-క్వార్టర్ ఫైనల్ రౌండ్ అవకాశాలను నిలబెట్టుకొంది. నెగ్గితీరాల్సిన ఈ రెండోరౌండ్ పోరులో మిడ్ ఫీల్డ్ మాంత్రికుడు, కెప్టెన్ లయనల్ మెస్సీ ఆట 64వ నిముషంలో సాధించిన 18 అడుగుల దూరం నుంచి చేసిన గోల్ ప్రస్తుత ప్రపంచకప్ కే హైలైట్ గా మిగిలిపోతుంది.

ఆట మొదటి భాగంలో అర్జెంటీనాను సమర్థవంతంగా అడ్డుకొన్న మెక్సికో రెండో భాగంలో అదేస్థాయి ఆటతీరును ప్రదర్శించలేకపోయింది.

మెస్సీ మ్యాజికల్ గోల్...

ఆట రెండో భాగం ప్రారంభం నుంచే మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా గోల్ సాధించాలన్న పట్టుదలతో మెరుపుదాడులు ప్రారంభించింది. అర్జెంటీనా దూకుడుతో మెక్సికో ప్రతిదాడులను పక్కన పెట్టి ఆత్మరక్షణలో పడిపోయింది.

ఆట 64వ నిముషంలో మెక్సికో గోల్ పోస్ట్ వైపుకు దూసుకువచ్చిన మెస్సీ 18 అడుగుల దూరం నుంచి కొట్టిన కిక్ ..మెరుపువేగంతో దూసుకెళ్లి..మెక్సికో గోల్ కీపర్ ను బోల్తా కొట్టించి మరీ గోల్ లో పడడంతో 1-0 ఆధిక్యం లభించింది. ప్రపంచకప్ టోర్నీలో మెస్సీ సాధించిన అత్యుత్తమ గోల్ గా ఇది రికార్డుల్లో నిలిచిపోతుంది.

ఆ తర్వాత నుంచి అర్జెంటీనా జోరు పెంచింది. ఈ క్రమంలో ఆట 87వ నిముషంలో ఎంజో ఫెర్నాడేజ్ మరో గోల్ సాధించడం ద్వారా అర్జెంటీనా ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు.

చివరకు అర్జెంటీనా 2-0 గోల్స్ విజయంతో...గ్రూపు మొదటి రెండుస్థానాలలో నిలువగలిగింది.

మెస్సీ సాధించిన మెరుపు గోల్ ముందుగా నిర్ణయించుకొన్న వ్యూహం ప్రకారం సాధించినదేనని విజయానంతరం ఆటగాడు ఏంజెల్ డి మారియా చెప్పాడు.

తన గ్రూపు ఆఖరిరౌండ్ పోరులో పోలెండ్ ను ఓడించగలిగితేనే అర్జెంటీనా నాకౌట్ రౌండ్ చేరుకోగలుగుతుంది.

ఈ రోజు జరిగే గ్రూప్- జీ లీగ్ పోటీలో ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్ తో స్విట్జర్లాండ్, కమెరూన్ తో సెర్బియా, ఘనాతో దక్షిణ కొరియాజట్లు తలపడనున్నాయి.

మొత్తం 32 దేశాలజట్లు పోటీపడుతున్న ప్రపంచకప్ ఫుట్ బాల్ లీగ్ దశను 8 గ్రూపులుగా నిర్వహిస్తున్నారు. ప్రీ-క్వార్టర్ ఫైనల్ రౌండ్లో 16 జట్లు మాత్రమే పోటీపడతాయి. మిగిలిన 16 జట్లు లీగ్ దశ నుంచే ఇంటిదారి పట్టక తప్పదు. మాజీ చాంపియన్లు బ్రెజిల్, స్పెయిన్ హాట్ ఫేవరెట్లుగా బరిలో నిలిచాయి.

First Published:  28 Nov 2022 7:21 AM GMT
Next Story