Telugu Global
Sports

బుమ్రా..ఏదో ఒకటి తేల్చుకో- దిగ్గజ పేసర్ సలహా!

గాయాలతో భారతజట్టుకు దూరమైన కీలక ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాకు..కంగారూ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ జెఫ్ థాంప్సన్ విలువైన సలహా ఇచ్చాడు.

బుమ్రా..ఏదో ఒకటి తేల్చుకో- దిగ్గజ పేసర్ సలహా!
X

గాయాలతో భారతజట్టుకు దూరమైన కీలక ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాకు..కంగారూ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ జెఫ్ థాంప్సన్ విలువైన సలహా ఇచ్చాడు. అన్ని ఫార్మాట్లలోనూ ఆడాలంటే ఫాస్ట్ బౌలర్లకు గాయాలు తప్పవంటూ హెచ్చరించాడు...

జస్ ప్రీత్ బుమ్రా..భారత క్రికెట్ కు ఎంతో విలువైన, కీలకమైన బౌలర్. క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ భారత బౌలింగ్ కు వెన్నెముక లాంటి యార్కర్ల కింగ్ బుమ్రా వెన్నెముక గాయంతో గత టీ-20 ప్రపంచకప్ నుంచి భారతజట్టుకు దూరమయ్యాడు.

దుబాయ్ వేదికగా జరిగిన టీ-20 ఆసియాకప్, ఆస్ట్ర్రేలియా వేదికగా ముగిసిన టీ-20 ప్రపంచకప్ టోర్నీలలో భారత్ విఫలం కావటానికి బుమ్రా లేకపోవటమే కారణమని తేలిపోయింది.

టీ-20, వన్డే, టెస్టు ఫార్మాట్లలో భారతజట్టుకు తురుపుముక్కలాంటి బుమ్రా గత ఏడాది కాలంగా తరచూ గాయాలపాలవుతూ జట్టుకు అందుబాటులో లేకపోడం ఆందోళన కలిగిస్తోంది.

కీలక టోర్నీలకు బుమ్రా అందుబాటులో లేకపోడంతో భారతజట్టు భారీమూల్యమే చెల్లించింది.

నిరంతరటోర్నీలతో అసలుకే ఎసరు...

భారతజట్టు క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ ఎడతెరిపిలేని సిరీస్ లు ఆడుతూ రావటం..అదీ చాలదన్నట్లుగా ఏటా జరిగే ఐపీఎల్ లో పాల్గొనటం కూడా బుమ్రాను గాయాలపాలయ్యేలా చేసింది.

గాయాల నుంచి పూర్తిగా కోలుకోకుండానే సిరీస్ వెంట సిరీస్ రావడంతో జట్టుపైన మాత్రమే కాదు..బుమ్రా పైన ఒత్తిడి పెరిగిపోతోంది. 2022 ఆసియాకప్ టీ-20 టోర్నీ నుంచి జట్టుకు అందుబాటులో లేని బుమ్రా ఆ తర్వాత చికిత్స, విశ్రాంతితో పూర్తిగా కోలుకొన్నట్లే కనిపించాడు. న్యూజిలాండ్ తో జరిగే సిరీస్ కు సైతం ఎంపికయ్యాడు. అయితే టీ-20 సిరీస్ తొలిమ్యాచ్ ప్రారంభంకావటానికి కొద్దిరోజుల ముందే బుమ్రా వెన్నెముక నొప్పి తిరగబెట్టినట్లుగా అనుమానం రావటంతో జట్టుకు దూరంగా ఉంచారు. ఆస్ట్ర్రేలియాతో జరిగే నాలుగుమ్యాచ్ ల కీలక టెస్టు సిరీస్ కు అందుబాటులో ఉంటే చాలునంటూ టీమ్ మేనేజ్ మెంట్ భావించింది.

టెస్టు ఫార్మాట్ కు బుమ్రా కష్టమే..

బుమ్రా లాంటి కీలక బౌలర్ తగిన విశ్రాంతి లేకండా ఐసీసీ వన్డే ప్రపంచకప్ తో పాటు..టీ-20 సిరీస్ లూ, ఐసీసీ టెస్టు లీగ్ పోటీలలో పాల్గొనటం అంతతేలికకాదని, బుమ్రా వైట్ బాల్ క్రికెట్ లేదా టెస్టు క్రికెట్ కు మాత్రమే పరిమితం కావాలంటూ ఆస్ట్ర్రేలియా ఫాస్ట్ బౌలింగ్ గ్రేట్ జెఫ్ థాంప్సన్ సలహా ఇచ్చాడు.

ఫాస్ట్ బౌలింగ్ అంటే అంతతేలిక కాదని, తాము ఆడేరోజుల్లో క్రికెట్ కు సీజన్లు, టూర్లు మాత్రమే ఉండేవని..అయితే..టీ-20, వన్డే సిరీస్ లతో పాటు ప్రయివేటు లీగ్ లు సైతం ఎక్కువై పోయాయని..నేటి తరం ఆటగాళ్లకు..ప్రధానంగా ఫాస్ట్ బౌలర్లకు నిరంతరం ఆడటం, ఫిట్ గా ఉండటం అంతతేలిక కాదని చెప్పాడు.

బుమ్రా తన భవిష్యత్ గురించి తానే ఆలోచించుకోవాలని, వన్డే , టీ-20 ఫార్మాట్లకు పరిమితం కావాలో లేదా..టెస్టు క్రికెట్ కే ప్రాధాన్యమివ్వాలా అన్నది నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చిందని థాంప్సన్ చెప్పాడు.

1973 నుంచి 1985 మధ్యకాలంలో ప్రపంచ మేటి ఫాస్ట్ బౌలర్ గా గుర్తింపు పొందిన జెఫ్ థాంప్సన్ కు 51 టెస్టులు ఆడి 200కు పైగా వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది.

వైట్ బాల్ క్రికెట్టే మేలు..

బుమ్రా తన కెరియర్ ను మరికొన్ని సంవత్సరాలపాటు కొనసాగించాలని అనుకొంటే..టెస్టు క్రికెట్ కంటే టీ-20, వన్డే ఫార్మాట్లకే పరిమితమైతే మంచిదని థాంప్సన్ చెప్పాడు.

కెరియర్ తో పాటు సంపాదనా ముఖ్యమేనని అన్నాడు.

ప్రపంచ మేటి ఫాస్ట్ బౌలర్ గా బుమ్రా భవిష్యత్ కేవలం బుమ్రా ఆలోచనలు, నిర్ణయాలపైనే ఆధారపడి ఉందని చెప్పాడు.

29 సంవత్సరాల బుమ్రాకు తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 30 టెస్టుల్లో 128 వికెట్లు, 72 వన్డేలలో 121 వికెట్లు, 60 అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ల్లో 70 వికెట్లు, 120 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 145 వికెట్లు పడగొట్టిన అసాధారణ రికార్డు ఉంది.

ఆస్ట్ర్రేలియాతో ఈనెల 9నుంచి ప్రారంభంకానున్న నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరి రెండుటెస్టులకు మాత్రమే బుమ్రా అందుబాటులోకి రానున్నాడు.

First Published:  4 Feb 2023 8:08 AM GMT
Next Story