Telugu Global
Sports

వికెట్ల వేటలో బుమ్రా 'బూమ్ బూమ్' రికార్డు!

భారత ఫాస్ట్ బౌలర్ బూమ్ బూమ్ బుమ్రా టెస్టు క్రికెట్లో మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. విశాఖటెస్టు రెండోరోజు ఆటలో ఈ ఘనత సాధించాడు.

వికెట్ల వేటలో బుమ్రా బూమ్ బూమ్ రికార్డు!
X

భారత ఫాస్ట్ బౌలర్ బూమ్ బూమ్ బుమ్రా టెస్టు క్రికెట్లో మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. విశాఖటెస్టు రెండోరోజు ఆటలో ఈ ఘనత సాధించాడు.

భారత వైస్ కెప్టెన్, యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా సాంప్రదాయ టెస్టు క్రికెట్లో తన వికెట్ల హోరు, రికార్డుల జోరును కొనసాగిస్తున్నాడు. ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని రెండోటెస్టు రెండోరోజుఆటలోనే ప్రత్యర్థిని 253 పరుగులకే కుప్పకూల్చడంలో ప్రధానపాత్ర వహించాడు.

34 టెస్టుల్లోనే అత్యంత వేగంగా...

భారత బౌలింగ్ ఎటాక్ కు ఆయువుపట్టులాంటి బుమ్రాకు గంటకు 140 కిలోమీటర్ల సగటువేగంతో బౌలింగ్ చేస్తూ...వైవిద్యభరితమైన అస్త్రాల నడుమ యార్కర్లను సంధించడంలో మొనగాడి బౌలర్ గా పేరుంది.

ప్రస్తుత సీజన్ టెస్టులీగ్ లో బుమ్రా నిలకడగా రాణిస్తూ ప్రత్యర్థిజట్ల బ్యాటర్ల వెన్నులో ఒణుకు పుట్టిస్తూ వస్తున్నాడు. ప్రస్తుత 5 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా హైదరాబాద్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో మాత్రమే కాదు..రెండోటెస్టులో సైతం బుమ్రా వికెట్ల వేట జోరుగా సాగుతోంది.

విశాఖ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం వేదికగా జరుగుతున్న రెండోటెస్టు రెండోరోజుఆటలోనే బుమ్రా చెలరేగిపోయాడు. ఏకంగా 6 వికెట్లు పడగొట్టడం ద్వారా ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ ను చెల్లాచెదురు చేశాడు.

కపిల్ ను మించిన బుమ్రా..

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ను పడగొట్టడం ద్వారా బుమ్రా 150 టెస్టు వికెట్ల మైలురాయిని చేరాడు. ఈ క్రమంలో అత్యంత వేగంగా 150 టెస్టు వికెట్లు పడగొట్టిన భారత ఫాస్ట్ బౌలర్ గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ఇప్పటి వరకూ కపిల్ దేవ్ పేరుతో ఉన్న 35 మ్యాచ్ ల రికార్డును బుమ్రా 34 మ్యాచ్ లతోనే సవరించాడు. బుమ్రా కేవలం 45 పరుగులకే 6 వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 253 పరుగులకే ఆలౌట్ కావడం, భారత్ కు 143 పరుగుల కీలక తొలిఇన్నింగ్స్ ఆధిక్యత దక్కడం జరిగిపోయాయి.

దిగ్గజ ఫాస్ట్ బౌలర్ల వరుసలో...

దశాబ్దాలు కలిగిన టెస్టు క్రికెట్ చరిత్రలో అతితక్కువ టెస్టుల్లో..అత్యంత వేగంగా 150 వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్ ప్రపంచ రికార్డు పాకిస్థాన్ దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్ పేరుతో ఉంది.

వకార్ కేవలం 27 టెస్టుల్లోనే 150 వికెట్లు సాధిస్తే..ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ సిడ్నీ ఫ్రాన్సిస్ బార్నెస్ 24 గేమ్ ల్లోనే 150 వికెట్ల ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ 29 టెస్టుల్లో 150 వికెట్లు, రవీంద్ర జడేజా 32 టెస్టుల్లో 150 వికెట్ల రికార్డులు నెలకొల్పగలిగారు.

కంగారూ ఫాస్ట్ బౌలర్ల జోడీ గ్లెన్ మెక్ గ్రాత్ , మిషెల్ జాన్సన్ 34 టెస్టుల్లో కానీ 150 వికెట్ల రికార్డు సాధించలేకపోయారు. స్పిన్ బౌలర్లకు అనువుగా ఉన్న విశాఖ పిచ్ పైన బుమ్రా అత్యుత్తమంగా రాణించడం ద్వారా 6 వికెట్లు పడగొట్టగలిగాడు.

బుమ్రా 20.28 సగటుతో 150 వికెట్ల రికార్డు నెలకొల్పాడు. భారతగడ్డపై జరిగిన టెస్టుమ్యాచ్ ల్లో బుమ్రా అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన విశాఖ టెస్టులో సాధించినదే కావడం విశేషం.

దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ వేదికగా జరిగిన 2024సిరీస్ టెస్టులో 61 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టిన బుమ్రా..ప్రస్తుత విశాఖ టెస్టులో 45 పరుగులకే 6 వికెట్లు సాధించడం విశేషం.

First Published:  4 Feb 2024 3:00 AM GMT
Next Story