Telugu Global
Sports

భారత బ్యాడ్మింటన్ అగ్గిపిడుగు లక్ష్యసేన్!

బర్మింగ్ హామ్ వేదికగా ముగిసిన 2022 కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో భారత యువఆటగాడు లక్ష్యసేన్ బంగారు పతకంతో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు.

భారత బ్యాడ్మింటన్ అగ్గిపిడుగు లక్ష్యసేన్!
X

బర్మింగ్ హామ్ వేదికగా ముగిసిన 2022 కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో భారత యువఆటగాడు లక్ష్యసేన్ బంగారు పతకంతో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు. కేవలం 20 సంవత్సరాల వయసులోనే లక్ష్యసేన్ ఈ ఘనత సాధించడం ద్వారా ప్రకాశ్ పడుకోన్, సయ్యద్ మోడీ లాంటి దిగ్గజ ఆటగాళ్ల సరసన నిలిచాడు....

లక్ష్యసేన్..ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో గత ఏడాదికాలంగా తరచూ వినిపిస్తున్నపేరు. భారత బ్యాడ్మింటన్ అనగానే ప్రకాశ్ పడుకోన్, సురేశ్ గోయెల్, నందూ నటేకర్, సయ్యద్ మోడీ, పుల్లెల గోపీచంద్, దీపంకర్ భట్టాచార్య, కిడాంబీ శ్రీకాంత్ లాంటి మేటిఆటగాళ్లే గుర్తుకు వస్తారు.

పారుపల్లి కశ్యప్, కిడాంబీ శ్రీకాంత్, ప్రణయ్, సాయి ప్రణీత్ లాంటి నేటితరం ఆటగాళ్ల కు జూనియర్ స్టార్ లక్ష్యసేన్ గట్టిపోటీ ఇస్తూ రానున్నకాలంలో భారత, ప్రపంచ బ్యాడ్మింటన్ లో కాబోయే రారాజు తానేనని చెప్పకనే చెబుతున్నాడు.


ఉత్తరాఖండ్ మెరిక....

ఉత్తరాఖండ్ కు చెందిన అల్మోరాలోని ఓ బ్యాడ్మింటన్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి దూసుకొచ్చిన చిచ్చరపిడుగే లక్ష్యసేన్. గత ఎనిమిది దశాబ్దాల కాలంగా సేన్ కుటుంబానికి బ్యాడ్మింటన్ తో అనుబంధం ఉంది. లక్ష్యసేన్ తాత, తండ్రి ఇద్దరూ బ్యాడ్మింటన్ క్రీడాకారులే. సేన్ కుటుంబానికి బ్యాడ్మింటన్ వారసత్వంగా, సాంప్రదాయంగా వస్తోంది.

లక్ష్యతండ్రి ధీరేంద్ర కె సేన్ కు అల్మోరాలో సొంతంగా ఓ శిక్షణాకేంద్రం సైతం ఉంది. అంతేకాదు..బ్యాడ్మింటన్ శిక్షణలో ఎన్ఐఎస్ పాటియాలా నుంచి ఆయన ఓ సర్టిఫికెట్ ను సైతం సంపాదించారు.

ఐదేళ్ల చిరుప్రాయంలోనే తండ్రి పర్యవేక్షణలో రాకెట్ చేతపట్టిన లక్ష్యసేన్ సబ్-జూనియర్ స్థాయిలో మెరికలాంటి ఆటగాడిగా గుర్తింపు సంపాదించుకొన్నాడు.

జాతీయ జూనియర్ విభాగంలో పాల్గొంటూ బెంగళూరులో జరిగిన ఓ టోర్నీలో టైటిల్ నెగ్గడం ద్వారా లక్ష్యసేన్ తన జైత్రయాత్రకు శ్రీకారం చుట్టాడు.

ప్రపంచస్థాయిలో.....

2016లో బ్యాంకాక్ వేదికగా జరిగిన ఆసియా జూనియర్ టోర్నీలో కాంస్య పతకం సాధించిన లక్ష్య 2018 జకార్తా మీట్ లో బాలుర బంగారు పతకం గెలుచుకొన్నాడు.

2018 ప్రపంచ జూనియర్ టోర్నీలో కాంస్య పతకంతో సరిపెట్టుకొన్న లక్ష్య అదే ఏడాది అర్జెంటీనా వేదికగా జరిగిన టోర్నీ బాలుర సింగిల్స్ లో రజత పతకం సాధించాడు.

బ్యునోస్ ఏర్స్ వేదికగా 2018లో జరిగిన ప్రపంచ యువజన ఒలింపిక్స్ మిక్సిడ్ టీమ్ విభాగంలో భారత్ కు బంగారు పతకం అందించాడు.

సీనియర్ విభాగంలో జోరు..

2020 సీజన్లో మనీలా వేదికగా జరిగిన ఆసియా టీమ్ చాంపియన్షిప్ విభాగంలో కాంస్య పతకం సాధించిన లక్ష్యసేన్

బ్యాంకాక్ వేదికగా ముగిసిన 2022 థామస్ కప్ టోర్నీలో భారత్ తొలిసారిగా విజేతగా నిలవడంలో లక్ష్యసేన్ తనవంతు పాత్రనిర్వర్తించాడు.

బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన 2022 కామన్వెల్త్ గేమ్స్ మిక్సిడ్ టీమ్ విభాగంలో భారతజట్టు సభ్యుడిగా రజత పతకం అందుకొన్న లక్ష్యసేన్..పురుషుల సింగిల్స్ లో బంగారు పతకం సాధించడం ద్వారా మరో ముగ్గురు దిగ్గజాల సరసన నిలిచాడు.

1978 కామన్వెల్త్ గేమ్స్ లో ప్రకాశ్ పడుకోన్, 1982 గేమ్స్ లో సయ్యద్ మోడీ, 2014 కామన్వెల్త్ గేమ్స్ లో పారుపల్లి కశ్యప్ స్వర్ణ పతకాలు సాధిస్తే..2022 గేమ్స్ విజేతగా నిలవడం ద్వారా ఇప్పుడు లక్ష్య వారి సరసన చోటు సంపాదించాడు. 20 సంవత్సరాల చిరుప్రాయంలోనే కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతకం సాధించిన

భారత క్రీడాకారుడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ర్యాంకింగ్స్ లో పై పైకి...

గత ఏడాదికాలంగా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన వివిధ టోర్నీలలో పాల్గొంటూ మొదటి పదిమంది అత్యుత్తమ ర్యాంక్ ఆటగాళ్ల పై సంచలన విజయాలు నమోదు చేశాడు.

సీనియర్ స్థాయిలో ప్రస్తుతం భారత అత్యుత్తమ సింగిల్స్ ప్లేయర్ గా గుర్తింపు పొందిన లక్ష్యసేన్..జపాన్ వేదికగా ఆగస్టు 22 నుంచి 28 వరకూ జరిగే 2022 ప్రపంచ బ్యాడ్మింటన్ సింగిల్స్ లో సైతం దూకుడు కొనసాగించాలని భావిస్తున్నాడు.

ఇప్పటికే థామస్ కప్, కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతకాలు సాధించిన ఉత్తరాఖండ్ వండర్ లక్ష్యసేన్...ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీలో సైతం ఏదో ఒక పతకం తో స్వదేశానికి తిరిగి రావాలని కోరుకొందాం.

First Published:  15 Aug 2022 4:30 AM GMT
Next Story