Telugu Global
Sports

సూర్యాను ఆకాశానికి ఎత్తిన కపిల్!

తన దృష్టిలో సచిన్ టెండుల్కర్, వీవియన్ రిచర్డ్స్ , రికీ పాంటింగ్, విరాట్ కొహ్లీ గొప్పఆటగాళ్లని..ఈ దిగ్గజాల సరసన చేర్చదగిన ఆటగాడు సూర్యకుమార్ మాత్రమే నంటూ కపిల్ కితాబిచ్చాడు.

Suryakumar Yadav Praise Kapil Dev
X

సూర్యాను ఆకాశానికి ఎత్తిన కపిల్!

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ ను తన వినూత్న బ్యాటింగ్ తో ఉర్రూతలూగిస్తున్న భారత సంచలనం సూర్యకుమార్ యాదవ్ ను భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ప్రశంసల వర్షంతో ముంచెత్తాడు. సచిన్, వీవ్ రిచర్డ్స్, రికీ పాంటింగ్ ల సరసన సూర్యాను చేర్చాడు....

టీ-20 క్రికెట్లో నయా సంచలనం, మిస్టర్ 360 షాట్ మేకర్ సూర్యకుమార్ యాదవ్ పైన భారత మాజీ కెప్టెన్, దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించాడు.

సూర్య ఆటతీరు చూస్తుంటే ముచ్చటేస్తోందంటూ కపిల్ మురిసిపోయాడు.

వందేళ్లకు ఓ ఆటగాడు....

క్రికెట్ ఓ నిరంతర ప్రవాహమని, వచ్చే ఆటగాళ్లు వస్తుంటే..పోయేవాళ్లు పోతూ ఉంటారని..అయితే తమకంటూ ఓ చరిత్రను సృష్టించుకొనే బ్యాటర్లు అతికొద్దిమంది మాత్రమే ఉంటారని, అలాంటివారిలో సూర్యకుమార్ యాదవ్ కు సైతం చోటు ఉండితీరుతుందని కపిల్ చెప్పాడు.

రాజ్ కోట్ వేదికగా శ్రీలంకతో ముగిసిన ఆఖరి టీ-20 మ్యాచ్ లో సూర్యకుమార్ 112 పరుగుల నాటౌట్ స్కోరు సాధించిన తీరు అభిమానులకు మాత్రమే కాదు..తనలాంటి వారికీ కలకాలం గుర్తుండిపోతుందని కపిల్ కొనియాడాడు.

సచిన్, కొహ్లీ తర్వాత..ఆ స్థాయి బ్యాటర్లు భారత్ కు దొరుకుతారా అంటూ తాను మధనపడిపోయేవాడినని ..సూర్యకుమార్ ను చూసిన తర్వాత ఆ బెంగ తొలిగిపోయిందని ఓ ఇంటర్వ్యూలో కపిల్ తెలిపాడు.

ఆల్ టైమ్ గ్రేట్ల సరసన సూర్యాకు చోటు...

తన దృష్టిలో సచిన్ టెండుల్కర్, వీవియన్ రిచర్డ్స్ , రికీ పాంటింగ్, విరాట్ కొహ్లీ గొప్పఆటగాళ్లని..ఈ దిగ్గజాల సరసన చేర్చదగిన ఆటగాడు సూర్యకుమార్ మాత్రమే నంటూ కపిల్ కితాబిచ్చాడు.

సూర్యకుమార్ వినూత్న షాట్లతో బౌలర్లపై విరుచుకుపడుతున్న తీరు చూస్తుంటే గర్వంగా ఉందని, బ్యాటింగ్ క్రీజును చక్కగా వాడుకొంటూ...గ్రౌండ్ నలుమూలలకూ..360 డిగ్రీల రేంజ్ లో షాట్లు కొడుతూ చెలరేగిపోడం అపూర్వమని చెప్పాడు.

గతంలో సచిన్, వీవ్ రిచర్డ్స్, రికీ పాంటింగ్ ధాటిగా ఆడుతూ క్రికెట్ ను కొత్తపుంతలు తొక్కించారని, ఇప్పుడు వారి వారసుడిగా సూర్యకుమార్ కనిపిస్తున్నాడని ప్రశంసించారు.

క్రీజులోకి సూర్యకుమార్ ఆత్మవిశ్వాసంతో అడుగుపెడుతున్న తీరు, కొద్ది బంతుల వ్యవధిలోనే గేర్ మార్చి భారీషాట్లు కొడుతూ స్కోరుబోర్డును వడివడిగా పరుగులెత్తించడం అపూర్వమని చెప్పుకొచ్చాడు.

బౌలర్ ఎవరైనా లెక్కలేకుండా..ఆఫ్ సైడ్, ఆన్ సైడ్ అన్న తేడా లేకుండా సూర్య అలవోకగా షాట్లు కొడుతున్న తీరు చూస్తుంటే...రానున్నకాలం సూర్యాదేనని అనిపిస్తోందని కపిల్ అన్నాడు.

ఫైన్ లెగ్, స్క్వేర్ లెగ్, మిడాన్, మిడ్ వికెట్ ల మీదుగా సూర్యకుమార్ సిక్సర్లు బాదుతున్న తీరు చూస్తుంటే..ప్రత్యర్థిజట్ల బౌలర్లకు, కెప్టెన్లకు ఏం చేయాలో పాలుపోడం లేదని, రానున్న కాలంలో సూర్య ఇదేజోరు, నిలకడ కొనసాగించగలిగితే..ఆల్ టైమ్ గ్రేట్ బ్యాటర్లు సచిన్, పాంటింగ్, వీవ్ రిచర్డ్స్ ల సరసన నిలిచిపోడం ఖాయమని కపిల్ కితాబిచ్చాడు.

టీ-20 క్రికెట్ చరిత్రలోనే మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు వచ్చి మూడు శతకాలు బాదిన తొలి, ఏకైక బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మాత్రమే కావడం ఓ ప్రపంచ రికార్డుగా మిగిలిపోతుంది.

First Published:  9 Jan 2023 8:02 AM GMT
Next Story