Telugu Global
Sports

రాహుల్ అవుట్..ఐపీఎల్, టెస్ట్ లీగ్ ఫైనల్స్ కు దూరం

భారత స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్ గాయంతో ఐపీఎల్ తో పాటు..ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ కు సైతం దూరమయ్యాడు.

రాహుల్ అవుట్..ఐపీఎల్, టెస్ట్ లీగ్ ఫైనల్స్ కు దూరం
X

భారత స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్ గాయంతో ఐపీఎల్ తో పాటు..ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ కు సైతం దూరమయ్యాడు....

ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ ప్రారంభానికి కొద్దివారాల ముందే టాప్ ర్యాంకర్ భారత్ కు గట్టి దెబ్బ తగిలింది. ఐపీఎల్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో 10వ రౌండ్ మ్యాచ్ ఆడుతూ రాహుల్ తీవ్రంగా గాయపడ్డాడు.

లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా జరిగినమ్యాచ్ లో బెంగళూరు ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రాహుల్ ఫీల్డింగ్ చేస్తున్నసమయంలో కుడికాలినరానికి గట్టిదెబ్బ తగిలింది.

బాధతో విలవిల లాడిపోయిన రాహుల్ ఇద్దరి సహాయంతో డ్రెస్సింగ్ రూమ్ కు చేరుకోగలిగాడు. లక్నో చేజింగ్ కు దిగిన సమయంలో, గత్యంతరం లేని పరిస్థితిలో 10వ డౌన్ లో బ్యాటింగ్ కు దిగినా వికెట్ల నడుమ పరుగెత్తలేకపోయాడు. ఈ లోస్కోరింగ్ మ్యాచ్ లో కేవలం రాహుల్ గాయం కారణంగానే సూపర్ జెయింట్స్ జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

మొత్తం 14 రౌండ్ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ 10వ రౌండ్ మ్యాచ్ ముగిసే సమయానికి లక్నో సూపర్ జెయింట్స్..5 విజయాలు, 4 పరాజయాలతో 11 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ 2వ స్థానంలో కొనసాగుతోంది.

అయితే..మిగిలిన నాలుగు రౌండ్ల మ్యాచ్ ల్లో లక్నో తన కెప్టెన్ రాహుల్ లేకుండానే పాల్గొనాల్సి ఉంది.

రాహుల్ కు ఆపరేషన్.....

కుడికాలినరానికి గాయం కావడంతో హుటాహుటిన ముంబై చేరుకొన్న రాహుల్ కు స్కానింగ్ నిర్వహించిన అనంతరం ఆపరేషన్ అనివార్యమని వైద్యులు ప్రకటించారు.

శస్త్ర్రచికిత్స తర్వాత గాయం నుంచి పూర్తిగా తేరుకోడానికి రాహుల్ చాలా సమయమే విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కొద్దివారాలపాటు రాహుల్ ఆటకు దూరం కావడంతో..ప్రస్తుత సీజన్లోని మిగిలిన ఐపీఎల్ మ్యాచ్ లతో పాటు..వచ్చేనెలలో ఇంగ్లండ్ లోని ఓవల్ వేదికగా జరిగే ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్లో పాల్గొనే భారతజట్టుకు దూరంకావాల్సి ఉంది.

రాహుల్ స్థానంలో కృణాల్ పాండ్యాకి పగ్గాలు...

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నుంచి గాయంతో రాహుల్ వైదొలగడంతో..నాయకత్వ బాధ్యతల్ని స్పిన్ ఆల్ రౌండర్ కృణాల్ పాండ్యా చేపట్టనున్నాడు.

మరోవైపు..గాయంతో తాను జట్టుకు దూరమైనా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆడే మిగిలిన మ్యాచ్ లు చూస్తూ ప్రోత్సహిస్తూనే ఉంటానని రాహుల్ ప్రకటించాడు.

రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకొనే వరకూ బాధ్యత తమదేనని, రాహుల్ కు అత్యుత్తమ వైద్యం అందిస్తామని లక్నో ఫ్రాంచైజీ ప్రకటించింది. రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోడానికి చాలాసమయమే పడుతుందని, తాము అన్నివిధాల అండగా ఉంటామని లక్నో ఫ్రాంచైజీ ప్రతినిధి తెలిపారు.

భారత క్రికెట్లో మూడు ఫార్మాట్లలోనూ ఆడే సత్తా కలిగిన అతికొద్ది మంది బ్యాటర్లలో ఒకడిగా 31 సంవత్సరాల రాహుల్ గుర్తింపు సంపాదించాడు. వన్డే జట్టుకు వికెట్ కీపర్ బ్యాటర్ గా సేవలు అందిస్తున్న రాహుల్..భారత టెస్టు జట్టు టాపార్డర్ లోనూ కీలక ఆటగాడిగా ఉన్నాడు.

జూన్ 7 నుంచి 11 వరకూ ఓవల్ వేదికగా ఆస్ట్ర్రేలియాతో జరిగే టెస్టు లీగ్ ఫైనల్లో పాల్గొనే భారతజట్టుకు రాహుల్ దూరం కావడంతో..సూర్యకుమార్ యాదవ్ ను స్టాండ్ బైగా బీసీసీఐ ఎంపిక సంఘం ఖరారు చేసింది.

ఆటలో గాయాలు భాగమని, అభిమానులు, శ్రేయోభిలాషుల అండదండలతో పూర్తిగా కోలుకొని, మరింత ఫిట్ నెస్ తో తిరిగి భారతజట్టులో చేరుతానని రాహుల్ ట్వి్ట్టర్ ద్వారా ప్రకటించాడు.



First Published:  5 May 2023 12:03 PM GMT
Next Story