Telugu Global
Sports

భారత్ లో ఆడినట్లే ఉంది- గాల్లో తేలిపోతున్న బుమ్రా!

న్యూయార్క్ లో ప్రపంచకప్ మ్యాచ్ లు ఆడుతుంటే స్వదేశంలో ఆడినట్లుగానే ఉందంటూ భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా మురిసిపోతున్నాడు.

భారత్ లో ఆడినట్లే ఉంది- గాల్లో తేలిపోతున్న బుమ్రా!
X

న్యూయార్క్ లో ప్రపంచకప్ మ్యాచ్ లు ఆడుతుంటే స్వదేశంలో ఆడినట్లుగానే ఉందంటూ భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా మురిసిపోతున్నాడు.

2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ గ్రూప్ - ఏ లీగ్ మ్యాచ్ లను అమెరికాలోని న్యూయార్క్ వేదికగా ఆడుతుంటే..అచ్చం భారత గడ్డపైనే ఆడుతున్నట్లుగా అనిపించిందంటూ భారత ఓపెనింగ్ బౌలర్, యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా సంబర పడిపోతున్నాడు.

మ్యాచ్ విన్నర్ జస్ ప్రీత్ బుమ్రా....

న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్ ప్రపంచకప్ గ్రూప్- ఏ లీగ్ లోని రెండుమ్యాచ్ లను ఇప్పటికే ఆడేసింది. ప్రారంభమ్యాచ్ లో పసికూన ఐర్లాండ్ ను చిత్తు చేసిన భారత్..తన రెండోమ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై 6 పరుగులతో సంచలన విజయం సాధించింది.

కేవలం 119 పరుగుల స్వల్పలక్ష్యాన్ని భారతజట్టు కాపాడుకోడమేకాదు..విజేతగా కూడా నిలవడంలో జస్ ప్రీత్ బుమ్రా ప్రధానపాత్ర వహించాడు. పాక్ అగ్రశ్రేణి బ్యాటర్లు బాబర్ అజమ్, రిజ్వాన్ లతో పాటు ఇఫ్తీకార్ అహ్మద్ ను అవుట్ చేయడం ద్వారా భారత విజయంలో బుమ్రా కీలకపాత్ర పోషించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సైతం బుమ్రానే కైవసం చేసుకొన్నాడు.

టీ-20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకూ పాక్ ప్రత్యర్థిగా ఎనిమిదిసార్లు తలపడిన భారత్ కు ఇది 7వ విజయం. భారత్ 7 విజయాలు సాధించి..ఒకే ఒక్కసారి పాక్ చేతిలో ఓటమి చవిచూసింది.

నిండుకుండలా న్యూయార్క్ స్టేడియం...

చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ జట్లు తలపడిన ఈ సూపర్ డూపర్ సండే ఫైట్ కు భారత్, పాక్ సంతతి అభిమానులు భారీసంఖ్యలో తరలి వచ్చారు. మొత్తం 24వేల సీటింగ్ కెపాసిటీ కలిగిన నసావు స్టేడియం నిండుకుండలా మారిపోయింది. ప్రీమియం క్లాస్ టికెట్ 9 లక్షల రూపాయల ధర పలికిందంటే ..అభిమానులు ఏస్థాయిలో మ్యాచ్ చూడటానికి ఆసక్తి చూపారే మరి చెప్పాల్సిన పనిలేదు.

నసావు స్టేడియంలో ఆడుతుంటే తనకు స్వదేశంలో ఆడుతున్న భావన కలిగిందని, ఎటుచూసినా భారత అభిమానులే కనిపించారని, ఉభయదేశాల అభిమానుల కేరింతలతో స్టేడియం సందడి సందడిగా కనిపించిందని మ్యాచ్ అనంతరం బుమ్రా వ్యాఖ్యానించాడు.

ఇదే వేదికగా ఐర్లాండ్ తో జరిగిన ప్రారంభమ్యాచ్ లో అత్యధిక మేడిన్ ఓవర్లు వేసిన ఫాస్ట్ బౌలర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పిన బుమ్రా...పాక్ పైన 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టడం ద్వారా టీ-20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత పేసర్ గా మరో రికార్డు సాధించాడు. పాక్ పై బుమ్రా వేసిన 24 బంతుల్లో 14 డాల్ బాల్స్ ఉండటం విశేషం.

బుధవారం ఆతిథ్య అమెరికాతో నసావు స్టేడియం వేదికగానే తలపడటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. పసికూన అమెరికాజట్టును తాము ఏమాత్రం తక్కువగా అంచనావేయడం లేదని, గట్టిపోటీ తమకు ఎదురుకానుందని చెప్పాడు.

అమెరికాలో ప్రపంచకప్ ఆడతానని అనుకోలేదు- విరాట్

క్రికెట్ నేపథ్యం, మూలాలు ఏమాత్రం లేని అమెరికా వేదికగా తాను ప్రపంచకప్ మ్యాచ్ లు ఆడతానని కలనైనా అనుకోలేదని, ఇదో వింత అనుభవమని భారత మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ చెప్పాడు.

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ -17 టోర్నీలో 704 పరుగులు సాధించడం ద్వారా ఆరెంజ్ క్యాప్ ను కైవసం చేసుకొన్న విరాట్...ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ లో ఆడిన మొదటి రెండుమ్యాచ్ ల్లో సింగిల్ డిజిట్ స్కోర్లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. న్యూయార్క్ లోని నసావు పిచ్ పేస్ బౌలర్లకు అనువుగా ఉండడంతో లోస్కోరింగ్ మ్యాచ్ లే నమోదవుతూ వస్తున్నాయి. భారత్ సాధించిన 119 పరుగుల స్కోరే మ్యాచ్ విన్నింగ్ స్కోరుగా నిలవడం విశేషం. మాజీ చాంపియన్లు పాక్ , శ్రీలంకతో పాటు న్యూజిలాండ్ సైతం అనుకోని పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది.

మొత్తం 20 దేశాలజట్లు..నాలుగు గ్రూపులుగా తలపడుతున్న లీగ్ దశ పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. గ్రూప్- ఏ లీగ్ లో భారత్ రెండుకు రెండుమ్యాచ్ లూ నెగ్గి 4 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిస్తే..ఆతిథ్య అమెరికా సైతం 4 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచింది. పాక్ జట్టు రెండుకు రెండుమ్యాచ్ లూ ఓడి మూడోస్థానానికి పడిపోయింది.

లీగ్ దశలో తమ తమ గ్రూపుల్లో మొదటి రెండుస్థానాల్లో నిలిచిన 8 జట్లతో ..ప్రపంచకప్ రెండోదశ సూపర్-8 ను నిర్వహించనున్నారు.

ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత్ గ్రూపులీగ్ మిగిలిన రెండుమ్యాచ్ ల్లో అమెరికా, కెనడా జట్లతో తలపడాల్సి ఉంది.

బుధవారం న్యూయార్క్ వేదికగా జరిగే మూడోరౌండ్ పోరులో అమెరికాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఎక్కువమంది భారత సంతతి ఆటగాళ్లతో కూడిన అమెరికా తన ప్రారంభమ్యాచ్ లో కెనడాను, రెండోమ్యాచ్ లో పాక్ ను కంగు తినిపించడం ద్వారా సూపర్- 8 రౌండ్ అర్హత కోసం తహతహలాడుతోంది.

First Published:  11 Jun 2024 9:50 AM GMT
Next Story