Telugu Global
Sports

మూడో టీ-20లో కుల్దీప్, సూర్య రికార్డుల మోత!

గయనా వేదికగా వెస్టిండీస్ తో ముగిసిన కీలక మూడో టీ-20లో భారత తురుపుముక్కలు కుల్దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్ రికార్డుల మోత మోగించారు.

మూడో టీ-20లో కుల్దీప్, సూర్య రికార్డుల మోత!
X

గయనా వేదికగా వెస్టిండీస్ తో ముగిసిన కీలక మూడో టీ-20లో భారత తురుపుముక్కలు కుల్దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్ రికార్డుల మోత మోగించారు. తమజట్టు 7 వికెట్ల విజయంలో ప్రధానపాత్ర వహించారు....

వెస్టిండీస్ తో పాంచ్ పటాకా టీ-20 సిరీస్ మూడోమ్యాచ్ లో భారత్ విజయం సాధించడం ద్వారా సిరీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకోడంలో భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కీలకపాత్ర పోషించారు.

బౌలింగ్ లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జంట రికార్డులతో అదరగొడితే...బ్యాటింగ్ లో మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోయాడు.

3 వికెట్లతో కుల్దీప్ రెండు రికార్డులు....

గయానా రాజధాని జార్జిటౌన్ ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా తన తొలిమ్యాచ్ ఆడిన కుల్దీప్ యాదవ్ తన కోటా 4 ఓవర్లలో 28 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టడం ద్వారా కరీబియన్ జట్టుకు పగ్గాలు వేశాడు.

కుల్దీప్ స్పిన్ జాదూలో ఓపెనర్ బ్రెండన్ కింగ్ ( 42), వన్ డౌన్ జాన్సన్ చార్లెస్ ( 12), స్టార్ హిట్టర్ నికోలస్ పూరన్ ( 20 ) దొరికిపోయారు. ఈ క్రమంలో వెస్టిండీస్ పైన అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్ గా ఇప్పటి వరకూ పేసర్ భువనేశ్వర్ కుమార్ పేరుతో ఉన్న రికార్డును కుల్దీప్ అధిగమించాడు.

28 సంవత్సరాల కుల్దీప్ వెస్టిండీస్ తో ఆడిన 7 టీ-20 మ్యాచ్ ల్లో 15 వికెట్లు పడగొట్టడం ద్వారా అగ్రస్థానంలో నిలిచాడు. భువనేశ్వర్ కుమార్ 18 మ్యాచ్ ల్లో పడగొట్టిన 13 వికెట్ల రికార్డును కుల్దీప్ తెరమరుగు చేయగలిగాడు.

అత్యంత వేగంగా 50 వికెట్ల రికార్డు...

ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో అత్యంత వేగంగా 50 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ గా కుల్దీప్ యాదవ్ మరో రికార్డు నెలకొల్పాడు. కుల్దీప్ కేవలం 600 బంతుల్లోనే 50 వికెట్ల మైలురాయిని చేరుకోగలిగాడు.

ఇప్పటి వరకూ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ పేరుతో ఉన్న 34 మ్యాచ్ ల రికార్డును కుల్దీప్ అధిగమించాడు. భారత్ తరపున తన 30వ టీ-20 మ్యాచ్ ద్వారా కుల్దీప్ ఈ ఘనత సాధించాడు.

టీ-20 చరిత్రలో అత్యంత వేగంగా 50 వికెట్ల రికార్డు సాధించిన ప్రపంచరికార్డు ఘనత శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ అజంతా మెండిస్ పేరుతోనే ఉంది. కేవలం 26 మ్యాచ్ ల్లోనే అజంతా మెండిస్ 50 వికెట్లు పడగొట్టగలిగాడు.

సిక్సర్లబాదుడులో సూర్య రికార్డు...

టీ-20 బ్యాటర్ ర్యాంకింగ్స్ లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ సైతం మరో ఘనతను సొంతం చేసుకొన్నాడు. మూడో టీ-20 మ్యాచ్ లో సూర్య చెలరేగిపోడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. కేవలం 23 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీతో పాటు..4 సిక్సర్లు, 10 ఫోర్లతో 83 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

టీ-20 అంతర్జాతీయమ్యాచ్ ల్లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు బాదిన రెండో బ్యాటర్ గా రికార్డుల్లో చేరాడు. వెస్టిండీస్ బ్యాటర్ ఇవిన్ లూయిస్ పేరుతో అత్యంత వేగంగా 100 సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డు ఉంది. టీ-20ల్లో 100 సిక్సర్లు బాదిన భారత ఇతర బ్యాటర్లలో రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ సైతం ఉన్నారు. రోహిత్ శర్మ 182 సిక్సర్లు, విరాట్ కొహ్లీ 117 సిక్సర్లు, సూర్య 101 సిక్సర్లతో నిలిచారు.

హైదరాబాద్ కమ్ భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ వెస్టిండీస్ సిరీస్ లోని మొదటి మూడుమ్యాచ్ ల్లోనూ 30కి పైగా స్కోర్లు సాధించిన ఆటగాడి రికార్డు సాధించాడు.

ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి మూడుమ్యాచ్ లు, మూడు ఇన్నింగ్స్ లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ చెరో 139 పరుగుల స్కోరుతో టాపర్లుగా ఉన్నారు.

First Published:  9 Aug 2023 11:00 AM GMT
Next Story