Telugu Global
Sports

తెలుగు బ్యాడ్మింటన్ స్టార్ కు 'ఖేల్ రత్న' పురస్కారం!

తెలుగుతేజం, భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ కు దేశఅత్యున్నత క్రీడాపురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న ఖాయమయ్యింది.

తెలుగు బ్యాడ్మింటన్ స్టార్ కు ఖేల్ రత్న పురస్కారం!
X

తెలుగుతేజం, భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ కు దేశఅత్యున్నత క్రీడాపురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న ఖాయమయ్యింది...

దేశఅత్యున్నత క్రీడాపురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాన్ని భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ఖాయం చేసుకొన్నారు.

2023 సంవత్సరానికి ఈ ప్రపంచ నంబర్ వన్ జోడీకి ఖేల్ రత్న పురస్కారం అందచేయాలంటూ అవార్డుల ఎంపిక సంఘం సిఫారసు చేసింది.

ఆంధ్ర బ్యాడ్మింటన్ మూడో ప్లేయర్.....

గతంలో పుల్లెల గోపీచంద్, పీవీ సింధు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం అందుకొన్న ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ స్టార్లు కాగా...ఇప్పుడు సాత్విక్ సాయిరాజ్ వారి సరసన నిలిచాడు. అరుదైన ఈ అవార్డు అందుకొన్న ఆంధ్రప్రదేశ్ మూడో బ్యాడ్మింటన్ ప్లేయర్ ఘనతను అమలాపురం కుర్రోడు సాత్విక్ సాయిరాజ్ దక్కించుకొన్నాడు.

గత ఏడాదికాలంలో ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో పలు అరుదైన విజయాలు, ప్రపంచ, కామన్వెల్త్ గేమ్స్, ఆసియాక్రీడల పతకాలు సాధించడం ద్వారా సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ ఏకంగా ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను చేరుకోడం ద్వారా చరిత్ర సృష్టించారు.

ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో గత రెండేళ్లుగా నిలకడగా రాణిస్తూ దేశానికి ఖ్యాతి తెచ్చిన ఈ జోడీ పేరును ఖేల్ రత్న పురస్కారానికి సిఫారసు చేయగా..అవార్డుల ఎంపిక సంఘం ఆమోదం తెలిపింది.

2024 జనవరి 9న న్యూఢిల్లీలోని రాష్ట్ర్రపతి భవన్ వేదికగా జరిగే ఓ కార్యక్రమంలో క్రీడాపురస్కారాలను రాష్ట్ర్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయనున్నారు.

26మంది అర్జున పురస్కారాలు...

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీతో సహా 25 మందికి అర్జున అవార్డులను ప్రభుత్వం అందచేయనుంది. ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించడం ద్వారా అత్యుత్తమ బౌలర్ అవార్డు అందుకొన్న 33 సంవత్సరాల షమీ అర్జున అవార్డు స్వీకరించనున్నాడు.

అర్జున అవార్డుకు ఎంపికైన ఇతర క్రీడాకారులలో హాకీ జోడీ కృష్ణ బహుదూర్ పాఠక్, సుశీల చాను, విలువిద్య క్రీడాకారులు ఓజాస్ ప్రవీణ్ డియోటేల్, ఆదితి గోపీచంద్ స్వామి, బాక్సర్ మహ్మద్ హుస్సాముద్దీన్, చదరంగ గ్రాండ్ మాస్టర్ వైశాలి, గోల్ఫర్ దీక్ష డాగర్, షూటర్ ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, ఈషాసింగ్, వస్తాదులు అంతిమ్ పంగల్, సునీల్ కుమార్, టీటీ ప్లేయర్ ఐహిక ముఖర్జీ, పారా ఆర్చర్ షీతల్ దేవీ ఉన్నారు.

డిసెంబర్ 13న క్రీడాపురస్కారాల కోసం వివిధ క్రీడాసంఘాలు తమ ప్లేయర్లను నామినేట్ చేయగా...ఎంపిక సంఘం వివరాలను పరిశీలించి ఆమోదం తెలిపింది.

ముగ్గురికి జీవనసాఫల్య పురస్కారాలు...

ఐదుగురు విఖ్యాత శిక్షకులకు ద్రోణాచార్య అవార్డులు, ముగ్గురు ప్రముఖులకు జీవనసాఫల్య పురస్కారాల కింద ధ్యాన్ చంద్ అవార్డులను అందచేయనున్నారు.

First Published:  25 Dec 2023 4:15 AM GMT
Next Story