Telugu Global
Sports

నేడే జూనియర్ ప్రపంచకప్ ఫైనల్స్..భారత్ కు ఆస్ట్ర్రేలియా సవాల్!

దక్షిణాఫ్రికా వేదికగా ఈరోజు జరిగే ఫైనల్లో ఐదుసార్లు విజేత భారత్ కు ఆస్ట్ర్రేలియా సవాలు విసురుతోంది.

నేడే జూనియర్ ప్రపంచకప్ ఫైనల్స్..భారత్ కు ఆస్ట్ర్రేలియా సవాల్!
X

2024-ఐసీసీ అండర్ -19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీటైటిల్ పోరుకు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. దక్షిణాఫ్రికా వేదికగా ఈరోజు జరిగే ఫైనల్లో ఐదుసార్లు విజేత భారత్ కు ఆస్ట్ర్రేలియా సవాలు విసురుతోంది.

16వ జూనియర్( అండర్ -19 ) ప్రపంచకప్ ఫైనల్ కు బెనోనీ విల్లీమోర్ గ్రౌండ్స్ వేదికగా రంగం సిద్ధమయ్యింది. 16 జట్ల ఈ గ్రూప్ లీగ్ కమ్ నాకౌట్ పోరులో రెండు అత్యుత్తమ జట్లుగా నిలిచిన భారత్- ఆస్ట్రేలియా టైటిల్ పోరుకు అర్హత సంపాదించాయి.

ఆరో టైటిల్ కు భారత్ గురి...

అండర్ -19 ప్రపంచకప్ చరిత్రలోనే ఐదుసార్లు విజేతగా నిలిచిన ఏకైకజట్టు భారత్ ఈరోజు జరిగే ఫైనల్లో హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది. వరుసగా ఐదోసారి ప్రపంచకప్ ఫైనల్స్ చేరడం ద్వారా తనకు తానే సాటిగా నిలిచిన భారత్ గ్రూపులీగ్ దశ నుంచి సూపర్ -6 రౌండ్ వరకూ తిరుగులేని విజయాలు సాధించింది. సెమీఫైనల్లో గట్టిపోటీ ఎదుర్కొని ఆతిథ్య దక్షిణాఫ్రికాను 2 వికెట్ల తేడాతో అధిగమించడం ద్వారా టైటిల్ కు అడుగు దూరంలో నిలిచింది.

రెండో సెమీఫైనల్లో ఆస్ట్ర్రేలియా సైతం పాక్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొని 2 వికెట్ల విజయంతోనే గట్టెక్క గలిగింది.

పవర్ ఫుల్ బ్యాటింగ్, పదునైన బౌలింగ్...

రాజస్థాన్ కు చెందిన స్పెషలిస్ట్ బ్యాటర్ ఉదయ్ సహ్రాన్ నాయకత్వంలోని భారతజట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో అత్యంత సమతూకంతో కనిపిస్తోంది.

పలువురు ప్రతిభావంతులైన కుర్రాళ్లతో కూడిన భారతజట్టులో సచిన్ దాస్ , ముషీర్ ఖాన్, అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, ప్రియాంశు మోల్యా, అరవిల్లి అవింశరావ్, సౌమ్య కుమార్ పాండే, మురుగన్ అభిషేక్, ఇన్నెశ్ మహాజన్, ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబానీ, నమన్ తివారీ సభ్యులుగా ఉన్నారు.

ముందుగా బ్యాటింగ్ కు దిగిన సమయంలోనే అత్యధిక విజయాలు సాధించిన భారతజట్టు..సెమీఫైనల్లో మాత్రం చేజింగ్ విజయంతో సత్తా చాటుకొంది.

ఈ రోజు జరిగే టైటిల్ పోరులో ఆస్ట్ర్రేలియా నుంచి భారత్ కు అడుగడుగునా గట్టి పోటీ ఎదురుకానుంది.

అత్యంత విజయవంతమైన జట్టుగా భారత్....

19 సంవత్సరాల లోపు కుర్రాళ్లకు నిర్వహించే జూనియర్ ప్రపంచకప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా భారత్ కొనసాగుతోంది.

1988 నుంచి రెండేళ్లకు ఓమారు నిర్వహిస్తూ వస్తున్న ఈ టోర్నీఫైనల్స్ కు తొమ్మిదిసార్లు చేరిన ఒకే ఒక్కజట్టుగా, ఐదుసార్లు విజేతగా నిలిచిన ఏకైకజట్టుగా భారత్ కు రికార్డు ఉంది.

మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్, అంబటి రాయుడు, విరాట్ కొహ్లీ, ఉన్ముక్త్ చంద్, పృథ్వీ షా, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నోయ్ లాంటి ఎందరో ప్రతిభావంతులైన, ప్రపంచ మేటి సూపర్ స్టార్ క్రికెటర్లు ఈ అండర్ -19 ప్రపంచకప్ ద్వారా వెలుగులోకి వచ్చినవారే.

1988 నుంచి 2020 వరకూ జరిగిన ప్రపంచకప్ టోర్నీలలో భారత్ (2000 , 2008, 2012, 2018, 2022); ఆస్ట్ర్రేలియా (1988, 2002, 2010); పాకిస్థాన్ (2004, 2006); ఇంగ్రండ్ (1998); దక్షిణాఫ్రికా (2014); వెస్టిండీస్ (2016); బంగ్లాదేశ్ (2020) విజేతలుగా నిలిచాయి.

ప్రపంచకప్ నెగ్గి తీరుతాం- ఉదయ్...

భారత్ ను మరోసారి విశ్వవిజేతగా నిలపడమే తన లక్ష్యమని, తమజట్టు ప్రపంచ కప్ నెగ్గి తీరుతుందని భారత కెప్టెన్ ఉదయ్ సహ్రాన్ ప్రకటించాడు. ప్రత్యర్థి ఎవరన్నది తమకు ముఖ్యం కాదని, ఆట అన్ని విభాగాలలోనూ రాణించడమే తమ లక్ష్యమని తెలిపాడు.

ఓపెనర్ అర్షిన్ కులకర్ణీ, వన్ డౌన్ ముషీర్ ఖాన్, కెప్టెన్ సహ్రాన్, మిడిలార్డర్ బ్యాటర్ సచిన్ దాస్ లపైనే భారత బ్యాటింగ్ పూర్తిగా ఆధారపడి ఉంది. బౌలింగ్ లో ఫాస్ట్ బౌలర్ల జోడీ రాజ్ లింబానీ, నమన్ తివారీ, స్పిన్నర్ల త్రయం ముషీర్ ఖాన్, సౌమ్య కుమార్ పాండే, ప్రియాంశు మాల్యా కీలకపాత్ర పోషించనున్నారు.

స్థాయికి తగ్గట్టుగా ఆడితే భారత్ రికార్డుస్థాయిలో ఆరోసారి జూనియర్ ప్రపంచకప్ విజేతగా నిలవడం ఏమంత కష్టం కాబోదు.

First Published:  11 Feb 2024 3:49 AM GMT
Next Story