Telugu Global
Sports

ఒంటికాలితో 104 రోజుల్లో 104 మారథాన్లు!

పరుగు ఎన్నో రకాలు. 42 కిలోమీటర్ల (26.2 మైళ్లు ) దూరం సాగే మారథాన్ పరుగులో పాల్గొనాలంటే రెండు కాళ్లు ఉన్నవారే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు.

ఒంటికాలితో 104 రోజుల్లో 104 మారథాన్లు!
X

పరుగు ఎన్నో రకాలు. 42 కిలోమీటర్ల (26.2 మైళ్లు ) దూరం సాగే మారథాన్ పరుగులో పాల్గొనాలంటే రెండు కాళ్లు ఉన్నవారే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అయితే..ఒంటికాలితో, అదీ కృత్రిమపాదంతో 104 రోజుల్లో 104 మారథాన్ రేస్ ల్లో పాల్గొని గమ్యం చేరటానికి ఎన్ని గుండెలు కావాలి, ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి.

అయితే అరుదైన ఈ ఘనతను దక్షిణాఫ్రికాకు చెందిన జాకీ హంట్ సొంతం చేసుకొంది. 104 రోజుల్లో 104 మారథాన్ రేస్ లు పూర్తి చేసి గిన్నిస్ బుక్ రికార్డును తిరగరాసింది. 46 సంవత్సరాల వయసులో అరుదైన ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డుల్లో చేరింది.

బోన్ క్యాన్సర్ నే జయించి...

జాకీ హంట్ -బోయెర్స్ మా. దక్షిణాఫ్రికాలో జన్మించి అమెరికాలోని ఆరిజోనాలో నివాసం ఏర్పరచుకొన్న అల్ట్ర్రా మారథాన్ రన్నర్. ఇద్దరు పిల్లల తల్లిగా కుటుంబబాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఎడమకాలి భాగంలో అత్యంత అరుదైన క్యాన్సర్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.

26 సంవత్సరాల క్రితం అరుదైన బోన్‌(ఎముక) క్యాన్సర్‌ వ్యాధి పూర్తిగా నిర్ధారణ అయిన తర్వాత వైద్యుల సూచన మేరకు ఎడమకాలుకు శస్త్రచికిత్స చేసి మోకాలి దిగువభాగాన్ని తొలగించారు. అప్పటి వరకూ ఎంతో ఆరోగ్యవంతురాలిగా ఉన్న జాకీ ఒక్కసారిగా అంగవికలురాలిగా మారిపోయింది.


గిన్నిస్ రికార్డు దాసోహం...

ఈ క్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా లెక్కచేయకుండా హంట్‌ ముందుకు సాగింది. ఓ వైపు ఇద్దరు బిడ్డల తల్లిగా, గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. 2016లో మారథాన్‌ పరుగును ఓ వ్యాపకంగా ఎంచుకొంది. ఆర్ధికంగా, శారీరకంగా, మానసికంగా తనకుతానే సవాలు విసురుకొంది.

పరుగెడతానికి వీలైన కృత్రిమ ఫైబర్ ప్లేట్ పాదం కోసం..లక్షా 92000 డాలర్ల భారీమొత్తాన్ని పలుమార్గాల ద్వారా సమకూర్చుకొంది.

నిరంతరం సాధనకు పట్టుదల, మొండితనాన్ని జోడించి తనకుతానే స్ఫూర్తిగా నిలిచింది.

హంట్‌ 46 సంవత్సరాల వయసులో 100 రోజుల్లో 100 మారథాన్ రేస్ లు పూర్తి చేయాలని లక్ష్యంగా ఎంచుకొంది. అయితే 2020లోనే దివ్యాంగ రన్నర్‌ కేట్‌ జైడెన్‌ 101 రోజుల్లో 101 మారథాన్‌లు పూర్తి చేసింది. దీంతో లక్ష్యం మార్చుకొన్న జాకీ హంట్‌ 104 రోజుల్లో 104 మారథాన్లు పూర్తి చేయాలని నిర్ణయించుకొంది.

ఈ అలుపెరుగని మహాపరుగు క్రతువులో జాకీ హంట్‌ ఏకంగా 4వేల 390 కిలోమీటర్ల దూరం పరుగెత్తి గిన్నిస్ బుక్ రికార్డును తిరగరాయటం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పింది.

ఈ రికార్డును అధికారికంగా నమోదు చేయటానికి గిన్నిస్ రికార్డుల సంస్థ ప్రతినిధులు మూడుమాసాల సమయం తీసుకొన్నారు.

మానసికంగా ఎంతగానో కృంగిపోయినా ,అంగవైకల్యం ఆటంకంగా మారినా..మొక్కవోని దీక్షతో జాకీ హంట్‌ 2021 జనవరిలో తన పరుగు ప్రయాణం మొదలుపెట్టింది. ఏకబిగిన 104 రోజుల్లో 104 మారథాన్లు పూర్తి చేసి సరికొత్త గిన్నిస్‌ రికార్డును నెలకొల్పింది.పరుగుతోనే సంపూర్ణ ఆరోగ్యం..

104 మారథాన్ రేసులు పూర్తి చేసిన తర్వాత జాకీ హంట్ ఆనందాన్ని అవధులు లేకుండా పోయాయి. 104వ రేస్ తర్వాత పసిపాపలా కేరింతలు కొట్టింది. ఈ ప్రపంచాన్నే జయించినంతగా గాల్లో తేలిపోయింది. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. పరుగు అనేది నా మానసిక స్థితిపై అంతులేని సానుకూల ప్రభావం చూపించింది. పరుగు ద్వారా నా శరీరం ఎంత ధృడమైందో తెలిసి వచ్చింది. 104 రోజుల్లో 104 మారథాన్ రేస్ లు, 4వేల 390 కిలోమీటర్ల ( 2వేల 728 మైళ్ల )దూరం పరుగుతో నా సామర్థ్యం ఏంటో ప్రపంచానికి చాటి చెప్పినట్లయ్యిందని జాకీహంట్ తన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకొంది.

క్యాన్సర్ మహమ్మారిని జయించి, అంగవైకల్యాన్ని అధిగమించి 46 సంవత్సరాల వయసులో జాకీ హంట్ సాధించిన విజయం, ఘనత, రికార్డు... ఎందరికో స్ఫూర్తిదాయకంగా మిగిలిపోతుంది.Next Story