Telugu Global
Sports

జగదేక (టెన్నిస్) వీరుడు రోజర్ ఫెదరర్!

ప్రపంచ టెన్నిస్ ను గత 24 సంవత్సరాలుగా కొత్తపుంతలు తొక్కించిన గ్రాండ్ స్లామ్ కింగ్ రోజర్ ఫెదరర్ 41 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ప్రకటించాడు.

జగదేక (టెన్నిస్) వీరుడు రోజర్ ఫెదరర్!
X

ప్రపంచ టెన్నిస్ ను గత 24 సంవత్సరాలుగా కొత్తపుంతలు తొక్కించిన గ్రాండ్ స్లామ్ కింగ్ రోజర్ ఫెదరర్ 41 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ప్రకటించాడు. తన ఆటతీరుతో కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో చోటు సంపాదించిన ఫెదరర్ లాంటి ఆటగాడు రావాలంటే మరో నూరేళ్లు వేచిచూడక తప్పదు....

రోజర్ ఫెదరర్..విశ్వక్రీడాభిమానులకు సుపరిచితమైన పేరు. రోజర్ ఫెదరర్...కేవలం రాయల్ గేమ్ టెన్నిస్ కోసమే పుట్టిన ఆటగాడు. తన ఆటతీరు, విలక్షణ వ్యక్తిత్వం,

మృదుభాషణంతో శత్రువులను, ప్రత్యర్థులను సైతం మిత్రులుగా మార్చుకొన్న మేరునగధీరుడు.

ముక్కోపి నుంచి మృదుస్వభావిగా....

స్విట్జర్లాండ్ లోని ఓ స్విస్ తండ్రి, దక్షిణాఫ్రికా తల్లికి జన్మించిన రోజర్ ఫెదరర్ యుక్తవయసులో ముక్కోపి. అసహనానికి మరోపేరు. టెన్నిస్ ఆడుతున్న సమయంలో

వైఫల్యం, ఓటమి ఎదురైనా ఏమాత్రం భరించలేని తనం, తాను ఆడే రాకెట్లను విరిచేయడం ద్వారా తలబిరుసుగా ప్రవర్తించేవాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న ఫెదరర్...ప్రొఫెషనల్ టెన్నిస్ లో అడుగుపెట్టిన వెంటనే శాంతమూర్తిగా, మృదుస్వభావిగా, చిరునవ్వుతో ఎదుటివారిని తనఅభిమానిగా మార్చుకొనే స్థాయికి ఎదిగాడు.

రోజర్ ఫెదరర్ టెన్నిస్ ఆడుతున్నాడంటే ...టోర్నీ ఏదైనా స్టేడియంలోని స్టాండ్ లు కిటకిటలాడాల్సిందే.


కళాత్మక క్రీడాకారుడు రోజర్...

టెన్నిస్ కు రాయల్ గేమ్ గా పేరుంది. ఎంతో హుందాగా, గొప్పగా సాగే ఈ క్రీడలో అంతే గొప్పగా ఆడే క్రీడాకారులు అత్యంత అరుదుగా కనిపిస్తారు. అలాంటి అరుదైన ఆటగాళ్లకే అగ్రగణ్యుడు రోజర్ ఫెదరర్. బ్యాక్ హ్యాండ్, ఫోర్ హ్యాండ్ షాట్లు కొట్టడంలో తనకుతానే సాటి. కుదురైన గ్రౌండ్ స్ట్ర్రోక్ లు, పదునైన సెర్వ్ తో రోజర్ పరిపూర్ణ ఆటగాడిగా గుర్తింపు పొందాడు.

ఫెదరర్ కోర్టులో కదులుతుంటే, ఆడుతుంటే..సొగసుగా షాట్లు కొడుతుంటే ఓ రసాత్మక కవిత్వం చదువుతున్నట్లుగా ఉంటుంది. మొరటు తనం, దుందుడుకు స్వభావం అతని ఆటతీరులో మచ్చుకైనా కనిపించవు.

ఫెదరర్ తనదైన శైలిలో సుతారంగా షాట్లు కొడుతుంటే స్టాండ్స్ లోని వందలాదిమంది అభిమానులు మాత్రమే కాదు...ప్రత్యర్థి సైతం సంభ్రమాశ్చర్యాలకు గురికాక తప్పదు.


24 ఏళ్లు 24 రోజుల్లా....

24 సంవత్సరాల తన కెరియర్ 24 రోజుల్లా గడచిపోయిందని 103 టూర్ టైటిల్స్, 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన ఫెదరర్ తన రిటైర్మెంట్ ప్రకటనలో పేర్కొన్నాడు.

గత మూడేళ్లుగా తాను పలురకాల గాయాలతో ఫిట్ నెస్ సమస్యలు ఎదుర్కొన్నానని, శస్త్రచికిత్సలు చేయించుకొన్నా..అంతర్జాతీయస్థాయి టెన్నిస్ ఆడటానికి తన శరీరం, మనసు ఏమాత్రం సహకరించడంలేదని..ఇలాంటి స్థితిలో రిటైర్మెంట్ ప్రకటించడమే మేలని భావించానని ఫెదరర్ తన ప్రకటనలో వివరణ ఇచ్చాడు.

టెన్నిస్ ప్రపంచం తనను ఎంతో ఉదారంగా ఆదరించిందని, తనకు పేరుప్రఖ్యాతులు, కోట్లాదిమంది అభిమానులను అందించిన ఈ రాయల్ గేమ్ కు సదారుణపడి ఉంటానని ప్రకటించాడు.

వచ్చే వారం జరిగే రాడ్ లేవర్ కప్ టోర్నీనే తన కెరియర్ లో ఆఖరి టోర్నీగా ఉంటుందని తెలిపాడు.

అరుదైన రికార్డుల ఫెదరర్...

రోజర్ ఫెదరర్ తన 24 సంవత్సరాల టెన్నిస్ కెరియర్ లో 310 వారాలపాటు ప్రపంచ నంబర్ వన్ హోదా అనుభవించాడు. వరుసగా 237 వారాలు నంబర్ వన్ ర్యాంక్ సాధించడం ద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. ఐదుసార్లు సంవత్సరాంతపు నంబర్ వన్ స్థానం సాధించిన మొనగాడు ఫెదరర్ మాత్రమే. ఎనిమిది వింబుల్డన్ టైటిల్స్, ఓ ఫ్రెంచ్, ఆరు ఆస్ట్ర్రేలియన్ ఓపెన్, ఐదు అమెరికన్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన అసాధారణ రికార్డు ఫెదరర్ కు మాత్రమే సొంతం. గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలో 20 టైటిల్స్ సాధించిన తొలి ఆటగాడి గౌరవాన్ని ఫెదరర్ దక్కించుకొన్నాడు. రికార్డుస్థాయిలో ఐదుసార్లు లారెస్ స్పోర్ట్స్ మాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు గెలుచుకొన్నాడు.

టెన్నిస్ క్రీడకు సరికొత్త గ్లామర్ తో పాటు...కోట్లాదిమంది అభిమానులను సంపాదించి పెట్టిన మొనగాడు రోజర్ ఫెదరర్. 2003లో తన మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను లండన్ లోని వింబుల్డన్ సెంటర్ కోర్టులో అందుకొన్న ఫెదరర్ ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసిందిలేదు. ఒకటి కాదు రెండు కాదు...ఏకబిగిన 24 సంవత్సరాలపాటు తన జైత్రయాత్రను కొనసాగించాడు.

స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్, సెర్బియన్ థండర్ నొవాక్ జోకోవిచ్ ప్రధాన ప్రత్యర్థులుగా అంతులేని పోరాటమే చేశాడు. 2006 సీజన్లో అత్యధికంగా 12 సింగిల్స్ టైటిల్స్ తో పాటు 92 విజయాలు, 5 పరాజయాల రికార్డు నమోదు చేశాడు. తాను పాల్గొన్న 17 టోర్నీలలో 16 టో్ర్నీల ఫైనల్స్ చేరడం ద్వారా తనకుతానే సాటిగా నిలిచాడు.

ఇటు నడాల్...అటు జోకోవిచ్...

ప్రపంచ పురుషుల టెన్నిస్ లో ఫెదరర్ అంటే అతని ప్రధాన ప్రత్యర్థులు రాఫెల్ నడాల్, నొవాక్ జోకోవిచ్ లకు అంతులేని గౌరవం. ఫెదరర్ ను ప్రత్యర్థిగా కంటే గొప్పస్నేహితుడిగానే పరిగణించారు. నడాల్ ప్రత్యర్థిగా 40సార్లు తలపడిన ఫెదరర్ కు 16 విజయాలు, 24 పరాజయాలు, జోకోవిచ్ ప్రత్యర్థిగా 23-27 రికార్డు ఉంది.

2008లో నడాల్ పైన, 2019లో జోకోవిచ్ తో తలపడిన వింబుల్డన్ ఫైనల్స్ లో ఫెదరర్ 4 గంటల పాటు పోరాటం చేయడం అభిమానులకు కలకాలం గుర్తుండిపోతుంది.

ఫౌండేషన్ ద్వారా సహాయకార్యక్రమాలు..

టెన్నిస్ క్రీడాకారుడిగా గత రెండున్నర దశాబ్దాల కాలంలో ఫెదరర్ 103 మిలియన్ డాలర్లు సంపాదించాడు. తన పేరుతో ఏర్పాటు చేసిన ఓ ట్రస్టు ద్వారా అట్టడుగు వర్గాలకు చెందిన బాలల విద్య, క్రీడల కోసం కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తున్నాడు. 2010 హైటీ బాధితులకు సైతం భూరివిరాళం అందచేశాడు.

2018లో తన చివరి గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన ఫెదరర్ ఆఖరి గ్రాండ్ స్లామ్ టోర్నీని 2021లో ఆడటం విశేషం.

రెండుజంటల కవల పిల్లలకు తండ్రిగా ఉన్న ఫెదరర్ తన తల్లి,తండ్రి, భార్య మికాతో కలసి రిటైర్మెంట్ జీవితాన్ని ఆస్వాదించాలని భావిస్తున్నాడు. ఫుట్ బాల్ లో ఓ మారడోనా, క్రికెట్లో ఓ సచిన్ టెండుల్కర్, చదరంగంలో ఓ విశ్వనాథన్ ఆనంద్ ఎంతటి ఘనులో...టెన్నిస్ లో రోజర్ ఫెదరర్ అంతే మొనగాడు.

రోజర్ ఫెదరర్ గౌరవార్థం స్విట్జర్లాండ్ ప్రభుత్వం 20 ఫ్రాంకుల నాణాలను ముద్రించిందంటే ..అతనికున్న గౌరవం ఏపాటిదో మరి చెప్పాల్సిన పనిలేదు.

ఫెదరర్ లాంటి మరో అసాధారణ ఆటగాడిని చూడాలంటే..టెన్నిస్ అభిమానులు, క్రీడాప్రపంచం మరెంతకాలం వేచిచూడాలో మరి.!



First Published:  16 Sep 2022 5:37 AM GMT
Next Story