Telugu Global
Sports

లక్ష్మణ్ కోచ్‌గా ఆసియాకప్‌కు బ్లూ బ్రిగేడ్ రెడీ!

భారత ప్రధాన శిక్షకుడు రాహుల్ ద్రవిడ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకోకపోడంతో...జట్టు తాత్కాలిక కోచ్ బాధ్యతలను జాతీయ క్రికెట్ అకాడమీ చైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్‌కు అప్పజెప్పారు.

లక్ష్మణ్ కోచ్‌గా ఆసియాకప్‌కు బ్లూ బ్రిగేడ్ రెడీ!
X

ఏడు సార్లు విజేత భారత్.. ఆసియా కప్ టైటిల్‌కు ఎనిమిదోసారి గురిపెట్టింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా మరి కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఈ టోర్నీలో వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా, రోహిత్ శర్మ కెప్టెన్‌గా బరిలోకి దిగుతోంది. 2022 టీ-20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా జరుగుతున్న ఆరు జట్ల ఆసియాకప్ టోర్నీలో భారత్ హాట్ ఫేవరెట్‌గా పోటీకి దిగుతోంది. పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అప్ఘనిస్థాన్ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న ఈ టోర్నీకి శ్రీలంకకు బదులుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్యమిస్తోంది.

పవర్ ఫుల్ జట్టుతో భారత్..

1984 నుంచి 2018 వరకూ జరిగిన ఆసియాకప్ టోర్నీలలో అత్యధికంగా ఏడు టైటిల్స్ నెగ్గిన భారత్ టైటిల్ నిలుపుకోవాలన్న పట్టుదలతో పటిష్టమైన జట్టుతో సమరానికి సిద్ధమైంది. ఈ నెల 28న జరిగే సూపర్ సండే ప్రారంభ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ త‌ల‌పడనుంది. డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టులో కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలతో అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహాల్, రవి బిష్నోయ్ ప్రధాన స్పిన్నర్లుగాను, రవీంద్ర జడేజా, హార్థిక్ పాండ్యా ఆల్ రౌండర్లుగాను వ్యవహరించనున్నారు. దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్ స్పెషలిస్ట్ బ్యాటర్లుగానూ ఉన్నారు. రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్ వికెట్ కీపర్లుగా సేవలు అందించనున్నారు. యార్కర్ల కింగ్, సీనియర్ ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా గాయంతో అందుబాటులో లేకపోడంతో...భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్ పేస్ బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్ రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు.

చీఫ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్...

భారత ప్రధాన శిక్షకుడు రాహుల్ ద్రవిడ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకోకపోడంతో...జట్టు తాత్కాలిక కోచ్ బాధ్యతలను జాతీయ క్రికెట్ అకాడమీ చైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్‌కు అప్పజెప్పారు. జింబాబ్వేతో ఇటీవలే ముగిసిన తీన్మార్ వన్డే సిరీస్‌లో సైతం భారత జట్టు ప్రధాన శిక్షకుని బాధ్యతలు వీవీఎస్ నిర్వర్తించాడు. ద్రవిడ్‌కు కరోనా నెగిటివ్ వచ్చిన వెంటనే జట్టుతో చేరుతాడని బీసీసీఐ ప్రకటించింది.

కోహ్లీ వైపే అందరి చూపు...

గత మూడేళ్లుగా వరుస వైఫల్యాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ..తగిన విశ్రాంతి తర్వాత తిరిగి భారత టీ-20 జట్టులో చోటు సంపాదించాడు. ఆస్ట్రేలియా వేదిక‌గా అక్టోబర్‌లో జరిగే టీ-20 ప్రపంచకప్‌లో పాల్గొనే భార‌త్‌ తుది జట్టులో చోటు దక్కించుకోవాలంటే..కోహ్లీ ప్రస్తుత ఆసియాకప్‌లో పూర్తిస్థాయిలో రాణించి తీరక తప్పని పరిస్థితి ఏర్పడింది. క్రికెట్ అభిమానులంతా కోహ్లీ స్థాయికి తగ్గట్టుగా రాణించాలని కోరుకుంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే..పాకిస్థాన్ ప్రత్యర్థిగా ఆసియాకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన విరాట్ కోహ్లీకి 2022 ఆసియాకప్ సమరం డూ ఆర్ డై లాంటిదే.

First Published:  25 Aug 2022 7:27 AM GMT
Next Story