Telugu Global
Sports

లియోనెల్ మెస్సీ అద్భుత రికార్డులు.. వరల్డ్ కప్ ముద్దాడటానికి ఇదే లాస్ట్ ఛాన్స్

ఖతర్ వరల్డ్ కప్‌ మొదలైన దగ్గరి నుంచి అందరి చూపు క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీపైనే ఉన్నది.

లియోనెల్ మెస్సీ అద్భుత రికార్డులు.. వరల్డ్ కప్ ముద్దాడటానికి ఇదే లాస్ట్ ఛాన్స్
X

అర్జెంటీనా దిగ్గజ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్-2022లో తన జట్టును ఫైనల్స్‌కు చేర్చాడు. ఈ వరల్డ్ కప్‌లో ఏకంగా 5 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఓకే వరల్డ్ కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన పెద్ద వయస్కుడిగా మెస్సీ పేరిట రికార్డు నమోదైంది. మొత్తంగా అన్ని వరల్డ్ కప్‌లు కలిపి 11 గోల్స్ చేసి.. అర్జెంటీనా ప్లేయర్ గాబ్రియెల్ బటిస్టుత రికార్డును అధిగమించాడు. ఇక మంగళవారం అర్థరాత్రి క్రొయేషియాతో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో మెస్సీ అదరగొట్టాడు.

అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఈ మ్యాచ్‌లో అత్యంత వేగంగా పాస్‌లు ఇస్తూ ప్రత్యర్థికి ఛాన్స్ దొరకకుండా చేశాడు. ఆట 34వ నిమిషంలో పెనాల్టీని గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే అల్వరేజ్ మరో గోల్ సాధించాడు. ఇక రెండో అర్థ భాగంలో అర్జెంటీనా మరింత దూకుడు పెంచింది. మెస్సీ ఇచ్చిన అద్బుతమైన పాస్‌ను అల్వరెజ్ గోల్‌గా మలిచి అర్జెంటీనా ఆధిక్యాన్ని 3-0కు పెంచాడు. ఆ తర్వాత క్రొయేషియా ఎలాంటి పోటీ ఇవ్వలేకపోవడంతో అర్జెంటీనా రికార్డు స్థాయిలో 6వ సారి వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకున్నది. అర్జెంటీనా ఇప్పటి వరకు 1930, 1978, 1986, 1990, 2014, 2022లో ఫైనల్స్‌కు చేరుకోగా.. 1978, 1986లో కప్ గెలిచింది. 2014లో అర్జెంటీనా ఫైనల్స్ చేరుకున్నప్పుడు జట్టులో లియోనెల్ మెస్సీ కూడా ఉన్నాడు. కానీ కప్ అందుకోలేకపోయాడు.

ఇక ప్రస్తుతం లియోనెల్ మెస్సీ కెరీర్ చివరి దశలో ఉన్నాడు. సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత కీలక ప్రకటన చేశాడు. తన ప్రపంచ కప్ ప్రయాణాన్ని ఫైనల్ మ్యాచ్‌తో ముగిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. మళ్లీ నాలుగేళ్ల తర్వాత తన వయసు మీదపడుతుందని.. అప్పటికి ప్రపంచకప్ ఆడగలుగుతానని అనుకోవడ్లేదని.. అందుకే ఇలా ప్రపంచకప్ ముగించడమే బెస్ట్ అని తను భావిస్తున్నట్లు మెస్సీ చెప్పుకొచ్చాడు. అయితే మెస్సీ అర్జెంటీనా తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడతాడో లేదో చెప్పలేదు. కానీ, ఫుట్‌బాల్ లీగ్‌లలో మాత్రం ఆడే అవకాశం ఉన్నది.

ఖతర్ వరల్డ్ కప్‌ మొదలైన దగ్గరి నుంచి అందరి చూపు క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీపైనే ఉన్నది. సమకాలీన ప్రపంచంలో దిగ్గజ ఆటగాళ్లైన వీరిద్దరి ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నా.. వరల్డ్ కప్ మాత్రం లేదు. ఈ సారి ఎలాగైనా ఈ ఘనత సాధించాలని ఇద్దరూ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, క్వార్టర్ ఫైనల్స్‌లోనే పోర్చుగల్ ఓడిపోవడంతో రొనాల్డో కల చెదిరిపోయింది. ఆ రోజు మైదానం వీడే సమయంలో కన్నీటిపర్యంతం అయ్యాడు. అయితే మెస్సీకి మాత్రం అద్భుతమైన అవకాశం వచ్చింది. తన ఫామ్‌తో జట్టును ఫైనల్స్‌కు చేర్చడమే కాకుండా.. కల కూడా నెరవేర్చుకునే అవకాశం ఏర్పడింది. బుధవారం అర్థరాత్రి ఫ్రాన్స్-మొరాకో మధ్య రెండో సెమీస్ జరుగనున్నది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టుతో అర్జెంటీనా ఫైనల్స్‌లో తలపడనున్నది.

అర్జెంటీనా జట్టుకు ఇండియాలో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా మెస్సీకి ఫ్యాన్ బేస్ ఎక్కువ. ఈ సారి ప్రపంచకప్‌ను మెస్సీ ముద్దాడాలని అందరూ ఆశిస్తున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తన కెరీర్ చివరి దశలో వరల్డ్ కప్‌ను అందుకున్నాడు. ఇప్పుడు మెస్సీ కూడా తన చివరి వరల్డ్ కప్‌లో ఆ ఘనత సాధించాలని ఆయన అభిమానులందరూ కోరుకుంటున్నారు. అన్నట్లు సచిన్, మెస్సీ.. ఇద్దరి జెర్సీ నెంబర్లు పదే కావడం గమనార్హం.

First Published:  14 Dec 2022 11:59 AM GMT
Next Story