Telugu Global
Sports

భారతజోడీకే కొరియన్ ఓపెన్ టైటిల్!

భారతస్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి మరో అంతర్జాతీయ డబుల్స్ టైటిల్ సాధించారు.

భారతజోడీకే కొరియన్ ఓపెన్ టైటిల్!
X

భారతజోడీకే కొరియన్ ఓపెన్ టైటిల్!

భారతస్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి మరో అంతర్జాతీయ డబుల్స్ టైటిల్ సాధించారు. కొద్దిసేపటి క్రితమే ముగిసిన ఫైనల్స్ లో ప్రపంచ టాప్ ర్యాంక్ జోడీపై సంచలన విజయం సాధించారు...

ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో భారత యువజోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టిల జైత్రయాత్ర కొనసాగుతోంది. విజయం వెంట విజయం, టైటిల్ వెంట టైటిల్ సాధిస్తూ ఆకాశమే హద్దుగా సాగిపోతున్నారు.

దక్షిణ కొరియా వేదికగా జరిగిన 2023 కొరియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ ను సైతం ఈ భారతజోడీ సొంతం చేసుకోగలిగారు.

టాప్ లేపిన భారత కుర్రాళ్లు...

ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో ప్రపంచ నంబర్ వన్, టాప్ సీడ్ జోడీగా ఉన్న ఇండోనీసియా జంట ఫజార్ అల్ ఫియాన్- మహ్మద్ రియాన్ అర్డియాంటో పై సంచలన విజయం సాధించారు.

హోరాహోరీగా సాగిన మూడుసెట్ల టైటిల్ సమరంలో భారతజంట 17-21, 21-13, 21-14తో ఇండోనీసియా టాప్ జోడీని కంగు తినిపించారు. తొలిగేమ్ ను 17-21తో చేజార్చుకొన్న సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టిల జోడీ..మిగిలిన రెండుగేమ్ ల్లోనూ చెలరేగి ఆడారు. నువ్వానేనా అన్నట్లుగా సాగిన సమరంలో పాయింట్ పాయింటుకూ పోరు జోరుగా సాగింది.

ప్రత్యర్థిజోడీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడి 21-13, 21-14తో నెగ్గడం ద్వారా టైటిల్ కైవసం చేసుకొన్నారు. కొరియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ సాధించడం భారత డబుల్స్ జోడీకి ఇదే మొదటిసారి.

2019లో థాయ్ లాండ్ ఓపెన్, 2022 లో ఇండియన్ ఓపెన్ , 2023లో ప్రపంచ బ్యాడ్మింటన్ టూర్ టైటిల్స్ నెగ్గిన సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ ల జోడీకి సూపర్ -500 స్థాయి టైటిల్ నెగ్గడం ఇది మూడోసారి.

ప్రస్తుత సీజన్లోనే జరిగిన సూపర్ -300 స్థాయి..స్విస్ ఓపెన్, ఇండోనీసియన్ ఓపెన్ టైటిల్స్ ను సైతం సాత్విక్- చిరాగ్ ల జంట సాధించారు.

సాత్విక్- చిరాగ్ సరికొత్త చరిత్ర...

ప్రపంచ పురుషుల టీమ్ చాంపియన్ల కోసం నిర్వహించే థామస్ కప్ (2022 ) ను భారత్ తొలిసారిగా గెలుచుకోడంలో డబుల్స్ జోడీ సాత్విక్- చిరాగ్ ప్రధానపాత్ర వహించడం ద్వారా సర్క్యూట్ లోకి దూసుకొచ్చారు.

ఆ తర్వాత జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్లో కాంస్యపతకం సాధించడం ద్వారా ఈ ఘనత సాధించిన భారత పురుషుల తొలిజోడీగా చరిత్ర సృష్టించారు. ఇక..

బర్మింగ్ హామ్ వేదికగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ పురుషుల డబుల్స్ లో సైతం అలవోకగా బంగారు పతకం గెలుచుకోడం ద్వారా ప్రపంచ 6వ ర్యాంక్ జోడీగా నిలిచారు.

దుబాయ్ లోని అల్ నాసర్ క్లబ్ లోని షేక్ రషీద్ బిన్ హమ్ దాన్ ఇన్ డోర్ వేదికగా జరిగిన 2023 ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీలో 6వ సీడ్ జోడీగా టైటిల్ వేటకు దిగటమే కాదు.. టైటిల్ కైవసం చేసుకొన్నారు...

బంగారు పతకం కోసం మలేసియాకు చెందిన 8వ ర్యాంక్ జోడీ వన్ యూ సిన్- టే ఈ ల పై విజయం సాధించారు.

ఆసియా బ్యాడ్మింటన్లో 58 సంవత్సరాల విరామం తర్వాత భారత్ కు బంగారు పతకం సాధించిన డబుల్స్ జోడీగా చరిత్ర సృష్టించారు. వచ్చే ఏడాది పారిస్ వేదికగా

జరిగే ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించాలన్న పట్టుదలతో ఉన్నా.

First Published:  23 July 2023 10:30 AM GMT
Next Story