Telugu Global
Sports

హైదరాబాద్ టెస్ట్ మూడురోజుల ముచ్చటేనా?

హైదరాబాద్ వేదికగా ఆరేళ్ల విరామం తరువాత జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ మూడురోజుల ముచ్చటగా ముగిసిపోయే ప్రమాదం కనిపిస్తోంది.

హైదరాబాద్ టెస్ట్ మూడురోజుల ముచ్చటేనా?
X

హైదరాబాద్ వేదికగా ఆరేళ్ల విరామం తరువాత జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ మూడురోజుల ముచ్చటగా ముగిసిపోయే ప్రమాదం కనిపిస్తోంది. తొలిరోజుఆటలోనే స్పిన్ బౌలర్ల హవా ప్రారంభమయ్యింది...

భారత్- ఇంగ్లండ్ జట్ల ఐసీసీ టెస్ట్ లీగ్ ..పాంచ్ పటాకా సిరీస్ సిన్నర్ల హవాతో ప్రారంభమయ్యింది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మొదలైన తొలిటెస్టు తొలిరోజుఆటలోనే ఇంగ్లండ్ 246 పరుగులకే ఆలౌట్ కాగా..భారత్ వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది.

రెండుజట్ల స్పిన్నర్లు కలసి తొలిరోజుఆటలోనే 11 వికెట్లు పడగొట్టడం ప్రమాదఘంటికలను మోగిస్తున్నాయి.

భారత స్పిన్నర్ల ముప్పేట దాడి....

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కీలక టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొనే సాహసం చేశాడు. హైదరాబాద్ రాజీవ్ స్టేడియం పిచ్ మొదటిరోజు ఆటలో బౌలర్లకు అనుకూలించడం ఆనవాయితీగా వస్తోంది.

దీనికితోడు ఆట మొదటి సెషన్ లో మంచుతో కూడిన చల్లటి వాతావరణం, పొడిబారిన పిచ్ లోనే తేమను సైతం భారత స్పిన్ త్రయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని ఇంగ్లండ్ టాపార్డర్ ను దెబ్బ మీద దెబ్బ కొడుతూ తేరుకోనివ్వకుండా చేశారు.

సచిన్ రికార్డును అధిగమించిన రూట్...

ఇంగ్లండ్ ఓపెనింగ్ జోడీ జాక్ క్రాలే- డకెట్ మొదటి వికెట్ కు 55 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభాన్ని ఇచ్చినా..ఆట 12వ ఓవర్లో 35 పరుగులు సాధించిన డకెట్ ను అశ్విన్ పడగొట్టడంతో ఇంగ్లండ్ వికెట్ల పతనానికి తెరలేచింది.

మరో ఓపెనర్ క్రాలే 20 పరుగుల స్కోరుకు అశ్విన్ బౌలింగ్ లోనే చిక్కాడు. వన్ డౌన్ వోలీ పోపీ 1 పరుగుకే అవుటయ్యాడు. రెండోడౌన్లో బ్యాటింగ్ కు దిగిన స్టార్ బ్యాటర్ జో రూట్ 60 బంతుల్లో 29 పరుగుల స్కోరుకు అక్షర్ పటేల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకూ మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న అత్యధిక పరుగుల రికార్డును రూట్ అధిగమించగలిగాడు.

భారత్- ఇంగ్లండ్ జట్ల ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్ ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా జో రూట్ నిలిచాడు. మాస్టర్ సచిన్ పేరుతో ఉన్న 2535 పరుగుల రికార్డును రూట్ 2554 పరుగులతో తెరమరుగు చేశాడు.

2348 పరుగులతో సునీల్ గవాస్కర్, 2431 పరుగులతో అలీస్టర్ కుక్, 1991 పరుగులతో విరాట్ కొహ్లీ ఆ తర్వాతి స్థానాలలో నిలిచారు.

ఇంగ్లండ్ కెప్టెన్ ఎదురుదాడి...

మిడిలార్డర్లో బెయిర్ స్టో 37, ఫోక్స్ 4, రేహాన్ అహ్మద్ 13 పరుగులకు వెంటవెంటనే అవుట్ కావడంతో ఇంగ్లండ్ 193 పరుగులకే 8 వికెట్లు నష్టపోయి పీకలోతు కష్టాలలో కూరుకుపోయింది. అయితే..కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒంటరిపోరాటం చేసి 70 పరుగుల స్కోరుతో తనజట్టు పరువు దక్కించాడు. స్టోక్స్ 88 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో ఫైటింగ్ హాఫ్ సెంచరీ సాధించడంతో ఇంగ్లండ్ 246 పరుగులకు ఆలౌటయ్యింది.

భారత బౌలర్లలో స్పిన్ త్రయం కలసి 8 వికెట్లు, ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు.

అశ్విన్- జడేజా జోడీ సరికొత్తరికార్డు...

భారత స్పిన్ జోడీ అశ్విన్- జడేజా చెరో మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా ఓ అరుదైన రికార్డు నెలకొల్పారు. అనీల్ కుంబ్లే- హర్భజన్ సింగ్ జోడీ పేరుతో ఉన్న 501 వికెట్ల రికార్డును తెరమరుగు చేశారు.

భారత టెస్టు చరిత్రలో జంటగా అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల ఘనతను అశ్విన్, జడేజా సొంతం చేసుకోగలిగారు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జోడీ ప్రపంచ రికార్డు జేమ్స్ యాండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ ల పేరుతో ఉంది. 138 టెస్టుల్లో 1039 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచారు.

భారత బౌలర్లలో అశ్విన్- జడేజా జోడీ 502 వికెట్లు, కుంబ్లే- హర్భజన్ జోడీ 501 వికెట్లు, జహీర్ ఖాన్- హర్భజన్ 474 వికెట్లు సాధించారు. కంగారూ జోడీ మిషెల్ స్టార్క్- నేథన్ లయన్ జోడీ 81 టెస్టుల్లో 643 వికెట్లతో రెండోస్థానంలో కొనసాగుతున్నారు.

అశ్విన్ 150 వికెట్ల రికార్డు....

ఐసీసీ టెస్టు లీగ్ చరిత్రలో 150 వికెట్లు పడగొట్టిన భారత తొలి బౌలర్ ఘనతను ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సాధించాడు. ఇంగ్లండ్ తో తొలిఇన్నింగ్స్ లో 18 ఓవర్లలో 88 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టడం ద్వారా 150 వికెట్ల మైలురాయిని చేరుకోగలిగాడు.

టెస్టు క్రికెట్లో 500 వికెట్ల రికార్డుకు అశ్విన్ మరో 7 వికెట్ల దూరంలోనిలిచాడు.

భారత ఓపెనర్ల మెరుపు భాగస్వామ్యం..

ఇంగ్లండ్ ను 246 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ కు ఓపెనింగ్ జోడీ రోహిత్- యశస్వి జైశ్వాల్ కేవలం 12.2 ఓవర్లలోనే 80 పరుగుల భాగస్వామ్యంతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు.

రోహిత్ 24 పరుగుల స్కోరుకు అవుట్ కాగా..యువజోడీ యశస్వి 80, శుభ్ మన్ గిల్ 15 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. భారత్ తొలిరోజు ఆటను 121 పరుగులకు ముగించింది.

రానున్న రోజుల్లోనూ స్పిన్నర్లు చెలరేగిపోడం ఖాయంగా కనిపిస్తోంది. ఐదురోజులపాటు జరగాల్సిన ఈ టెస్టు మ్యాచ్ మూడురోజుల ముచ్చటగా ముగిసిపోడం ఖాయంగా కనిపిస్తోంది.

తొలి ఇన్నింగ్స్ లో భారత్ 300 స్కోరు సాధించగలిగితే...టెస్టు పై పట్టు బిగించే అవకాశం ఉంది.

First Published:  26 Jan 2024 4:58 AM GMT
Next Story