Telugu Global
Sports

ఐపీఎల్ లో గేల్, కొహ్లీలను మించిన రాహుల్!

ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ తన రికార్డులను తానే అధిగమించుకొంటూ పోతున్నాడు. దిగ్గజ బ్యాటర్లు క్రిస్ గేల్, విరాట్ కొహ్లీల రికార్డును తెరమరుగు చేశాడు.

ఐపీఎల్ లో గేల్, కొహ్లీలను మించిన రాహుల్!
X

ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ తన రికార్డులను తానే అధిగమించుకొంటూ పోతున్నాడు. దిగ్గజ బ్యాటర్లు క్రిస్ గేల్, విరాట్ కొహ్లీల రికార్డును తెరమరుగు చేశాడు...

ఐపీఎల్ -16వ సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ మరో సూపర్ రికార్డు నమోదు చేశాడు. దిగ్గజ బ్యాటర్లు క్రిస్ గేల్, విరాట్ కొహ్లీలను అధిగమించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

హోంగ్రౌండ్ లక్నో ఏక్నా స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో రాహుల్ 56 బంతుల్లో 74 పరుగులు సాధించాడు. ఇందులో 8 బౌండ్రీలు, ఓ సిక్సర్ ఉన్నాయి. 132.14 స్ట్ర్రయిక్ రేట్ సైతం నమోదు చేశాడు. ఐపీఎల్ లో రాహుల్ కు ఇది 32వ హాఫ్ సెంచరీ.

అత్యంత వేగంగా 4వేల పరుగుల రికార్డు..

ఐపీఎల్ చరిత్రలో 4వేల పరుగుల మైలురాయిని అతితక్కువ ఇన్నింగ్స్ లో సాధించిన బ్యాటర్ గా రాహుల్ నిలిచాడు. ఇప్పటి వరకూ బెంగళూరు మాజీ ఓపెనర్ క్రిస్ గేల్, ప్రస్తుత ఓపెనర్ విరాట్ కొహ్లీల పేరుతో ఉన్న రికార్డులను రాహుల్ అధిగమించాడు.

గతంలో బెంగళూరు, మొహాలీ ఫ్రాంచైజీల తరపున ఆడిన రాహుల్ ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. రాహుల్ కేవలం 105 ఇన్నింగ్స్ లోనే 4వేల పరుగుల మైలురాయిని చేరుకోగలిగాడు.

రాహుల్ తన ఐపీఎల్ కెరియర్ లో 4 శతకాలు, 32 అర్థశతకాలతో 4,044 పరుగులు సాధించాడు. 47.02 సగటుతో 135.16 స్ట్ర్రయిక్ రేట్ నమోదు చేశాడు. అత్యధికంగా 132 పరుగుల నాటౌట్ స్కోరు ను సైతం రాహుల్ సాధించాడు.

ఆల్ టైమ్ గ్రేట్ ఓపెనర్ క్రిస్ గేల్ 112 ఇన్నింగ్స్ లోనూ, డేవిడ్ వార్నర్ 114, విరాట్ కొహ్లీ 128, ఏబీ డివిలియర్స్ 131 ఇన్నింగ్స్ లో 4వేల పరుగుల రికార్డు సాధిస్తే..రాహుల్ మాత్రం 105 ఇన్నింగ్స్ లోనే సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

సీజన్ కు 500 రికార్డుల్లో టాప్..

ఐపీఎల్ సీజన్ కు సగటున 500 పరుగులు సాధించిన రికార్డుల్లో రాహుల్ తర్వాతే ఎవరైనా. 2018 నుంచి 2022 వరకూ వరుసగా ఐదుసీజన్లపాటు 500కు పైగా స్కోర్లు సాధించిన తొలి, ఏకైక ఓపెనర్ కెఎల్ రాహుల్ మాత్రమే.

2021 సీజన్ వరకూ కింగ్స్ పంజాబ్ జట్టుకు నాయకత్వం వహించిన రాహుల్ కు సీజన్ కు 500 పరుగుల చొప్పున సాధించడం ఇదే మొదటిసారి కాదు.

2018 సీజన్లో 659 పరుగులు, 2019 సీజన్లో 593 పరుగులు, 2020 సీజన్లో 670 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకొన్నాడు.

అంతేకాదు..2021 సీజన్లో 13 మ్యాచ్ లు ఆడి 616 పరుగులు నమోదు చేశాడు. 2022 సీజన్లో సైతం అదే ఘనతను సాధించాడు.

2018 నుంచి అత్యధికంగా 32 హాఫ్ సెంచరీలు సాధించిన ఒకే ఒక్క బ్యాటర్ గా కూడా రాహుల్ రికార్డుల్లో చేరాడు. ఏడాదికి 15 కోట్ల రూపాయల కాంట్రాక్టుపై లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు రాహుల్ ఆడుతున్నాడు.

పంజాబ్ తో జరిగిన పోరులో రాహుల్ రాణించినా లక్నో జట్టుకు 2 వికెట్ల పరాజయం తప్పలేదు.

First Published:  16 April 2023 6:42 AM GMT
Next Story