Telugu Global
Sports

వరుసగా విఫలమవుతున్నా రాహుల్ కే జై!

భారత క్రికెట్లో సమన్యాయం ఏమాత్రం కనిపించడం లేదు. సంజు శాంసన్ లాంటి బ్యాటర్లను ఒక్క వైఫల్యంతో పక్కన పెడుతుంటే..కెఎల్ రాహుల్ లాంటి బ్యాటర్లు వరుసగా విఫలమవుతున్న టీమ్ మేనేజ్ మెంట్ పదేపదే అవకాశాలు కల్పిస్తూ వెనకేసుకు రావటం విమర్శలకు తావిస్తోంది.

వరుసగా విఫలమవుతున్నా రాహుల్ కే జై!
X

భారత క్రికెట్లో సమన్యాయం ఏమాత్రం కనిపించడం లేదు. సంజు శాంసన్ లాంటి బ్యాటర్లను ఒక్క వైఫల్యంతో పక్కన పెడుతుంటే..కెఎల్ రాహుల్ లాంటి బ్యాటర్లు వరుసగా విఫలమవుతున్న టీమ్ మేనేజ్ మెంట్ పదేపదే అవకాశాలు కల్పిస్తూ వెనకేసుకు రావటం విమర్శలకు తావిస్తోంది....

భారత క్రికెట్లో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఏమాత్రం కొదువలేదు. ఒక్కో స్థానం కోసం ముగ్గురేసి క్రికెటర్లు పోటీపడుతున్నారు. టెస్ట్, వన్డే, టీ-20..ఏ ఫార్మాట్ చూసినా ఇదే పరిస్థితి. అయితే..దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న ప్రతిభావంతులైన ఆటగాళ్లను పక్కన పెట్టి..కొందరి కోసమే భారత టీమ్ మేనేజ్ మెంట్ ప్రాకులాడటం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

క్లాస్ పర్మెనెంట్..ఫామ్ టెంపరరీ...

జెంటిల్మన్ గేమ్ క్రికెట్లో క్లాస్ పర్మినెంట్, ఫామ్ టెంపరరీ అన్న ఓ నానుడి ఉంది. ప్రతిభ ప్రధానం కానీ..పరుగులు ముఖ్యం కాదన్నది దాని భావన. నైపుణ్యం, ప్రతిభ అనేవి ఉంటే..ఎక్కడైనా, ఎప్పుడైనా రాణించగలరన్నది రాహుల్ ద్రావిడ్ లాంటి క్రికెట్ మేధావుల నమ్మకం.

గతంలో ఆటగాళ్లకు ఒకటి రెండు అవకాశాలు ఇచ్చి రాణించకుంటే జట్టు నుంచి తప్పించేవారు. అయితే ఇటీవలి కాలంలో సంజు శాంసన్ లాంటి అపారప్రతిభ కలిగిన బ్యాటర్లకు కంటితుడుపుగా ఒకటి రెండు అవకాశాలు మాత్రమే ఇచ్చి..సత్తా చాటుకొనే అవకాశం ఇవ్వకుండానే, ప్రతిభనిరూపించుకోకుండానే పక్కన పెట్టేస్తున్నారు.

Advertisement

అదే..టెస్టు ఓపెనర్ గా కెఎల్ రాహుల్ విషయంలో ఎక్కడలేని ఓర్పును పాటిస్తున్నారు. వరుసగా విఫలమవుతూ వస్తున్నా..మరెవ్వరూ అందుబాటులో లేరన్నట్లుగా రాహుల్ నే పట్టుకొని టీమ్ మేనేజ్ మెంట్ వేలాడుతోంది.

శుభ్ మన్ గిల్ , పృథ్వీ షాలను పక్కపెట్టి....

భారత టెస్టు జట్టు ఓపెనర్ స్థానం కోసం వెటరన్ శిఖర్ ధావన్ తో పాటు యువ బ్యాటర్లు శుభ్ మన్ గిల్, పృథ్వీ షా పోటీపడుతున్నారు. టెస్ట్ ఓపెనర్ ఓ స్థానాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ భర్తి చేస్తుంటే..రెండో స్థానం కోసం మయాంక్ అగర్వాల్ తో సహా మొత్తం నలుగురు పోటీపడుతున్నారు.

దేశవాళీ క్రికెట్లో పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, అంతర్జాతీయ క్రికెట్లో శుభ్ మన్ గిల్ నిలకడగా రాణిస్తున్నా, డబుల్ , ట్రిపుల్ సెంచరీలు అలవోకగా బాదేస్తున్నా..టీమ్ మేనేజ్ మెంట్ మాత్రం రాహుల్ వైపే మొగ్గుచూపుతోంది.

రాహుల్..ఎంతకాలమిలా?

కెఎల్ రాహుల్ ..అపారప్రతిభ కలిగిన ఓపెనర్. క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ రాణించగలిగిన సత్తా ఉన్న ఆటగాడు. అయితే నిలకడలేమి అతని పాలిట శాపంగా మారింది.

పది ఇన్నింగ్స్ కు ..ఓ సారి మాత్రమే రాణించడం గత రెండేళ్లుగా రాహుల్ కు ఓ అలవాటుగా మారింది.

ప్రధానంగా టెస్టు క్రికెట్లో రాహుల్ వరుస వైఫల్యాలతో జట్టుకే అలంకరణగా మారాడు. గత 10 టెస్టు ఇన్నింగ్స్ లో రాహుల్ సగటు కేవలం 17 పరుగులు మాత్రమే. ఓ అర్థశతకం మాత్రమే రాహుల్ సాధించగలిగాడు.

ఇక ..గత ఏడు ఇన్నింగ్స్ లో రాహుల్ సాధించిన స్కోర్లు 22, 23, 10, 2, 20, 17 ,1 మాత్రమే. ఆస్ట్ర్రేలియాతో జరుగుతున్న ప్రస్తుత బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ మొదటి రెండుటెస్టులు, నాలుగు ఇన్నింగ్స్ లో..రాహుల్ 20, 17, 1 స్కోర్లకే పరిమితమయ్యాడు. గత రెండు టెస్టులు, మూడుఇన్నింగ్స్ లో రాహుల్ మొత్తం 39 పరుగులు మాత్రమే చేయటం విమర్శలకు తావిస్తోంది.

రాహుల్ పై మాజీ క్రికెటర్ విమర్శలు..

భారత టెస్టు ఓపెనర్ గా రాహుల్ వరుసగా విఫలమవుతున్నా జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారంటూ భారత మాజీ ఫాస్ట్ బౌలర్, క్రికెట్ విమర్శకుడు వెంకటేశ్ ప్రసాద్ ప్రశ్నించాడు.

రాహుల్ ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాడని, అతనంటే తనకెంతో గౌరవమని..అయితే ..ఈ మధ్యకాలంలో అతని ఆటతీరు గాడితప్పిందని, జట్టుకే భారంగా మారాడని..అయినా ఎందుకు జట్టులో కొనసాగిస్తూ..ప్రతిభావంతులైన పృథ్వీ షా, శుభ్ మన్ గిల్ లాంటి బ్యాటర్లకు అన్యాయం చేస్తున్నారని బీసీసీఐని నిలదీశాడు.

ఒకటి రెండు సెంచరీలు చూపెడుతూ ఎంతకాలం జట్టులో కొనసాగుతాడంటూ చురకలంటించారు.

రాహుల్ ఐపీఎల్ ఆడకుండా..ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో ఆడటం ద్వారా సత్తా చాటుకోవాలని, ఆ తర్వాతే భారతజట్టులో చోటు సంపాదించుకోవాలని వెంకటేశ్ ప్రసాద్ సూచించాడు.

గతంలో చతేశ్వర్ పూజారాను జట్టు నుంచి తప్పించినప్పుడు..కౌంటీ క్రికెట్ లో ఆడి మరీ సత్తా చాటుకొని, తిరిగి జట్టులో చేరిన విషయాన్ని వెంకటేష్ ప్రసాద్ గుర్తు చేశారు.

రాహుల్ కు అండగా కెప్టెన్, కోచ్...

రాహుల్ వరుస వైఫల్యాలపై తమజట్టులో చర్చజరిగిందని, తమకు ప్రతిభ ముఖ్యంకానీ..పరుగులు కాదనీ కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. రాహుల్ లాంటి అసాధారణ క్రికెటర్ కు తగిన అవకాశాలు ఇవ్వటం ద్వారా నిలదొక్కుకొనే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశాడు.

మరోవైపు..భారత చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సైతం రాహుల్ వైఫల్యాలను సమర్ధించారు. ఆటలో వైఫల్యాలు సహజమని, విదేశీ టూర్లలో రాహుల్ సాధించిన అసాధారణ సెంచరీలు, జట్టుకు చేసిన సేవలను గుర్తుంచుకొని తగిన అవకాశాలు ఇస్తూవస్తున్నామని రాహుల్ ద్రావిడ్ చెప్పుకొచ్చారు.

ఇంగ్లండ్ తో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టులోనూ, దక్షిణాఫ్రికాతో జోహెన్స్ బర్గ్ సెంచూరియన్ పార్క్ వేదికగా జరిగిన టెస్టులోనూ రాహుల్ సాధించిన శతకాలు అత్యుత్తమమైనవని, అలాంటి సెంచరీలను అతికొద్దిమంది మాత్రమే సాధించగలరని ద్రావిడ్ కొనియాడారు.

అసాధారణ నైపుణ్యం, అమోఘమైన ప్రతిభ కలిగిన రాహుల్ లాంటి బహుముఖ ప్రజ్ఞావంతుడైన ఆటగాడిని..ఒకటి లేదా రెండు సిరీస్ ల్లో వైఫల్యాలతో పక్కన పెట్టలేమి భారత చీఫ్ కోచ్, కెప్టెన్ తేల్చి చెప్పారు.

ఇదిలాఉంటే..ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా మార్చి 1 నుంచి జరిగే మూడోటెస్టులో భారత ఓపెనర్ గా రాహుల్ ను పక్కన పెట్టి..యువఓపెనర్ శుభ్ మన్ గిల్ కు అవకాశమివ్వాలంటూ పలువురు మాజీ క్రికెటర్లు పట్టుబడుతున్నారు.

Next Story