Telugu Global
Sports

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లో ఈసారి స్పానిష్ బుల్ కు కష్టమే!

కొత్తసంవత్సరంలో తొలిగ్రాండ్ స్లామ్ టోర్నీకి మెల్బోర్న్ లో రంగం సిద్ధమయ్యింది

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లో ఈసారి స్పానిష్ బుల్ కు కష్టమే!
X

కొత్తసంవత్సరంలో తొలిగ్రాండ్ స్లామ్ టోర్నీకి మెల్బోర్న్ లో రంగం సిద్ధమయ్యింది. మాజీ చాంపియన్ నొవాక్ జోకోవిచ్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంటే..ప్రస్తుత చాంపియన్ ,స్పానిష్ బుల్ నడాల్ పరిస్థితి అయోమయంగా తయారయ్యింది...

ప్రపంచ టెన్నిస్ 2023 గ్రాండ్ స్లామ్ సీజన్ తొలిటోర్నీకి..ఆస్ట్రేలియా వాణిజ్యరాజధాని మెల్బోర్న్ లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. రేపటినుంచి రెండువారాలపాటు సాగే ఈ గ్రాండ్ టోర్నీకి టాప్ ర్యాంకర్ కార్లోస్ అల్ కరాజ్ దూరం కాగా మాజీ చాంపియన్ నొవాక్ జోకోవిచ్ హాట్ ఫేవరెట్ గా టైటిల్ వేటకు దిగుతున్నాడు.

పరాజయాల ఊబిలో నడాల్..

గతేడాది జరిగే ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను అనూహ్యంగా గెలుచుకొన్న స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ ప్రస్తుత పరిస్థితి మాత్రం అయోమయంగా తయారయ్యింది.

తన కెరియర్ లో ఇప్పటికే 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన 36 సంవత్సరాల నడాల్ ప్రస్తుత సీజన్లో మాత్రం పరాజయాల ఊబిలో చిక్కుకొన్నాడు. ఆడిన గత ఏడుమ్యాచ్ ల్లో ఆరు పరాజయాలు చవిచూశాడు.

రెండోర్యాంకర్ గా, టాప్ సీడ్ హోదాలో టైటిల్ నిలుపుకోడానికి బరిలో నిలిచాడు. తొలిరౌండ్ లో బ్రిటన్ ఆటగాడు జాక్ డ్రాపర్ తో నడాల్ తలపడనున్నాడు. 21 సంవత్సరాల జాక్ నుంచి నడాల్ కు గట్టిపోటీ ఎదురుకానుంది.

టైటిల్ నిలుపుకోవాలంటే..ప్రతిభ ఉన్న ఆటగాళ్లతోనే తలపడటం ఉత్తమం అని నడాల్ చెప్పాడు. గతేడాది ఫైనల్లో మెద్వదేవ్ తో జరిగిన టైటిల్ సమరం మొదటి రెండుసెట్లూ ఓడినా..ఆఖరి మూడుసెట్లూ నెగ్గడం ద్వారా విజేతగా నిలిచిన నడాల్ లో ప్రస్తుతం ఆ స్థాయి ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు.

గతేడాది రన్నరప్ మెద్వదేవ్ మాత్రం తన తొలిరౌండ్ పోరులో అమెరికా ఆటగాడు మార్కోస్ గిరోన్ తో తలపడనున్నాడు.

హాట్ ఫేవరెట్ గా జోకోవిచ్..

ఏడాది విరామం తర్వాత ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ బరిలో నిలిచిన మాజీ చాంపియన్ జోకోవిచ్ మరోసారి హాట్ ఫేవరెట్ గా టైటిల్ వేట కొనసాగించనున్నాడు. తన కెరియర్ లో ఇప్పటికే తొమ్మిదిసార్లు ఆస్ట్ర్రేలియన్ టైటిల్ నెగ్గిన జోకోవిచ్ రికార్డుస్థాయిలో పదోసారి విజేతగా నిలిచే అవకాశాలున్నాయి.

35 సంవత్సరాల జోకోవిచ్ తొలిరౌండ్లో స్పానిష్ ఆటగాడు రాబెర్టో కార్బెల్లాస్ బియానో తో తలపడనున్నాడు. రికార్డుస్థాయిలో పదోసారి ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గడంతో పాటు..నడాల్ పేరుతో ఉన్న 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ రికార్డును సమం చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు.

నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్, గ్రీక్ వీరుడు స్టెఫానోస్ సిటిస్ పాస్ ల నుంచి గట్టిపోటీ ఎదుర్కోనున్నాడు.

మహిళల సింగిల్స్ లో స్వయ్ టెక్ ..

మహిళల సింగిల్స్ లో ఇగా స్వయిటెక్ టాప్ సీడ్ గా టైటిల్ వేటకు దిగుతోంది. గత మార్చిలో టాప్ ర్యాంకర్ బార్టీ అర్థంతరంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇగా స్వయిటెక్ ఇప్పుడు హాట్ ఫేవరెట్ గా నిలిచింది.

పోలెండ్ కు చెందిన ఇగా 2022 సీజన్లో ఎనిమిది డబ్లుటిఏ టైటిల్స్ నెగ్గడం ద్వారా సంచలనం సృష్టించింది. ఫ్రెంచ్ ఓపెన్ తో సహా రెండు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సైతం నెగ్గడం ద్వారా సత్తా చాటుకొంది.

సెరెనా విలియమ్స్, నయోమీ ఒసాకా సైతం టోర్నీకి దూరం కావడంతో స్వయిటెక్ మహిళల టైటిల్ నెగ్గడం ఖాయమని భావిస్తున్నారు.

తొలిరౌండ్లో జర్మన్ ప్లేయర్ జూలీ నీమియర్ తో తొలిరౌండ్లో స్వయిటెక్ తలపడనుంది. అమెరికాకు చెందిన 3వ ర్యాంకర్ జెస్సీకా పెగ్యులా సైతం ఫేవరెట్ల వరుసలో నిలిచింది.

6వ సీడన్ మారియా సక్కారీ, 7వ సీడ్ కోకో గాఫ్, మాజీ విన్నర్ విక్టోరియా అజెరెంకా, కెనిన్ సైతం తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నారు.

పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 15 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు.


First Published:  15 Jan 2023 8:28 AM GMT
Next Story